‘సుబ్రహ్మణ్యపురం’ మూవీ రివ్యూ

దేవుడు బలి!
‘సుబ్రహ్మణ్యపురం’ 
రచన – ద‌ర్శ‌క‌త్వం: స‌ంతోష్ జాగ‌ర్ల‌పూడి
తారాగణం :న‌టీన‌టులు: సుమంత్, ఈషా రెబ్బా, సాయికుమార్‌, సురేష్‌, భద్ర‌మ్‌, గిరిధ‌ర్, జోష్ ర‌వి, త‌దిత‌రులు
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఛాయాగ్రహణం : ఆర్‌.కె.ప్ర‌తాప్‌
బ్యానర్ : సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపీఎల్‌
నిర్మాత‌: బీరం సుధాక‌ర రెడ్డి
విడుదల : డిసెంబర్ 7, 2018
1/5
***
జయాపజయాలతో నిమిత్తం లేకుండా హీరో సుమంత్ అప్పుడప్పుడు సినిమాలు చేసుకు పోతూంటాడు. ప్రేక్షకులు కూడా సీరియస్ గా తీసుకోరు. అలాంటిది ‘సుబ్రహ్మణ్యపురం’ ని సీరియస్ గా తీసుకున్నట్టు కన్పిస్తోంది. సకుటుంబ సపరివారంగా తరలి వచ్చి హౌస్ ఫుల్ చేశారు. నిరాశపడి తిరిగి వెళ్లారు. ప్రేక్షకులకి భక్తిపరంగా టైటిల్ బాగా ఆకర్షించినట్టుంది. ఇంతవరకూ సుమంత్ లక్కీ. తీరా ప్రేక్షకుల్ని నిరాశపర్చి పంపడం తనకున్న అలవాటే. ఈ స్పెషాలిటీ ఈసారి మరీ హద్దు మీరిపోయింది. దేవుడున్నాడా లేడా అని తను చేసిన అన్వేషణకి ప్రేక్షకులుంటారో లేదో తెలుసుకోలేకపోవడం పాతిక సినిమాల అనుభవంతో ఇంకా తెలీలేదంటే నమ్మబుద్ధి కాదు. దేవుడున్నా లేకపోయినా సినిమా బావుంటే ప్రేక్షకులుంటారు. ఈ దేవుడి కథేమిటో చూద్దాం. 

కథ 
అది సుబ్రహ్మణ్య పురమనే గ్రామం. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయంలో విగ్రహానికి అభిషేకం చేయకూడదన్న నియమం వుంటుంది. ఒక భక్తుడు దీన్ని ఉల్లంఘించి అభిషేకం చేస్తాడు. తర్వాత ఆత్మ హత్య చేసుకుంటాడు. దీంతో స్వామి అగ్రహించాడని అందరూ అనుకుంటారు. మరి కొంత మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే  స్వామి మొత్తం ఊరినే  శపించాడని  భయపడతారు. సర్పంచ్ వర్మ (సురేష్) దిక్కుతోచని స్థితిలో పడతాడు. ఇన్స్ పెక్టర్ కి ఈ కేసుల్ని ఆత్మహత్యలుగానే క్లోజ్ చేసేస్తూ వుంటాడు. ఇంకోవైపు నగరంలో కార్తీక్ ( సుమంత్) దేవాలయాల మీద పరిశోధనలు చేస్తూంటాడు. దేవుడు లేడని వాదిస్తూ ఇది రుజువు చేయాలనీ అనుకుంటాడు. అక్కడ ప్రియ (ఈషా రెబ్బా) అనే అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె సర్పంచ్ కూతురు. ఆమెతో ఆ ఊరికొచ్చిన కార్తీక్,  ఇక్కడ జరుగుతున్న ఆత్మహత్యల్ని చూసి పరిశోధన మొదలెడతాడు. అసలీ ఆత్మహత్యలు దేవుడి శాపమేనా? ఐతే దేవుడు వున్నట్టేనా? ఇదీ కర్తెక్ ముందున్న సమస్య.

