ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చుసిన దుబ్బాక ఎన్నికల ఫలితాల గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. దుబ్బాకలో బీజేపీని ప్రజలు గెలిపించారని, దుబ్బాకలో బీజేపీ గెలిచింది అని, అయితే ఇందులో చాలా పెద్ద అర్ధమే ఉంది. బీజేపీ గెలిచింది అనే దానికంటే బీజేపీని గెలిపించారు అనేది చాలా ముఖ్యమైన విషయం. 2018 లో 60 వేల ఓట్లు మెజారిటీతో గెలిచిన తెరాస పార్టీ నేడు 1400 పైచిలుకు ఓట్లు తో ఓడిపోవటం వెనుక ప్రధాన కారణం ప్రజలు. బీజేపీ తానుకు తానుగా తమ సొంత క్యాడర్ బలంతో దుబ్బాకలో గెలవలేదు. అక్కడి ప్రజలు తెరాస మీద వ్యతిరేకతతో, రఘునందన్ రావుకు ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతో బీజేపీని గెలిపించారు.
సరిగ్గా ఇలాంటి సంఘటన 2019 ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది. ఆ ఎన్నికల్లో జగన్ గెలవలేదు. ప్రజలు గెలిపించారు. ఒక వేళా జగన్ తనకు తానుగా గెలిచి ఉంటే ఒక 100 కి పైగా సీట్లు సాధించేవాడు, కానీ ప్రజలు గెలిపించాలని అనుకున్నారు, అతనికి ఒక అవకాశం ఇవ్వాలని భావించారు, అందుకే ప్రభంజనం గా కదిలివచ్చి కసిగా జగన్ కు భారీ స్థాయిలో 151 సీట్లు కట్టబెట్టారు. దుబ్బాకలో కసి లేకపోయిన కానీ ప్రజలు గెలిపించి, రఘునందన్ కు ఒక అవకాశం ఇచ్చారు.
2014 ఎన్నికల సమయంలో జగన్ పోటీచేసి కొద్దీ పాటి ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోవటంతో సీఎం పదవిని అందుకోలేకపోయాడు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలను ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందో అందరికి తెలుసు, ఏకంగా 23 మంది ఎమ్మెల్యే లను తమ పార్టీలోకి తీసుకోని వైసీపీ ని బలహీనంగా చేయాలనీ చూసింది. కానీ జగన్ మాత్రం వెన్ను చూపకుండా దైర్యంగా పోరాటం చేస్తూ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. దుబ్బాకలో కూడా రఘునందన్ ఇప్పటికే రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన కానీ దుబ్బాకను విడిచి వెళ్లకుండా తన పోరాటాన్ని కొనసాగించాడు. తెరాస ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించిన బెదరకుండా నిలబడ్డాడు.
అప్పట్లో జగన్ కు మీడియా పరంగా పెద్దగా సపోర్ట్ లేకపోయినా కానీ తమ పార్టీ కార్యకర్తల మద్దతుతో సోషల్ మీడియా వేదికగా గళం వినిపించాడు. ఆంధ్రాలో చంద్రబాబు కి 80 శాతం కవరేజ్ ఇచ్చిన మీడియా సంస్థలు, జగన్ కు కేవలం 20 శాతం మాత్రం ఇచ్చేవి, అయితే సోషల్ మీడియాను ఉపయోగించుకొని జగన్ సక్సెస్ అయ్యాడు. ఎన్నికల తర్వాత నా గెలుపులో సోషల్ మీడియా కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించారని జగన్ చెప్పటమే అందుకు ఉదాహరణ. ఇక్కడ దుబ్బాకలో కూడా అదే జరిగింది.
తెలంగాణ మీడియాలో మెజారిటీ శాతం కేసీఆర్ కు అనుకూలమైన మీడియా ఉంది . దీనితో బీజేపీ వాయిస్ బలంగా వినిపించే అవకాశాలు లేవు, అయితే సోషల్ మీడియా ద్వారా బీజేపీ తన గళం గట్టిగా వినిపించింది. బండి సంజయ్ అరెస్ట్ కావచ్చు, రఘునందన్ ఇంట్లో పోలీసుల సోదాలు కావచ్చు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా ప్రచారం పొందాయి తప్ప మీడియా ద్వారా కాదు.. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన డిబేట్స్ లో తెరాస మరియు కాంగ్రెస్ నేతలు మా ఓటమికి సోషల్ మీడియా ప్రచారం కూడా ఒక కారణమని చెప్పారంటే అర్ధం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటే పొతే అప్పట్లో జగన్ గెలుపుకు, ఇప్పుడు దుబ్బాకలో రఘునందన్ గెలుపుకు దగ్గరి పోలికలు ఉన్నాయి. అయితే ఇందులో మెజారిటీ వాటా మాత్రం ప్రజలకే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పడికైనా ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలు అనేది నిజం.