ప్రత్యేక హోదాపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. పార్లమెంటులో అనుసరించిన వ్యూహాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశంతో తామంతా సర్వసన్నద్ధంగా వున్నామని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూనే వున్నారన్నది విజయసాయిరెడ్డి వాదన.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై చర్చ జరిగిందా.? అంటే, అదసలు అంత సీరియస్ అంశం కాదని తేల్చేసిన విజయసాయిరెడ్డి, దాన్ని చాలా చిన్న అంశంగా కొట్టి పారేయడం గమనార్హం. మరెందుకు పార్లమెంటు వేదికగా, రఘురామపై అనర్హత వేటు కోసం పోరాడతామంటూ ఆ మధ్య గట్టిగా నినదించినట్లు.? ఇక, స్పెషల్ స్టేటస్ విషయానికొస్తే, ఈ అంశంపై ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన పోరాటం, అధికారంలోకి వచ్చాక చేయడంలేదన్న విమర్శలు వైసీపీ మీద గట్టిగా వినిపిస్తున్నాయి. అప్పుడూ కేంద్రంలో బీజేపీనే అధికారంలో వుంది.. ఇప్పుడూ బీజేపీనే కేంద్రంలో అధికారంలో వుంది.
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అప్పుడూ మోడీ సర్కార్ చెప్పింది.. ఇప్పుడూ అదే చెబుతోంది. కానీ, అంశాల వారీగా బీజేపీ సర్కారుకి వైసీపీ మద్దతిస్తూ వస్తున్నప్పుడు, ప్రత్యేక హోదాపై ఎందుకు సందర్భమొచ్చినప్పుడు నిలదీయలేకపోతోంది.? అన్నదే అసలు ప్రశ్న. రఘురామపై అనర్హత కోసం పార్లమెంటు సమావేశాల్ని స్తంభింపజేస్తామంటున్న వైసీపీ, ప్రత్యేక హోదా కోసం పార్లమెంటుని స్తంభింపజేయగలదా.? అన్నదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, విశాఖ స్టీల్ ప్లాంట్, దిశ చట్టం.. ఇలా కీలక అంశాలపై కేంద్రాన్ని వైసీపీ నిలదీస్తామని అంటోంది.