ఆ లుక్ వచ్చిందా? : కేసీఆర్‌ బయోపిక్‌.. ఫస్ట్‌ లుక్‌ ఇదే!

ప్రస్తుతం టాలీవుడ్‌‌లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇక్కడ తెలుగు రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ సినిమాలు షూటింగ్ లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ కూడా వచ్చి చేరింది. ఈ మేరకు కేసీఆర్ బయోపిక్ సినిమాను ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.

ఉద్యమ సింహం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి న‌ట‌రాజ‌న్ (గిల్లిరాజా), సూర్య‌, పి.ఆర్.విఠ‌ల్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లూరి కృష్ణంరాజు దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత రాజ్ కందుకూరి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ లుక్ లో కేసీఆర్ పాత్ర వేసిన వ్యక్తి..అచ్చం కేసీఆర్ నే గుర్తు చేస్తున్నాడంటున్నారు. సినిమాలో కూడా కేసీఆర్ లా మాట్లాడుతూ..ఆయన మ్యానరిజంలతో ఉంటే సినిమా బాగుంటుందంటున్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ‘ ఉద్యమ సింహం టైటిల్‌ల్ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉంది. కేసీఆర్ నాకు ఇష్టమైన నాయ‌కులు. ఆయ‌న‌పై ఎంతో ఇష్టంతో దర్శక‌, నిర్మాత‌లు సినిమా చేస్తున్నారు. ఇప్పుడు నిర్మాత‌లంతా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తున్న రోజుల్లో నాగేశ్వరరావు ఆయ‌న‌పై అభిమానంతో, ఎంతో ఇష్టంతో కేసీఆర్ పై సినిమా చేయ‌డం గొప్ప విష‌యం. కేసీఆర్ పై సినిమా అన‌గానే? అంతా ఆయ‌న రాజ‌కీయ‌న నేప‌థ్యంపై చేస్తున్నార‌నుకుంటున్నారు. కానీ రాజ‌కీయాల‌కు అతీతంగా ఉండే సినిమా. కేసీఆర్ బ‌యోపిక్ లా ఆయ‌న గురించి అన్ని విష‌యాలు సినిమాలో చూపిస్తున్నట్లు నాకు చెప్పారు. కొన్ని సీన్స్ చూసాను. చాలా బాగా తీశారు’ అని అన్నారు.

చిత్ర ద‌ర్శకుడు అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ, ` క‌థ ఎంత బాగో వ‌చ్చిందో.. సినిమా కూడా అంతే బాగా వ‌చ్చింది. కేసీఆర్ గురించి ప్రజల‌కు తెలియని ఎన్నో విష‌యాలో సినిమాలో చూపించ‌బోతున్నాం. సినిమా నిర్మాణానికి నాగేశ్వరరావు ఎక్కడా రాజీప‌డ‌లేదు. ఎంతో ఫ్యాష‌న్ తో సినిమా నిర్మిస్తున్నారు. ఈనెల 16న‌ ఆడియో రిలీజ్ చేస్తున్నాం. ఆరోజున కేసీఆర్ పాత్ర ఎవ‌రు పోషిస్తున్నారు? మిగ‌తా న‌టీన‌టులు ఎవ‌రు? అనేది రివీల్ చేస్తాం` అని అన్నారు.

ఈ చిత్రంలో జెన్నీ, సి.హెచ్.పి.విఠ‌ల్, ఆకేళ్ల గోపాల‌కృష్ణ‌, గిరిధ‌ర్, జ‌ల‌గం సుధీర్, మాధ‌విరెడ్డి, ల‌త తదితరులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు: సి.హెచ్. రాములు, కొరియోగ్రఫీ: గ‌ణేష్, ఫైట్స్: సూప‌ర్ ఆనంద్, ఎడిటింగ్: న‌ంద‌మూరి హ‌రి, సినిమాటోగ్రఫి: ఉద‌య్ కుమార్, సంగీతం: దిలీప్ బండారి, మాట‌లు: రాపోలు కృష్ణ అందిస్తున్నారు.