ఎన్నికల తరవాత ‘అఖండ-2’: దర్శకుడు బోయపాటి వెల్లడి!

బాలకృష్ణ బోయపాటి శ్రీనుకాంబినేషన్‌ కు ఉన్న క్రేజ్‌ వేరు. వీరిద్దరి కలయికలో వచ్చిన మాస్‌ మసాలా కంటెంట్‌ ‘సింహ’,’లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఆ కాంబోలో సినిమా అంటే బాలయ్య అభిమానులకు పెద్ద పండగే! ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ జాబితాలో చేరింది. ఇప్పుడు వీరిద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ విూద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘అఖండ`2’ కూడా ఉంటుందని బోయపాటి చెప్పారు.

తాజాగా ఈ చిత్రంపై ఆయన మాట్లాడారు. ’ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఇవి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని అన్నారు.

ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైనట్లు బోయపాటి సన్నిహితుల ద్వారా సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చూస్తున్నారు. శరవేగంగా దీని షూటింగ్‌ జరుగుతోంది. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ గ్లింప్స్‌.ను విడుదల చేయగా సూపర్‌ టాక్‌ వచ్చింది. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు.