సెట్లో తుమ్మినా ద‌గ్గినా ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్!

షూటింగ్ ఫర్మిషన్ ఇచ్చారు… హమ్మయ్య… ఒక్క నిముషం రిలీఫ్..
ఎలా చేస్తాం.. ఏం చేయాలి.. రూల్స్ సంగ‌తేమిటి!!

అంత మంది క్రూతో కరోనా నుంచి కాపాడుకుంటూ ఆ ఒత్తిడి ప్రాజెక్టు మీద పడకుండా పూర్తి చేయగలమా.. వెంటనే ఓ పెద్ద సందేహం సినిమా వాళ్ల ముందు నిలబడుతోంది. సెట్ లో ఎవరు కాస్త తుమ్మినా, దగ్గినా కూడా అందరూ భయపడాల్సిందే కదా. ముఖ్యంగా ఏ మాత్రం సరిగ్గా మ్యానజ్ చేయకపోయినా, జాగ్రత్తలు తీసుకోలేకపోయినా పెద్ద ఆర్టిస్ట్ లు ఎవరూ ధైర్యం చేసి సెట్ కు రారు కదా… ఏం చెయ్యాలి దర్శక, నిర్మాతలకు ఆలోచన..అంతేనా..

ఏమయ్యా…అసిస్టెంట్స్ అంతా ఎక్కడా…హీరో గారిని…పిలవండి…
మేకప్ అసెస్టెంట్ ఎక్కడా..టచప్ చెయ్యాలి..
అబ్బబ్బా…ఈ స్క్రిప్టు కాగితాలు ఏం చేసారు..
కాస్ట్యూమ్స్ అతన్ని పిలవండి…నేను ఏ డ్రెస్ చెప్పాను..అతనేం తెచ్చాడు..బుద్ది ఉండక్కర్లా..
కెమెరామెన్ ఓకేనా…
యాక్షన్..స్టార్ట్..కెమెరా వెనక ఇంత హడావిడి..హంగామా

త్వరలో ప్రారంభమయ్యే షూటింగ్ లలో ఇవన్నీ ఉంటాయా…అంటే ఉంటాయి అయితే..తగు జాగ్ర‌త్త‌ల‌తో మాత్రమే అనే కండీషన్ ప్రక్కనే పొంచి ఉంటుంది. ఒకప్పటిలా  స్వేచ్ఛ‌గా జరుపుకునే షూటింగ్ డేస్ అయితే కొంతకాలం పాటు క‌చ్చితంగా ఉండవు. ఈ క్రమంలో కరోనా టైమ్ లో షూటింగ్ లు పెట్టుకుంటే..  ఎలా ఉంటుంది..ఎలా ఉండబోతుంది…?

1. మొదట సినిమా షూటింగ్ లో పాల్గొనే క్రూ అందరికీ కరోనా టెస్ట్ లు చేయంచాలి.అదీ నిర్మాత ఖర్చుమీద. లేకపోతే 4,500 ఖర్చుపెట్టుకుని టెస్ట్ చేయించుకుని షూటింగ్ కు వచ్చేదెవరు..అంత భరించే శక్తి సగటు లైట్ మ్యాన్, మేకప్ బోయ్ స్దాయి వాళ్లకు ఉంటుందా..ఉండదు.

2.ఇంతకు ముందు లాగ `హమ్ ఆప్ హై కౌన్` తరహా మూవీస్ తీయటం కష్టం. అలాగే బాహుబలి లాంటి యుద్ద సన్నివేశాలు తీసేటంత సన్నివేశం కూడా ప్రస్తుతానికి  లేదు. ప్ర‌తీ ఫ్రేమ్ లోనూ వంద‌లాది మంది జూనియ‌ర్ ఆర్టిస్టులని తెచ్చిపెట్టడం కష్టం.

అయినా సరే డైరక్టర్ మనస్సు కష్టపెట్టుకోకుండా ఫ్రేమ్ నింపాలంటే నిర్మాత..అవసరమైన జూనియర్ ఆర్టిస్ట్ లు అందరికీ కరోనా టెస్ట్ లు చేయించాలి. రోజుకు ఆరేడు వందలు ఇచ్చేవాళ్లకు 4,500 లు పెట్టి టెస్ట్ లు చేయంచటం అంటే కన్నీళ్ల ప్రాయమే. కాబట్టి అలాంటి సీన్స్  ఉంటే మార్చి రాసుకోవడ‌మో, లేదంటే.. గ్రాఫిక్స్,విజువల్ ఎఫెక్ట్స్ అంటూ , సినిమా టెక్నిక్స్ ని వాడేసుకోవటమో చేయాలి. నిర్మాత నేను భరించగలను అంటే జూనియర్ ఆర్టిస్ట్ లకు అన్నదాత అని ఆయన్ను గౌరవించవచ్చు.

3. అన్నిటికన్నా పెద్ద సమస్య…ఓసారి కరోనా టెస్ట్ చేయించి లోపలకు క్రూ వచ్చాక, మళ్లీ వారిని బయిటవాళ్లతో కలవనియ్యకుండా కాపాడుకోవటం. అంటే షూటింగ్ జరిగినన్ని రోజులూ వాళ్లను బయిటకు వెళ్లనీయకుండా చూడగలగాలి. దాదాపు ఫారిన్ షూటింగ్ షెడ్యూల్ లాగ..ఎవ్వరూ ఇళ్లకు వెళ్లకూడదు. సాయింత్రం అయ్యింది కదాని రిలాక్సేషన్ కు బయ‌టకు వెళ్ళకూడదు. వెళ్తే కథ మళ్లీ మొదటకి వస్తుంది. ఇలా ఎవరూ బయిటకు వెళ్లకుండా చూడటం కోసం కొందరు వ్యక్తులను నియమించాలి. వాళ్లు కరప్ట్ అయ్యిపోకుండా కన్నేసుకోవాలి.