ఎలావుంది కథ
ఇది మిథికల్ ఫాంటసీ మిస్టరీ జానర్. కానీ ఈ జానర్ లక్షణాలేవీ కన్పించవు. ముందు భక్తిభావంతో ఓలలాడిస్తే, మహిమలతో కట్టిపడేస్తే, దేవుడు బాగా ఎస్టాబ్లిష్ అవుతాడు కాన్సెప్ట్ ప్రకారం. దేవుడేదో మహిమ చూపి రాజ్యాన్ని రక్షించాడనీ శతాబ్దాల క్రితం కల్పిత చరిత్ర చెప్పారు. అలాటి దేవుడికి ఇప్పుడు మహిమలు లేవా, ఊరిని రక్షించలేడా అన్నవి మౌలిక ప్రశ్నలు. ఉన్న దేవుడికీ, లేడంటున్న హీరోకీ పోరాటం కూడా చూపించకుండా కాన్సెప్ట్ కెలా న్యాయం చేస్తారు. ‘భక్త తుకారాం’ చూసి ఈ కాన్సెప్ట్ ఆలోచించాల్సింది. ‘ఆగాబాబా’ అనే ఒక జానపద కథ వుంది. అందులో యంగ్ హీరో ఒక అడ్వెంచర్ కి బయల్దేరుతూ, ఆకలేసి అడవిలో ఒక మంత్రగత్తె దగ్గర ఆగుతాడు. ఆ మంత్రగత్తె అన్నం పెట్టకుండా ప్రశ్నలు అడుగుతుంది – ఏది సత్యం? ఈ విశ్వం ఎప్పుడు అంతమవుతుంది? అని. నోర్ముయ్యమంటాడు యంగ్ హీరో. ముందు తినడానికి అన్నం పెట్టమంటాడు. ఇందులో నీతి ఏమిటంటే,  లౌకికంగా బతకడానికి చేయాల్సిన పనులు మానేసి, జవాబులు దొరకని అలౌకిక విషయాలతో కాలం గడప వద్దని. కాబట్టి అసలు దేవుడున్నాడా లేడా అన్న కాన్సెప్టే అనవసరమైనది. పైగా ఈ దేవుడి కథకి విదేశీ స్మగ్లర్లతో ఉస్సూరనిపించే పాత రొటీన్ ఫార్ములా ముగింపు. మరొకటేమిటంటే, కాన్సెప్ట్ రెండు పాయింట్లుగా చీలిపోవడం. హీరో లక్ష్యం దేవుడి ఉనికి తెలుసుకోవడం. కానీ అతను చేసేది దేవుడి పేరు మీద జరుతున్న దందా బయట పెట్టడం. అంటే కాన్సెప్ట్ ఒకటైతే, చూపించిన కథ ఇంకోటై పోయింది.

ఎవరెలా చేశారు 
ముందు సుమంత్ పరిశోధకుడిగా తన పాత్రని నమ్మించలేకపోవడం పెద్ద లోపం. మాటలే తప్ప చేతలుండవు. పూరీ జగన్నాథ్ ఆలయం మీద ఎప్పుడూ పక్షులు వాలి వుండడం దేవుడి మహిమా, లేక మానవ మేధస్సా అని ప్రశ్నిస్తాడు తప్ప సమాధానం చెప్పడు. దీని మీద పరిశోధనలేమైనా జరిగాయా చెప్పడు. ఆలయాల్ని అలా వుంచి, కొన్ని పురాతన కోటల్లో కన్పించే విచిత్రాలు మానవ మేధస్సే. ఆర్కిటెక్చర్ నైపుణ్యాలే. ఆలయాల మహాత్మ్యాల మీద తన అభిప్రాయం చెప్పడం మానేసి, ఓ దొంగ బాబా మోసాన్ని పట్టుకుంటాడు. ఇదెలా వుంటుందంటే, దీంతో దేవుళ్ళు కూడా దొంగ బాబాలే అంటున్నాడా అన్న అర్ధం వచ్చింది. కానీ కథకుడి ఉద్దేశం వేరు. దొంగబాబా మోసాన్ని బయట పెట్టడం ద్వారా హీరోయిన్ ప్రేమించేలా చేయడమే కథకుడి ఉద్దేశం. ఇలా కాన్సెప్ట్ గజిబిజిగా వుంటుంది. 

నటన విషయాని కొస్తే నటించడానికి తగ్గ భావోద్వేగాలు కథలోనే లేవు. పాత్రకి హుషారు లేకపోవడంతో యూత్ అప్పీల్ లేదు. మిస్టరీని ఛేదించే పాత్రంటే, అద్భుత రసంతో రోమాంటిక్ గా హీరోయిన్ ని వెంటేసుకుని సాహసాలు చేయాలి. ఈ థ్రిల్ కూడా లేదు. న్యూ జనరేషన్ క్యారక్టర్ డైనమిక్స్ పూర్తిగా లోపించాయి. ఇందుకే తను నటించడానికీ, తన పాత్రని నిలబెట్టుకోవడానికీ ఏమీ లేకుండా పోయింది. 

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా స్టూడెంట్ పాత్ర. గ్లామర్ పోషణ కోసం వుంది. హిందీ హీరోయిన్ లా వుండే తనకి ఇదొక్కటే అవకాశాలు తెచ్చిపెడుతుంది. తెలుగు సినిమాల్లో ఇంతకి మించి పాత్రలు ఆశించకూడదు. ఇంకా ఇందులో సురేష్, సాయికుమార్ వున్నరు గానీ అవి చిన్న పాత్రలే. 

