రాఘవేంద్ర రావు పేకప్ చెప్పగానే .. శారద  ఏడ్చేసింది ..?

ఇది 1991 మేలో జరిగిన సంగతి . జ్ఙాపకాల పొరల్లో కదులుతూనే వుంది . మూవీమొఘల్ రామానాయుడు  రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా కూలీ నెంబర్ 1 అనే సినిమా రూపొందిస్తున్నాడు . ఈ సినిమా ద్వారా టాబును హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. టబు  పూర్తి పేరు  తబస్సుమ్ ఫాతిమా హష్మీ. ఈ అమ్మాయిది హైదరాబాద్. ముస్లిం కుటుంబం నుంచి వచ్చినా ఇక్కడే చదవడం వల్ల  తెలుగు బాగా వచ్చు.

రామానాయుడు తన కుమారుడు వెంకటేశ్ ను కలియుగ పాండవులు ద్వారా  తెలుగు సినిమా రంగానికి హీరోగా పరిచయం చేశాడు . వెంకటేష్ మొదటి సినిమాకు దర్శకుడు రాఘవేంద్ర రావే . కూలీ నెంబర్ 1 కు కూడా రాఘవేంద్ర రావుని ఎంపిక చేశారు .  నటీనటులను చక్కగా మౌల్డ్ చేయడంలో సిద్దహస్తులు రాఘవేంద్ర రావు . పాటలను తీయడంలో కూడా ఆయన తనదైన ముద్ర వేస్తాడు .

కూలి నెంబర్ 1 లో వెంకటేష్ , టబు, రావు గోపాల రావు , మోహన్ బాబు , శారద ,కోట శ్రీనివాసరావు , బ్రహ్మానందం , నిర్మలమ్మ, బాబు మోహన్ తదితరులు నటించారు . ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది .రామానాయుడు గారిని కలుద్దామని ఫిలిం నగర్లో వున్న  వారి గెస్ట్  హౌస్ కు  వెళ్ళాను . ఆయన కథ వింటున్నాడు  . నేను వచ్చానని తెలుసుకొని బయటకు వచ్చాడు . ” ఏమ్మా .. అర్జెంటా ?” అన్నారు . “కూలీ నెంబర్ గురించి మాట్లాడదామని వచ్చా నాయుడు గారు ” “అలాగా అయితే ఓ పని చెయ్ , కూలీ నెంబర్ సినిమా షూటింగ్  అపోలో గుడి గ్గర జరుగుతుంది , అక్కడికి వెళ్ళిరా , ఈ లోపల నేను ఇది పూర్తి చేస్తా ?” అన్నారు . అప్పుడే కారు షూటింగ్ దగ్గరకు వెడుతుంటే అందులో వెళ్ళమని చెప్పారు. నేను వెళ్ళేటప్పటికి అపోలో హాస్పిటల్ లోపల వున్న బాలాజీ  గుడి దగ్గర షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి .


దర్శకుడు రాఘవేంద్ర రావు, కెమెరామన్ ఎస్ . గోపాల రెడ్డి తీయబోయే షాట్ గురించి మాట్లాడుకుంటున్నారు .  అప్పుడు సాయంత్రం ఐదు గంటలు అవుతుంది .ఎవరి పనుల్లో వారు వున్నారు . సురేష్ ప్రొడక్షన్ కంపెనీ చాలా పద్దతిగా , క్రమ శిక్షణ తో ఉంటుంది . ఇక రాఘవేంద్ర రావు సంగతి చెప్పనవసరం లేదు .సెట్ లో అనవసమైన  కబుర్లు చెప్పుకుంటుంటే ఊరుకోరు . అందుకే కామ్ గా ఎవరి పని వారు చేస్తుంటారు . కాసేపటి
తరువాత  దర్శకుడు రాఘవేంద్ర రావు అసహనంగా వున్నాడు . ప్రొడక్షన్ వారిని పిలిచి “అర్జెంటు ” అని చెప్పాడు . ప్రొడక్షన్ మేనేజర్” అలాగే సర్ “అని కారులో వెళ్ళిపోయాడు .

రాఘవేంద్ర రావు కుర్చీలో ఒక్కడే కూర్చున్నాడు . నేను వెళ్లి ఆయన దగ్గర కూర్చున్నా . నన్ను నవ్వుతూ పలకరించారు . “ఈరోజు ఎవరెవరి మీద తీస్తున్నారు ? అడిగాను . “శారదా గారు ఒక్కరే ..” అన్నాడు . ” ఐసీ .. ఆమె కోసమేనా చూస్తున్నారు ?” “అవునవును .. సన్ సెట్ లోపల ఈ షాట్ తియ్యాలి .. ఒకే ఒక్క డైలాగ్ గాడ్ ను మ్ముకున్నందుకు బ్యాడ్ అంతా పోయింది … బాలాజీ మందిర్ దగ్గర స్వామిని చూస్తూ చెబుతుంది …  ఐదున్నర అవుతుంది , ఇప్పటికే రెండు సార్లు కబురు చేశాను , మీరు వచ్చిన తరువాత ప్రొడక్షన్ మేనేజర్  వెళ్ళాడు చూశారుగా ” అని చెప్పాడు .


రాఘవేంద్ర రావు షూటింగ్లో చాలా క్రమ శిక్షణ పాటిస్తాడు . తాను అనుకున్న విధిగా జరగక పొతే ఆయన మూడ్ పాడై పోతుంది . ఆయన మనసులో ఎలావున్నా ముఖం  మాత్రం ప్రశాంతంగానే వుంది .  ఈలోపల  ఆయన ఎవరినో పిలిచాడు . నేను అక్కడ నుంచి గోపాల్ రెడ్డి దగ్గరకు వెళ్లి కూర్చున్నా .  టైం గడుస్తుంది , రాఘవేంద్ర రావు లేచి అటు ఇటూ తిరగటం మొదలు పెట్టాడు . కెమెరామన్ లో కూడా టెన్షన్ మొదలైంది .
 అప్పుడే సన్ సెట్ మొదలైంది .

 


శారద కార్ వచ్చి ఆగింది . ఆమె హడావిడిగా దర్శకుడు రాఘవేంద్ర రావు దగ్గరకు వెళ్ళింది .  అప్పుడే సన్ సెట్ అయిపొయింది . రాఘవేంద్ర రావు ఆమె వైపు చూసి “పేకప్ ” అని కార్ ఎక్కి వెళ్ళిపోయాడు . అంతే  ఊర్వశి శారద కళ్ళమంటి నీరు ఉబికింది . ఈ చర్యకు యూనిట్ వారంతా
నిర్ఘాంతపోయారు . రాఘవేంద్ర రావు కు వచ్చిన కోపానికి శారదను తిట్టకుండా షూటింగ్ పేకప్ చేసి వెళ్లిపోవడం  ఆయన తత్వాన్ని తెలియజేసింది కదూ ?

 

-భగీరథ