రాజమౌళి… మొదట్లోనే మీడియాకు ఝలక్

మీడియా లేనిదే సినిమా పరిశ్రమ లేదు..అనే పరిస్దితిని సోషల్ మీడియా క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సినిమా ప్రమోషన్స్ ను ఉచితంగా చేసుకోవచ్చు అని పెద్ద నిర్మాణ సంస్ధలు భావించి అమలు చేస్తున్నాయి. బాహుబలి వంటి భారీ చిత్రం ప్రమోషన్ వర్క్ మొత్తం దాదాపు సోషల్ మీడియా ద్వారానే జరిగింది.

ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పేరుతో, ఫొటోలు, వీడియోలు వదిలి హాట్ టాపిక్ గా తమ సినిమాని నిలిపారు. వాస్తవానికి అదే పబ్లిసిటీని డబ్బు ఖర్చు పెట్టి మీడియా లో చెయ్యాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ విషయంలో రాజమౌళి, ఆయన టీమ్ చాలా తెలివిగా వ్యవహించారు.

అయితే ఇప్పుడు ఆయన తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’కు కూడా అదే పద్దతి ఫాలో అవుతాం అని అర్దమయ్యేలా నిన్న లాంచింగ్ కు మీడియాని ఎవరినీ పిలవకుండా లాగించేసారు. ఈ చిత్రం నిర్మిస్తున్న బ్యానర్ కు చెందిన ఫేస్ బుక్ పేజీ, ట్విట్టర్ లో ఫొటోలు వదిలారు. అలాగే వీడియో సైతం ఒకటి పెట్టారు. దాంతో జాతీయ మీడియా అయినా, లోకల్ మీడియా అయినా అక్కడ నుంచి వీడియో తీసుకుని, ఫొటోలు తీసుకుని ఉపయోగించుకోవాల్సిందే.

ఎక్సక్లూజివ్ అనేది లేదు..అలాగే తాము ఏవైతే బయిటకు వెళ్లాలనుకుంటున్నారో ఆ విజువల్స్ ని మాత్రమే వీడియో తీసి వదలటం జరిగింది. అందరూ ఎదురుచూస్తున్న సినిమా కావటంతో ప్రతీ మీడియా …ఖచ్చితంగా ఈ సినిమా ని ప్రమోట్ చెయ్యాల్సిందే. ఎవరికీ వేరే ఆప్షన్ ఉండదు. దాంతో మీడియాకు మొదట్లోనే పెద్ద ఝలక్ ఇచ్చినట్లైంది. అయితే తమ సినిమాకు సంభందించిన సెట్ ఫొటోలు లీక్ అవుతాయని మీడియా ని పిలవలేదని టీమ్ కు సంభందించిన కొందరు అంటున్నారు. అలా అనుకుంటే సెట్ వేసిన చోట కాకుండా వేరే చోట లాంచింగ్ పెట్టుకోవచ్చు అనేది మీడియావారి వాదన. అదీ నిజమేగా.

నిర్మాత ఏమంటున్నారు..

‘బాహుబలి’ చిత్రం తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా చేయబోతున్నారు? ఎవరితో చేయబోతున్నారు? అనే విషయా లకు తెర దించుతూ… ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా ప్రకటించారు. అలాగే ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఓ భారీ చిత్రాన్ని 11వ నెల 11వ తేదీ 11 గంటలకి ప్రారంభిస్తామని ముందుగానే ప్రకటించారు. ఆ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ గా చిత్రం ప్రారంభించారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా సత్తాని ప్రపంచ స్థాయిలో చాటిన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తుండడం ఓ కలలా ఉంది. మరోసారి తెలుగు సినిమా గురించి ప్రపంచం మాట్లాడు కొనేలా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం గురించి అభిమానులు ఎన్నో అంచనాలతో ఆత్రుతగా ఎదురు చూస్తారని తెలుసు. అందుకు తగ్గట్లుగానే చిత్రం ఉంటుంది.

ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో కథానాయకుల నేపథ్యంలో రెండు వారాల పాటు పోరాట ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. ఈ చిత్రంలోని ఇతర నటుల గురించి త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు.

ఈ చిత్రానికి కథ: విజయేంద్రప్రసాద్, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కార్కీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రమా రాజమౌళి, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్, వి.ఎఫ్‌.ఎక్స్‌ సూపర్‌వైజర్‌: శ్రీనివాస్‌ మోహన్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాబు సిరిల్, ఛాయాగ్రహణం: కె.కె.సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.పార్వతి.