పెళ్లి కాని యువతీ యువకులు కలిసి హోటల్ లేదా లాడ్జిలో బస చేయడం చట్టవిరుద్ధమా.. ఈ ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని భయపెడుతోంది. ప్రేమికులు లేదా స్నేహితులు కలిసి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పోలీసులు వచ్చారంటే చాలు.. ఆందోళన, అయోమయం మొదలవుతుంది. కానీ నిజానికి చట్టం ఏం చెబుతోంది? పోలీసులు ఎంతవరకు అధికారాలు వినియోగించగలరు.. మీ హక్కులు ఏమిటి.. అన్న విషయాలను తెలుసుకుంటే భయపడాల్సిన అవసరమే ఉండదు.
భారతీయ చట్టాల ప్రకారం 18 ఏళ్లు పైబడిన ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో కలిసి ఉండడం నేరం కాదు. పెళ్లి జరిగిందా లేదా అన్నది చట్టపరంగా కీలకం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరుడికి జీవించే హక్కుతో పాటు వ్యక్తిగత గోప్యతను కూడా కల్పిస్తుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టత ఇచ్చింది. లివ్–ఇన్ సంబంధాలు లేదా హోటల్‌లో కలిసి బస చేయడం నేరం కాదని తీర్పుల్లో పేర్కొంది.
అయితే పోలీసులకు అకస్మాత్తుగా హోటళ్లపై దాడులు చేసే అధికారం ఉందా.. సాధారణంగా వ్యభిచారం, మానవ అక్రమ రవాణా లేదా ఇతర నేరాలపై అనుమానం ఉన్నప్పుడు మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తారు. ఒక గదిలో యువతి–యువకులు కలిసి ఉన్నారనే కారణంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అరెస్టు చేయడం, జరిమానా విధించడం చట్టవిరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్‌కు రావాలని బలవంతం చేసే అధికారం కూడా వారికి లేదు.
హోటల్ గదిలో ఉన్నప్పుడు పోలీసులు తలుపు తట్టితే భయంతో పారిపోవడం లేదా దాక్కోవడం తప్పు. అలా చేయడం వల్ల అనుమానం మరింత పెరుగుతుంది. ప్రశాంతంగా తలుపు తెరిచి మాట్లాడాలి. ఇద్దరూ మేజర్లు అని నిరూపించే గుర్తింపు కార్డులు చూపించాలి. ఆధార్, ఓటర్ ఐడీ వంటి డాక్యుమెంట్లు ఉంటే చాలు. మీరు స్వచ్ఛందంగా, పరస్పర అంగీకారంతో అక్కడ ఉన్నామని స్పష్టంగా చెప్పాలి.
పోలీసులు ఫోన్‌లు చెక్ చేయాలని ప్రయత్నిస్తే, చట్టపరమైన కారణం లేకుండా అలా చేయడానికి వారికి అధికారం లేదని గుర్తుంచుకోవాలి. అలాగే మీరు మేజర్లు అయితే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయమని పోలీసులకు హక్కు లేదు. కొన్నిసార్లు భయపెట్టే ఉద్దేశంతో అలా చెబుతుంటారు. అప్పుడు కూడా ధైర్యంగా మీ హక్కులను వినియోగించుకోవాలి. అయితే ఒక విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. మీరు లేదా మీ భాగస్వామిలో ఎవరో ఒకరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే, అది తీవ్రమైన నేరంగా మారుతుంది. మైనర్‌కు సంబంధించి పోక్సో చట్టం వర్తిస్తుంది. అలాంటి సందర్భంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
హోటల్ ఎంపికలోనూ జాగ్రత్త అవసరం. ఎల్లప్పుడూ గుర్తింపు ఉన్న, స్టాండర్డ్ హోటళ్లనే ఎంచుకోవాలి. ID లేకుండా గది తీసుకోవడం, అనుమానాస్పద లాడ్జీల్లో బస చేయడం సమస్యలకు దారి తీస్తుంది. చట్టబద్ధంగా బుక్ చేసుకుని, రిసెప్షన్ వద్ద వివరాలు నమోదు చేస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మొత్తానికి, మీరు చట్టాన్ని అతిక్రమించని వరకు భయపడాల్సిన అవసరం లేదు. గోప్యత మీ హక్కు. నేరం చేయని వారికి చట్టమే రక్షణ. అవగాహన ఉంటే, భయం ఉండదు.
