రాజ‌కీయ కామెంట్స్ తో రామ్‌చ‌ర‌ణ్ రచ్చ

రామ్‌చ‌ర‌ణ్ కూడా రాజకీయాలను వంటబట్టించుకుంటున్నారు. పొలిటికల్ కామెంట్స్ చేయ‌డం మెల్ల‌మెల్ల‌గా నేర్చుకుంటున్నాడు. గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన “విన‌య విధేయ రామ” ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ చేసిన రాజ‌కీయ వ్యాఖ్య‌లు ఫ్యాన్స్ కి హుషారునిచ్చింది. ఇటు కేటీఆర్ ని, అటు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ జనసేనను పొగుడుతూ మాట్లాడారు. సినిమా ఫంక్షన్ లో ఇలా పొలికిటల్ వాతావరణం తెచ్చిన యంగ్ హీరో రామ్ చరణ్ అయ్యారు.

సీఎం కేసీఆర్‌ విజన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో కేటీఆర్‌ పనిచేస్తున్నారని, ప్రజలకు సేవ చేయాలనే ఆయన తపన అందరికీ స్ఫూర్తి దాయకమని సినీనటుడు రామ్‌చరణ్‌ అన్నారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లో వినయ విధేయ రామ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరియు ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెరాస ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో తమ చిత్ర బృందం తరఫున కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఈసారి మరింత ఉత్తేజంతో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాన్నాను అన్నారు.

అలాగే “ఈ మధ్య ఎవరూ జ్యూస్‌లు, కాఫీలు తాగడం లేదు. అందరూ టీలే తాగుతున్నారు,” అంటూ వ్యాఖ్య‌నించి అభిమానుల‌తో ఈల‌లు వేయించుకున్నాడు. టీ గ్లాస్ గురించి అలా చెప్పాడు. ” ఈ చిన్న టీ కప్పు ఏదో ఒక పెద్ద తుపాన్ సృష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా,” అని కూడా అన్నాడు. అలా జ‌న‌సేన పార్టీ గుర్తు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశాడు రామ్ చరణ్.

‘‘ ఇప్పుడు బాస్‌ అనాలా? బిగ్‌బాస్‌ అనాలా? మెగాస్టార్‌ అనాలా? లేకుంటే ముద్దుగా మీరందరూ పిలిచే అన్నయ్యా అనాలా? అది తెలీదు కానీ నాకు మాత్రం నాన్నగారే. ‘సైరా’ షెడ్యూల్‌లో బిజీగా ఉండి కూడా వచ్చినందుకు థ్యాంక్స్‌ డాడ్‌. ‘వినయ విధేయ రామ’ అనగానే బోయపాటిగారు గుర్తొస్తారు. నాలుగేళ్ల కిందట ఈ సినిమా లైన్‌ చెప్పారాయన. అందరికీ నచ్చేలా మంచి సినిమా చరణ్‌కి ఇవ్వాలనే ఇన్నేళ్లు వెయిట్‌ చేసి రాసిన కథ ‘వినయ విధేయ రామ’. ప్రతి హీరో ఆయనతో ఒక్కసారైనా పనిచేయాలన్నది నా కోరిక.

ఆయనతో పనిచేస్తే వచ్చే కిక్కే వేరప్పా. నా మాట నమ్మండి. అంతగొప్ప డైరెక్టర్, గొప్ప వ్యక్తి ఆయన. ఈ సినిమా నాకు మంచి మెమొరీగా ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ సినిమాకి నువ్వు ఎంత చాలెంజ్‌గా మ్యూజిక్‌ కొట్టావో తెలీదు కానీ మా కొరియోగ్రాఫర్లు మాత్రం మా మోకాళ్లు విరగ్గొట్టారు . భారీ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ దానయ్యగారు అయిపోయారు.

మా నాన్నగారి ‘ఖైదీ, గ్యాంగ్‌లీడర్‌’ వంటి కమర్శియల్‌ సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి ఒక లవ్లీ సినిమా ఇది. నాన్నగారు 1980లో ‘అభిలాష, ఖైదీ, మన్మథరాజు, మంత్రిగారి వియ్యంకుడు’ వంటి అన్ని జోనర్స్‌ చేశారు. అలా చేయాలని మాకూ కోరిక ఉండి ఈ సినిమా ఒప్పుకున్నా’’ అన్నారు.