ఇస్లాంలో తాజీర్ శిక్ష అంటే ఏంటి..?

సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఉన్న పవిత్ర మసీదు ప్రాంగణంలో “అసభ్య ప్రవర్తన”కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక బంగ్లాదేశ్ దంపతులకు సౌదీ ప్రభుత్వం మరణశిక్షను అమలు చేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది. ఉమ్రా యాత్ర కోసం వచ్చిన నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అఖ్తర్ అనే భార్యాభర్తలు మసీదు ప్రాంగణంలో ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలతో సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని అరెస్టు చేసింది. కోర్టులో నేరం నిరూపితం కావడంతో ఇస్లామిక్ చట్టం ప్రకారం వారికి మరణశిక్ష విధించారు.

అయితే, శిక్ష అమలు చేసే వరకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇస్లామిక్ చట్టంలోని “తాజీర్” శిక్షా విధానంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. షరియా చట్టం ప్రకారం “హద్” లేదా “హుదూద్” లాగా కొన్ని నేరాలకు నిర్ణీత శిక్షలు ఉండవు. ఈ తాజీర్ కింద నేరం యొక్క తీవ్రత, నేరస్థుడి ప్రవర్తన, ప్రజా ప్రయోజనాలను బట్టి శిక్షను ఖరారు చేసే పూర్తి విచక్షణ అధికారం అక్కడి న్యాయమూర్తికి లేదా పాలకుడికి ఉంటుంది.

మసీదులో అసభ్య ప్రవర్తనను తీవ్రమైన నేరంగా పరిగణించి, న్యాయమూర్తి తన విచక్షణ అధికారంతో ఈ దంపతులకు ఉరిశిక్షను ఖరారు చేశారు. ఇస్లాం మతం ప్రకారం మసీదు అనేది కేవలం ప్రార్థనలు, దైవస్మరణ, ఆధ్యాత్మిక బోధనలకు మాత్రమే ఉద్దేశించిన అత్యంత పవిత్రమైన స్థలం. ఖురాన్ (2:187) ప్రకారం మసీదు ప్రాంగణంలో, ముఖ్యంగా ఇతికాఫ్ అంటే ధ్యానం/ఏకాంత ప్రార్థన సమయంలో భార్యాభర్తల మధ్యనైనా సరే శృంగారపరమైన చర్యలు లేదా బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి పనులు ఇస్లామిక్ సంప్రదాయాలకు, నైతికతకు పూర్తిగా విరుద్ధం. పబ్లిక్ ప్రదేశాలలో లేదా ప్రార్థనా మందిరాలలో ఇలాంటి ప్రైవేట్ పనులకు పాల్పడటం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఇస్లామిక్ పండితులు స్పష్టం చేస్తున్నారు.