టీడీపీ మహానాడు: తమ్ముళ్ళలో నైరాశ్యం మాత్రమే మిగిలింది..

TDP Mahanadu, Yellow Brothers In Dull Mode

TDP Mahanadu, Yellow Brothers In Dull Mode

తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించింది. టీడీపీ ఆవిర్భావ వేడుకల్ని మహానాడు పేరుతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో గత ఏడాదీ, ఈ ఏడాదీ మహానాడు వర్చువల్ విధానంలోనే జరిగింది. మామూలుగా అయితే, ఇంకాస్త హంగామా వుండేది. కానీ, 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చూశాక, పార్టీ క్యాడర్ పూర్తిగా నీరుగారిపోయింది. నేతలు, పార్టీని మారినా.. ఇంకా కార్యకర్తలు పార్టీ కోసం అండగానే నిలబడుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి వచ్చిన ఓట్లే అందుకు నిదర్శనం. అయితే, కార్యకర్తలు నిలబడితే సరిపోదు, నాయకులూ పార్టీ కోసం పనిచేయాలి.

కానీ, పార్టీ కోసం కాకుండా పదవుల కోసం పనిచేసే నాయకులకే చంద్రదబాబు ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. అదే ఈ రోజు టీడీపీకి ఈ దుస్థితిని తీసుకొచ్చింది. కార్యకర్తల్లోంచి నాయకుల్ని తయారు చేయండి మహాప్రభో.. అంటూ సోషల్ మీడియా వేదికగా తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నా, మహానాడులో నాయకులెవరూ ఆ విషయాన్ని ప్రస్తావించలేకపోయారు. ఎంతసేపూ ఆత్మస్తుతి, పర నింద.. అంతకు మించి మహానాడు సందర్భంగా టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలకు ఇచ్చిన ‘పసుపు’ సందేశం ఇంకేమీ లేదు. ‘నేను మారిపోయాను.. ‘ అని చంద్రబాబు ఎన్నోసార్లు చెప్పుకున్నారుగానీ, ఆయన మారలేదు.. మారరు కూడా. మహానాడు సందర్భంగా జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ వంటి గ్లామరున్న నందమూరి హీరోల్ని టీడీపీ తరఫున మాట్లాడించడమో, పోనీ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ గురించి మహానాడు వర్చువల్ సమావేశంలో మాట్లాడించినా కాస్తంత ఉపయోగం వుండేది. టీడీపీ, మహానాడు సందర్భంగా ఏవేవో తీర్మానాలు చేసిందట.. ఎందుకు ఆ తీర్మానాలు.? కార్యకర్తల్ని పట్టించుకోని పార్టీ.. మనుగడ సాధించడం కష్టమే.