మానవ డాక్టర్ల స్థానంలో రోబో డాక్టర్లు వచ్చే రోజులు దాదాపుగా వచ్చేశాయనడానికి తాజా ఉదాహరణ సౌదీ అరేబియాలో కనిపించింది. అక్కడ ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సేవల కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ క్లినిక్‌లో మానవ డాక్టర్ల జోక్యం లేకుండానే మొదటి స్థాయి రోగ నిర్ధారణ, చికిత్స ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
చైనాలోని సిన్యి ఏఐ సంస్థ, సౌదీలోని అల్మూసా హెల్త్ గ్రూప్‌తో కలిసి ఈ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. అల్-అహ్సా ప్రాంతంలోని ఈ క్లినిక్‌లో రోగులు ‘డాక్టర్ హువా’ అనే ఏఐ డాక్టర్‌తో సంప్రదింపులు జరుపుతారు. టాబ్లెట్‌లో రోగ లక్షణాలను నమోదు చేస్తే, ఏఐ డాక్టర్ అవే ఆధారంగా ప్రశ్నలు వేసి, సమస్యను విశ్లేషించి, తగిన చికిత్సా ప్రణాళికను రూపొందిస్తుంది.
ఇప్పటికీ మానవ డాక్టర్లే తుది నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ, ఈ వ్యవస్థ రోగ నిర్ధారణ, ప్రాథమిక చికిత్స సూచనల విషయంలో అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. ప్రస్తుతానికి ఉబ్బసం, గొంతునొప్పి వంటి 30 వ్యాధులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నా, త్వరలో వాటిని 50కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్వాసకోశం, జీర్ణకోశం, చర్మ సంబంధిత సమస్యలూ ఇందులో చేరనున్నాయి.
ఈ పథకాన్ని విజయవంతమయ్యాక, సౌదీ ప్రభుత్వం నుండి ఆమోదం పొందేలా చూస్తున్నారు. ఏఐ డాక్టర్ తప్పు చేసే అవకాశాలు అత్యంత తక్కువగా ఉండటమే కాక, అత్యవసరాల్లో మానవ డాక్టర్లు సేవలందించేలా ఒక భద్రతా వ్యవస్థను కూడా ఇందులో అమలు చేశారు. వైద్యరంగంలో ఇదొక విప్లవాత్మక ప్రయోగంగా నిలవనుంది.