Bigg BossOTT: బిగ్‌బాస్‌ ఓటీటీ లోగో వచ్చేసింది.. ఇక త్వరలోనే నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ !

Bigg Boss OTT: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇటీవలే హిందీలో బిగ్‌బాస్‌ సీజన్ 14ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే తెలుగులో ఈ షో ఇప్పటివరకు 5 సీజన్లను పూర్తి చేసుకుంది. ఎప్పటికప్పుడు వినూత్నమైన టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తూ ఓ రేంజ్‌లో టీఆర్‌పీని కూడా నమోదు చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ షోకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతూనే ఉంది. కాగా తెలుగులో సీజన్ 5 ప్రారంభానికి ముందు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, విమర్శలు ఎదుర్కొన్నా చివరికి అన్నీ అధిగమించి షోను సక్సెస్‌పుల్‌గా రన్ చేశారు.

కానీ బిగ్‌బాస్‌ సీజన్ 5 తెలుగు ప్రేక్షకులు ఆశించినంతగా ఆదరించలేకపోయిందనే చెప్పవచ్చు. దానికి కారణం గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ శ్రుతిమించిన ప్రవర్తనలు.. హద్దుదాటిన చేష్టలు ప్రేక్షకులకు విసుగుపుట్టించాయి. దాంతో ఫ్యామిలీ అంతా కలిసి ఈ షోను చూడలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సారి 24గంటలపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధమవుతోంది బిగ్‌బాస్‌ ఓటీటీ. ఈ విషయం నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించినప్పటికీ వివరాలు మాత్రం అనౌన్స్ చేయలేదు.

ఇకపోతే ఈ షో ఓటీటీ ద్వారా ప్రసారం కాబోతున్న విషయం తెలిసినప్పటినుంచి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. దీనికి సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే వాలంటైన్స్ డేకు ముందు రోజే తెలుగు బిగ్‌బాస్‌ ఓటీటీ లోగోను నిర్వహకులు విడుదల చేసి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. కాగా బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఇకపై నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌ అని, త్వరలోనే ఈ షో ప్రారంభమవుతుందంటూ డిస్నీ హాట్ స్టార్ ఇప్పటికే ట్వీట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇక ఈ షోలో ఇంతకు ముందు పాల్గొన్న కంటెస్టెంట్స్‌తో పాటు, కొత్త వారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.