ఇదంతా ఒకెత్తు అయితే ఇక సినిమా తీసిన విధానం మరొకెత్తు. ఇంతకన్నాచవకబారు విలువలతో ‘సి’ గ్రేడ్ సినిమాలు కూడా తీయడం సాధ్యం కాదు. సినిమా చూస్తున్నామా, లేక ఎవరో తీసి పడేసి పోయిన వీడియో చూస్తున్నామా అన్నట్టుంది. ఫౌండ్ ఫుటేజీ అనే హార్రర్ సబ్ జానర్ మూవీస్ హాలీవుడ్ లో వుంటాయి. అంటే, అడవిలో హీరోకి ఒక వీడియో దొరుకుతుంది. ఎవరో దెయ్యాల్ని వీడియో తీస్తూ చచ్చిపోతే దొరికిన సగం సగం అడ్డదిడ్డంగా తీసిన వీడియో అన్నమాట. అలావుంది ప్రస్తుత సినిమా క్వాలిటీ. దీనికి మ్యూజిక్కు, కెమెరాల గురించి చెప్పుకోవాలంటే మనకి చాలా టాలెంట్ కావాలి. 

చివరికేమిటి 
షరా మామూలే. ఏడాదికి 70, 80 ఎనభై మంది కొత్త దర్శకులు సినిమాలు తీయడం, దులిపేసుకుని వెళ్ళిపోవడం. ఏం తీస్తున్నారో, ఎందుకు తీస్తున్నారో ఎవరికీ అంతుచిక్కదు. ఇలాగే వుంది మరో కొత్త దర్శకుడు సంతోష్ జాగ‌ర్ల‌పూడి ధోరణి. ఆఖరికి ఇన్స్ పెక్టర్ని కూడా దిగజార్చి కానిస్టేబుల్ లా చూపించాడంటే,  మిగిలిన కళాత్మక విలువలు ఎలా వున్నాయో అర్ధమైపోతుంది. ఇన్స్ పెక్టర్ గా వేసిన ఆర్టిస్టు ఫిజిక్ చూస్తూంటే కానిస్టేబుల్ ని చూస్తున్నట్టు వుంది. ఇక లొకేషన్స్ ఎంపిక కూడా నీచంగా వుంది. లొకేషన్స్ కి కళా దర్శకుడి కొరత స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం పిక్నిక్ లో కూర్చున్న హీరోహీరోయిన్ల బృందానికి సరైన దుప్పటి కూడా లేదు. షాట్స్ కి సరైన ఫ్రేమింగ్స్ కూడా లేవు. ఆర్టిస్టులకి పొజిషన్స్ చెప్పడం కూడా మర్చిపోయినట్టుంది. కెమెరా ముందుకు ఆర్టిస్టుల్ని గుంపుగా తోలేసి, మీరు మాట్లాడుకోండి, మేం తీస్తామన్నట్టుంది. క్లయిమాక్స్ పోరాటాలకి ఫైట్ మాస్టర్ కూడా లేనట్టుంది. ఎవరికి  తోచిన గుద్దులు వాళ్ళు గుద్దుకున్నారు. 

ఇక స్క్రీన్ ప్లే గురించి ఏమని చెప్పుకుంటాం. అదొకటుందా? వుంటే ఇంటర్వెల్ కైనా ఏదోవొక బ్యాంగ్ పడదా? వూళ్ళో ఆత్మహత్య తర్వాత ఆత్మహత్య, అటు నగరంలో హీరోయిన్ తో హీరోకి లవ్ తర్వాత్ లవ్ – ఇదే సరిపోయింది ఇంటర్వెల్ ముందు వరకూ. హీరో వూళ్ళోకి వచ్చాకైనా కథ ప్రారంభం కాదు. కథ ప్రారంభం కాకుండానే ఇంటర్వెల్ కూడా వెళ్ళిపోతుంది. 

ఇక సెకండాఫ్ లో ఆత్మహత్యల మిస్టరీ తేల్చడానికి లాజిక్ కూడా లేదు. మిస్టరీ జానర్ ని మూస ఫార్ములా కథలా చేసేశారు. చివరికి ‘దేవుడు చేసిన మనుషులు’ లో విగ్రహాలతో చాలా పనులు పెట్టుకున్న స్మగ్లర్ విలన్ జగ్గయ్యలాంటి ముగింపు నిచ్చి వదిలేశారు. ఇక ఈ కథా కథనాలకీ, దేవుడున్నాడా లేడా కాన్సెప్ట్ కీ సంబంధమేమిటా అని ప్రేక్షకులు అన్వేషణ మొదలెట్టాల్సిందే.

―సికిందర్