2034 ఫిఫా వరల్డ్ కప్ ఆతిథ్యానికి సౌదీ అరేబియా సిద్ధమవుతున్న తరుణంలో, అక్కడ మద్యం నిషేధాన్ని తొలగించనున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని సౌదీ ప్రభుత్వం ఖండిస్తూ, దేశంలో అమల్లో ఉన్న మద్యం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. గత వారం ఓ అంతర్జాతీయ వైన్ బ్లాగ్ ప్రచురించిన కథనంలో, పర్యాటక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని పేర్కొనడం చర్చలకు దారితీసింది. కానీ, ఈ కథనంలో ఎలాంటి అధికారిక ఆధారాలు లేవని స్పష్టమైంది.
సౌదీ అరేబియాలో గత 73 ఏళ్లుగా మద్యం నిషేధం అమల్లో ఉంది. మక్కా, మదీనా వంటి పవిత్ర నగరాలున్న ఈ దేశం ముస్లింలకు శుద్ధమైన ప్రాంతంగా భావించబడుతుంది. దీంతో మద్యం వినియోగం పూర్తిగా నిషిద్ధంగా ఉండటం సహజం. అయితే, గతంలో దౌత్యవేత్తల కోసం ప్రత్యేక మద్యం దుకాణం ప్రారంభించడం, బ్లాక్ మార్కెట్ ద్వారా లభ్యత వంటి విషయాల వల్ల ఈ నిషేధంపై పలుమార్లు చర్చ జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సడలింపులు జరగలేదు.
క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) నేతృత్వంలో సౌదీ అరేబియా గత కొన్నేళ్లుగా విస్తృత సంస్కరణలు అమలు చేస్తోంది. మహిళలకు డ్రైవింగ్ అనుమతులు, పాస్‌పోర్ట్ స్వాతంత్ర్యం, సినిమా థియేటర్లు, ఫ్యాషన్ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు వంటి అనేక విషయాల్లో పురోగతిని నమోదు చేసింది. 14 ట్రిలియన్ డాలర్ల ‘నియోమ్’ ప్రాజెక్టుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎంబీఎస్, దేశ ఆర్థిక వ్యవస్థను చమురు ఆధారితంగా కాకుండా వైవిధ్యంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫిఫా వరల్డ్ కప్ కోసం మద్యం నిషేధంపై మార్పులు వస్తాయన్న ప్రచారాలు ప్రాధాన్యత సాధించాయి. అయితే, ప్రభుత్వం ఇచ్చిన తాజా స్పష్టీకరణ ప్రకారం మద్యం నిషేధంలో ఎలాంటి మార్పులు జరగడం లేదు. దీంతో, ఈ చర్చలకు తాత్కాలిక ముగింపు ఏర్పడింది.