Jayasudha On Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నటి జయసుధ ప్రశంసల జల్లు కురిపించారు. పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని, ఆయన రియల్ లైఫ్‌లో అస్సలు నటించరని ఆమె వ్యాఖ్యానించారు. ఇటీవల మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు.
గతంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే.. పవన్ కల్యాణ్ తీరు, వైఖరి ఎప్పుడూ ఒకేలా ఉంటాయని జయసుధ పేర్కొన్నారు. “ఆయన వైఖరి ఆయనదే. గతంలో ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వంలో నటన ఉండదు,” అని జయసుధ స్పష్టం చేశారు.

ఎవరికీ తలవంచరు.. పవన్ కల్యాణ్ ధైర్యాన్ని, తెగువను జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “పవన్ సినిమాల్లో ఎవరికీ తలవంచలేదు.. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎవరికీ తలొగ్గడం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి, ఒక మార్గం ఉన్నాయి. ఆ దారిలోనే ఆయన ముందుకు సాగుతారు. లేదంటే ఆయన ఎప్పుడో మధ్యలోనే వదిలి వెళ్లిపోయేవారు,” అని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రజాసేవ కోసమే త్యాగం.. రాజకీయాల్లో ఉండే ఒత్తిళ్లను తట్టుకుని నిలబడటం వెనుక పవన్ నిబద్ధత ఉందని జయసుధ అన్నారు. “కేవలం డబ్బు కోసమే అయితే ఆయన సినిమాల్లోనే కొనసాగేవారు. పవన్ గనక సినిమాల్లో నటిస్తే భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి పరిశ్రమ సిద్ధంగా ఉంది. కానీ, ఆయన వాటన్నింటినీ వదులుకుని, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నారు,” అని జయసుధ కొనియాడారు. ఆయన పడిన కష్టం, ఆయన వ్యక్తిత్వమే పవన్‌ను ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఆమె వెల్లడించారు.

