800 కోట్లు విలువ చేసే ఆస్తితో మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం

తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలు ఏలుతున్నాయి అనేది సాధారణంగా వినబడే మాట. ఆ నాలుగు కుటుంబాలు ఎన్టీఆర్, ఏఎన్నార్, రామానాయుడు ఇంకా మెగా ఫ్యామిలీ. ఈ నాలుగు కుటుంబాల నుండి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సినిమాలను కూడా నిర్మించారు. అయితే వీరిలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్, ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు తన పేరు మీదనే రామానాయుడు స్టూడియోస్ ని స్థాపించారు. ఒక్క మెగా ఫ్యామిలీ వారికి మాత్రమే స్టూడియోస్ లేవు. ఈ లోటును కూడా త్వరలోనే భర్తీ చేసుకోనున్నారు అనే వార్త బయటకు వచ్చింది ఇప్పుడు.

కొన్నేళ్ల క్రితం విశాఖ సముద్రపు ఒడ్డున కొంత స్థలం కొన్నారు చిరంజీవి. అయితే అది స్టూడియోస్ నిర్మించటానికే అని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. స్టూడియోస్ నిర్మించాలి అనే చిరంజీవి కోరిక కూడా తీరలేదు. తన తండ్రి కలను నిజం చేయాలి అని రాంచరణ్ రంగంలోకి దిగారంట. తాజాగా రంగస్థలం హిట్ తో మంచి కిక్ లో ఉన్నాడు రాంచరణ్. అటు హీరోగా ఇటు ప్రొడ్యూసర్ గా బిజీ అయిపోయిన మెగా పవర్ స్టార్ ఇప్పుడు స్టూడియోస్ నిర్మించే బాధ్యత కూడా భుజాన వేసుకున్నాడనే న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. కాకపోతే స్టూడియోస్ నిర్మించేది వైజాగ్ లో కాదు లొకేషన్ మారింది.

కోకాపేటలో మెగా ఫ్యామిలీకి 800 కోట్ల రూపాయలు విలువ చేసే 22 ఎకరాల భూమి ఉంది. వారు నిర్మించే స్టూడియోస్ కి పునాదులు అక్కడే పడనున్నాయని తెలుస్తోంది. ఫిలిం స్టూడియో నిర్మాణం కోసం ఆర్కిటెక్ట్లతో సంప్రదింపులు కూడా అయ్యాయట. హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తీసిపోకుండా నిర్మించబోతున్నారట స్టూడియోస్ ని. భూమి విలువే 800 కోట్ల రూపాయలైతే నిర్మాణం కోసం ఇంక ఎంత డబ్బు వెచ్చిస్తారో. ప్రస్తుతం సైరా మూవీకి సంబందించిన కొన్ని యాక్షన్ సీన్లు అక్కడే చిత్రీకరిస్తున్నారట. అందుకోసం భారీగా సెట్ వేసినట్టు తెలుస్తోంది. దాని విలువ అక్షరాలా రూ. 40 కోట్లు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో షూటింగ్ జరుగుతోంది. ఒకవేళ అక్కడ స్టూడియోస్ నిర్మిస్తే వారికి నష్టం కూడా ఏమీ ఉండదు అంటున్నారు పలువురు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుండే చాలామంది హీరోలు ఉన్నారు. వారి సినిమాల షూటింగులతో ఆ స్టూడియోస్ ఎప్పుడూ బిజీగానే ఉండొచ్చు. వారు నిర్మించే స్టూడియోస్ కి మెగా స్టూడియోస్ అని పేరు పెట్టొచ్చునేమో మరి.