ఎన్టీఆర్ విగ్రహాలతో థియోటర్స్ నింపటం వెనక…

అప్పట్లో ఏదైనా దేవుడు చిత్రం గానీ, నాగ దేవత వంటి చిత్రం గానీ చేసేటప్పుడు ఆ థియోటర్స్ కు బయటి ఆ దేవతా విగ్రహాలు పెట్టేవారు. అలాగే నాగేంద్రుడు పుట్టలు పెట్టేవారు. థియోటర్ ని దేవాలయం గా చేసేవారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ కు అదే స్ట్రాటజీని ప్లే చేస్తున్నట్లు సమాచారం. ఎంపిక చేసిన 100 థియోటర్స్ బయిట ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

ఈ మేరకు మొదటి విగ్రహాన్ని తిరుపతిలో పిజేఆర్ థియేటర్ లో మంగళవారం రోజు నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ ఆవిష్కరించనున్నారు. అలాగే ఈ సినిమా కోసం బాలకృష్ణ ప్రత్యేకంగా రెండు వస్తువులను వినియోగించినట్లు తెలుస్తోంది. వాటినే ఈ సినిమాలో బాలయ్య వాడుకున్నారు. షూటింగ్ లలో వాడిన వస్తువులను, కాస్ట్యూమ్స్ ని దాచుకోవడం ఎన్టీఆర్ కి అలవాటు. అలా దాచుకున్న కొన్ని వస్తువులను ఈ బయోపిక్ లో చూపించాలని అనుకున్నాడు. ఆ విధంగా కళ్లజోడు, కుర్చీలను తెరపైకి తీసుకొచ్చారు.

ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య.. ”నాన్నగారు దాచుకున్న వస్తువుల్లో చాలా వరకు అన్నీ శిధిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని వస్తువులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మాకు అందుబాటులో ఉన్న కళ్లజోడు, కుర్చీ మాత్రం ఈ సినిమాలో చూపించాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇప్ప‌టికే బాల‌య్య‌ హీరోగా రూపొందుతున్న క‌థానాయ‌కుడు చిత్రానికి క్లీన్ యు స‌ర్టిఫికెట్ ద‌క్కింది. జ‌న‌వ‌రి 9న రిలీజ‌వుతోంది కాబ‌ట్టి, 8వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియ‌ర్ల సంద‌డి నెల‌కొన‌నుంది. సంక్రాంతి సెల‌వులు ఈ సినిమాకు పెద్ద రేంజులో క‌లిసి రానున్నాయి. హిట్టు అన్న టాక్ వినిపిస్తే చాలు వ‌సూళ్లు తేవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. ఈ నేపధ్యంలో జనాల్లో సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు…ఇలా విగ్రహాలు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ఐడియా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.