Rajasthan: కరోనా, లాక్ డౌన్ వచ్చి వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేశాయో తెలిసిందే. ఇందులో విద్యా వ్యవస్థ కూడా ఉంది. పాఠశాల, తోటి విద్యార్ధులు, తరగతి గదులు, ఆహ్లాదం, ఆటలు, టీచర్, పాఠాలు.. వీటన్నింటికీ విద్యార్ధులు దూరమైతే.. ఉపాధి కోల్పోయి ప్రైవేట్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా విద్యార్ధులు–టీచర్–స్కూల్.. అనే అనుబంధానికి ప్రస్తుతానికి బీటలు పడ్డాయి. దీంతో పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో విద్యార్ధులు, టీచర్లు కొత్త తరహా విద్యా విధానానికి అలవాటు పడ్డారు. అయితే.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాలు.. ఆన్ లైన్ విద్యను పొందలేని విద్యార్ధులు ఉన్నారు. అందులో రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
దీంతో ఆ రాష్ట్ర విద్యాశాఖ అవలంబిస్తున్న తీరు.. ఉపాధ్యాయులు చూపిస్తున్న నిబద్ధత ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజస్థాన్ లోని బార్ మేడ్ జిల్లాలో కొన్ని ప్రాంతాలకు ఇంటర్నెట్, డిజిటల్ టెక్నాలజీ, మొబైల్ కనెక్టివిటీ లేదు. దీంతో కొన్ని గ్రామాల్లోని పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నంగా ఆలోచించారు. తమ వృత్తి నిబద్ధతను చాటుకునేలా నిర్ణయించారు. కష్టనష్టాలు ఎదురైనా ఇంటర్నెట్, మొబైల్ సదుపాయం లేని విద్యార్ధులకు పాఠాలు చెప్పాలని.. ఇందుకు ఒంటెలపై విద్యార్ధుల ఇళ్లకే వెళ్లి పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టి ఒంటెలపై వెళ్లి విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్నారు. దీనిపై రాజస్థాన్ విద్యాశాఖ డైరక్టర్ సౌరవ్ స్వామి స్పందించారు.
‘రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్ధుల్లో చాలామందికి ఇంటర్నెట్, మొబైల్ కనెక్టివిటీ లేదు. అందుకే వారికి ఈ విధంగా పాఠాలు చెప్పాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా 1-8 తరగతుల విద్యార్ధులకు వారానికి ఒకసారి, 9-12 తరగతి విద్యార్ధులకు వారానికి 2సార్లు.. వారి ఇళ్లకే వెళ్లి పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియ కష్టమైనదైనా ప్రభుత్వ ఆలోచనకు ఉపాధ్యాయులు అందరూ సహకరించడంతో విద్యార్ధులకు పాఠాలు బోధించగలుగుతున్నాం. ఉపాధ్యాయుల నిబద్ధతకు ఇదొక నిదర్శనం’ అని అన్నారు. నిజంగానే భావి తరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు కష్టమైనా తన వృత్తి ధర్మాన్ని పాటించడం నిజంగా గొప్ప విషయం.