4. కూరగాయలు, పళ్లు, నిత్యం వంటకు సరపడ సామాను కోసం బయిటకు వెళ్లే వాళ్ళు సెపరేట్ గా ఉండాలి. వాళ్ళని డైరక్ట్ గా టీమ్ తో కలవనియ్యకూడదు. అలాగే బయిట నుంచి వచ్చిన ఆహారాలను నిషేధించాలి.హోటల్ నుంచి క్యారేజ్ లు తెప్పిద్దాం అనే కాన్సెప్టు తప్పించాలి.
5.ఇక షూటింగ్ లొకేషన్స్ పూర్తిగా షూటింగ్ కు  శానిటైజ్ చేయించాలి. షూటింగ్ పూర్తైన తర్వాత ఆ లొకేషన్ ని శానిటైజ్ చేయాలి.
6. షూటింగ్ లొకేషన్స్ అందరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్ లు, శానిటైజర్స్ వాడాలి. అందుకు నిర్మాత భాధ్యత వహించాలి. అప్పుడు ఎంత పెద్ద క్రూతో అయినా షూట్ చేసుకోవచ్చు.

7.ఫిల్మ్ షూటింగ్ లను ఎక్కువగా జనం గేదర్ అయ్యే చోట చేయకూడదు. ఫిల్మ్ టీమ్ తప్పించి ఒక్కరు కూడా బయిటవాళ్లు షూటింగ్ స్పాట్ కు రాకూడదు. ఫ్రెండ్స్, రెలిటివ్స్, విజిటర్స్ పూర్తిగా నిషిధ్దం.
 8. ఏ షూటింగ్ అయినా ఇండియాలో కరోనా లేని ప్రాంతాల్లో గ్రీన్ జోన్ లోనే జరుపుకోవాలి.విదేశాలకు వెళ్లటానికి ఫర్మిషన్ లేదు.
 9.షూట్ పూర్తయ్యాక వెంటనే జనాల్లోకి వెళ్లిపోకూడదు. షూట్ పూర్తయ్యినా కొంతకాలం దాకా ఎవరితో కలవకూడదు.
10. సెట్ లో ఓ క్వారెంటైన్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి
11. ఓ డాక్టర్ ఎప్పుడూ సెట్ లో అందుబాటులో ఉండాలి. కరోనా లక్షణాలు వెంటనే పసిగట్టగలగాలి.
12. సెట్ పరిశరాలు, టీమ్ తీసుకునే ఆహారం చాలా పరిశుభ్రంగా ఉండాలి.
13. ఎలాంటి పరిస్దితుల్లో అయినా మానసిక స్ధైర్యం కోల్పోకుండా,పానిక్ అవ్వకుండా ఓ సైకాలిజిస్ట్ అండ అవసరం.
14.ఎవరి కుర్చీల్లో వాళ్లే కూర్చునేలా, వాళ్ల బెడ్ పై వాళ్లే పడుకునేలా శానిటైజ్ చేసి, వాళ్ల పేరు రాసి పెట్టాలి.
15.బట్టలు ఉతికే కార్యక్రమం బయిట పెట్టకుండా అక్కడే డ్రైయిర్, వాషర్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
16. ప్రతీ నాలుగు గంటలకు కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేయాలి. శుభ్రంగా ఉతకాలి. అందరివీ కలిపి కాకుండా విడివిడిగా ఉతుకుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
17. సెట్ లో ఎక్కడా గుట్కా, పాన్,సిగరెట్ వంటివి పెట్టుకోకుండా చూడాలి. మాగ్జిమం ఉమ్మి వేయకుండా చూడాలి.
18. అంబులెన్స్ షూటింగ్ స్పాట్ లో తప్పనిసరిగా ఉండాలి.
 19. ఎవరి మేకప్ లు వాళ్లే వేసుకోవాలి..చాలా మందికి పౌడర్ కరెక్ట్ గా రాసుకోవటమే రాదు…ఇంక మేకప్ చేసుకుంటే అన్నీ హారర్ సినిమాలే తీయాలి, లిప్ లాక్ లతో నడిచే అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100లు కుదవరు..

20. ఇంతా కష్టపడి షూటింగ్ పూర్తి చేసుకున్నా…థియోటర్స్ ఓపినింగ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.  కరోనా జాగ్రత్త ఖర్చులతో కలిసి   అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మనం చెప్పిన రేటుకు కొనాలి. లేకపోతే డిజిటల్ రిలీజ్ చేసుకోవాలి.

ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…చావుకి ప‌దిమంది, పెళ్లికి 20 మంది అంటూ రూల్స్ పెట్టిన గవర్నమెంట్.. సినిమా షూటింగుల‌కు 30  మందే ఉండాల‌ని రూల్ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..అందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడు టీమ్ లో అందరిపై భారం పడుతుంది. అసెస్టెంట్స్,అశోసియేట్స్ తగ్గితే పని భారం కో డైరక్టర్ పైనా, డైరక్టర్ పైనా పడుతుంది. అలాగే ప్రతీ డిపార్టమెంట్ పరిస్దితి కూడాను. వీటిన్నటినీ అధిగమిస్తూ షూటింగ్ చేసుకోవటం సవాలే. కానీ సవాళ్లు వచ్చినప్పుడే కదా మనలో ఉన్న నిజమైన ప్రతిభ బయిటపడేది అని ధైర్యం తెచ్చుకుని ముందుకుపోవటమే తప్పించి, ఇండస్ట్రీ వారికి ప్రస్తుతానికి వేరే దారి లేదు.