తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఇప్పటి వరకు మాటల తూటాలకే పరిమితమైన రాజకీయాలు ఇప్పుడు కిడ్నాప్ కు దారి తీస్తున్నాయి. బిఎల్ ఎఫ్ గోషామహాల్ అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్ చంద్రముఖి పోటి చేస్తున్నారు. ఇంత వరకు ఏ పార్టీ కూడా ట్రాన్స్ జెండర్ కు అవకాశం ఇవ్వలేదు. కానీ సిపిఎం మద్దతుతో ఏర్పడిని బిఎల్ ఎఫ్ కూటమిలో చంద్రముఖి కి అవకాశం ఇచ్చారు. గత కొద్ది రోజులుగా చంద్రముఖి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ట్రాన్స్ జెండర్ కావడంతో చాలామంది ఆమెకు మద్దతు ప్రకటించారు.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్ లో చంద్రముఖి నివసముంటున్నారు. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖి ఇంటికి వచ్చి పార్టీ విషయం మాట్లాడాలని చెప్పి బయటకు తీసుకెళ్లారు. వారితో వెళ్లిన చంద్రముఖి తిరిగి ఇంత వరకు రాలేదు, కన్పించడం లేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోంది. వారు నిజంగానే పార్టీకి చెందిన వారు అనుకొని చంద్రముఖి వెళ్లిందని కానీ వారు ఇతర పార్టీలకు చెందిన వారిగా తమకు అనుమానం వస్తుందని చంద్రముఖి తోటి స్నేహితులు9 తెలిపారు. సాయంత్రం అయినా చంద్రముఖి ఆచూకి దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్ లో బిఎల్ ఎఫ్ నాయకులు ఫిర్యాదు చేశారు.
కిడ్నాప్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రముఖి కోసం గాలిస్తున్నారు. ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్ కావడంతో ఇతర పార్టీల నేతలు మరికొందరు ట్రాన్స్ జెండర్లకు డబ్బులు ఎరగా వేసి చంద్రముఖి ని కిడ్నాప్ చేయించి ఉంటారని భావిస్తున్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు తక్షణం విచారణ జరిపి చంద్రముఖి ఆచూకి కనిపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చంద్రముఖి కి ఏమైనా అయితే ఆపద్ధర్మ ప్రభుత్వం, ఎన్నికల సంఘం, తెలంగాణ పోలీసులదే బాధ్యత అని వారు స్పష్టం చేశారు.
చంద్రముఖి మిస్సింగ్ తో బిఎల్ ఎఫ్ కూటమి నాయకులు ఉలిక్కి పడ్డారు. గోషామహాల్ లో పోటి చేస్తున్న వారే చంద్రముఖి విజయం ఖాయమని తెలుసుకొని ఈ విధంగా నాటకాలాడుతున్నారని, పిచ్చి పిచ్చి రాజకీయాలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. దమ్ముంటే నేరుగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలన్నారు. చంద్రముఖికి ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. చిల్లర రాజకీయాలకు భయపడేది లేదని అటువంటి చిల్లర రాజకీయాలకు పాల్పడే వారి లాగు పగులుతదని వారు హెచ్చరించారు. చేతనైతే ముందుకు రావాలని దద్దమ్ములు, సన్నాసుల లాగ పిచ్చకుంట్ల రాజకీయాలు చేయవద్దని ఓ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక హిజ్రా మీద చీఫ్ పాలిటిక్స్ చేస్తారా అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు.
గోషామహల్ నుండి వివాదాస్పద మాజీ ఎమ్మెల్మే రాజాసింగ్ బిజెపి నుంచి, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. చంద్రముఖి కిడ్నాప్ కు గురవ్వడం అందరిని ఆందోళన పరుస్తుంది.