హిందూపురం నియోజకవర్గం టీడీపీ కంచుకోటల్లో ఒకటి! ఇక్కడ పసుపు కండువా మెడలో వేసుకుని ఎవరు పోటీ చేసినా గెలిచి తీరతారనే స్థాయి మాటలు వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్లుగానే అక్కడ వరుసగా టీడీపీ నేతలు గెలుస్తున్నారు. ఈ సమయంలో ఇప్పటికే రెండు సార్లు వరుసగా గెలిచిన నందమూరి బాలకృష్ణ… హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే సమయంలో బాలయ్యకు ఆ అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భారీ స్కెచ్ వేసిందని తెలుస్తుంది.
అవును… సుమారు నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎగరని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది అధికార వైసీపీ. ఇందులో భాగంగా రాయలసీమలో వైసీపీకి కీలక నేత అయిన పెద్దిరెడ్డిని హిందూపురం లో రంగంలోకి దింపింది. రానున్న ఎన్నికల్లో కుప్పం, మంగళగిరి, పిఠాపురంలతో పాటు హిందూపురంలోనూ జెండా ఎగరేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది!
వాస్తవానికి హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా నిత్యం రెపరెపలాడుతుంటుంది. 1983లో ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో మరోపార్టీ జెండా ఎగరలేదు! అంతేకాదు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తదనంతరం ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి హరికృష్ణ, ఈయన తర్వాత మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
అయితే… ఈసారి హిందూపురంలో టీడీపీ వ్యతిరేకులు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేలా అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే కొంతవరకు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అయిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను హిందూపురంలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీపికను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు!
గత రెండు ఎన్నికల్లోనూ హిందూపురంలో విజయం సాధించకపోవడానికి ఐకమత్య లోపమే ప్రధాన కారణమని వైసీపీ గుర్తించిందని తెలుతుంది. 2014లో నవీన్ నిశ్చల్, 2019లో మైనార్టీ నేత ఇక్బాల్ లు బాలయ్య ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఐతే ఈ ఇద్దరికి నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం వల్ల విజయం సాధించలేకపోయారని తెలుస్తుంది. దీంతో ఈ సారి ఈ ఇద్దరినీ కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దించింది వైసీపీ.
వాస్తవానికి నవీన్ నిశ్చల్, ఇక్బాల్, చౌళూరు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇప్పటివరకూ చాలా విభేదాలు ఉండేవి. అయితే… చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య, ఇక్బాల్ రాజీనామాతో ఇప్పుడు అంతా దీపిక వెనుక నడుస్తున్నారని చెబుతున్నారు! ఇలా హిందూపురంలో కేడర్ అంతా ఒకే గూటికి చేరడానికి తెరవెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. ఈ విషయంలో పెద్దిరెడ్డికి హిందూపురం బాధ్యతలు అప్పగించడంతో అంతా సెట్ అయ్యిందని తెలుస్తోంది.
ఇక హిందూపురంలో బాలయ్య నమ్మకం మరోలా ఉంది. ఇందులో భాగంగా… పార్టీ ఓటు బ్యాంకుపై ధీమాతో పాటు నియోజకవర్గంలో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయని బాలయ్య భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఆయనకు అంతకుమించిన మైనస్లు ఉన్నాయంటున్నారు స్థానికులు.
ఇంద్లో భాగంగా… రెండు నెలలకో మూడు నెలలకు ఒకసారి చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని.. కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలు ఉంటేనే హిందూపురంలో కనిపిస్తారనే విమర్శలు ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆయనను నేరుగా కలిసే అవకాశం లభించడం లేదని, ఆయన పీఏల పాలనపై ప్రజలు విరక్తిగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బాలయ్య హ్యాట్రిక్ సాధ్యమా కాదా అనేది వేచి చూడాలి!