చంద్రబాబు నాయుడుగారికి తాను ఢిల్లీ స్థాయి నాయకుడిననే ఫీలింగ్ మొదటి నుండి ఉంది. సంధర్భం వచ్చినప్పుడల్లా ఢిల్లీలో చక్రం తిప్పేస్తా అంటుంటారు. కేంద్రంలో తాను ఏం చెబితే అది జరిగి తీరాల్సిందే అనేవారు. కొన్నిసార్లు తన నేతల చేత చంద్రబాబుగారికి ప్రధాని కాగల అర్హత, సత్తా ఉన్నాయని గొప్పలు చెప్పించేవారు. నిజానికి ఇవి గాలి మాటలే అయినా చంద్రబాబు అధికారంలో ఉండగా కాస్తోకూస్తో చెల్లుబాటయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. జగన్ గట్టిగా అనుకుంటే అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా కోల్పోవడానికి పెద్ద సమయం పట్టదు. సరిగ్గా చెప్పాలంటే చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ఉనికికి కోసం కొట్టుకుంటోంది. ఇంత కష్టంలో ఉన్నా బాబుగారి డాబులు తగ్గట్లేదు. ఇప్పటికీ ఆయన చూపు ఢిల్లీ వైపే ఉంది.

ఇంకా తాను ఢిల్లీ రాజకీయాలను శాసించగలననే అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఢిల్లీలో బాబుగారికి అక్కడ ఏం జరుగుతుందో, అంతర్గత రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో పక్కా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే నెట్వర్క్ కూడ లేదు. అధికారం లేకపోయినా మంచి సంఖ్యలో అంసెబ్లీ సీట్లు, లోక్ సభ సీట్లు ఉన్నప్పుడు ఆయన మీద ఢిల్లీ నాయకుల దృష్టి ఉండేది. ముఖ్యంగా అక్కడి ప్రతిపక్షాలు బాబుగారితో అంటీముట్టనట్టైనా వ్యవహరించేవి. కానీ ఇప్పుడు కన్నెత్తి కూడ చూడటం లేదు. అసలు ఆయన అవసరం అక్కడ ఎవ్వరికీ లేదు. అధికార పక్షం ఉంటే జగన్ జపం చేస్తోంది. విపక్షాలు కేసీఆర్ మీద ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బాబు బీజేపీని ప్రసన్నం చేసుకోవాలని చూస్తూ టైమ్ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు.

ఇది గమనిస్తున్న తెలుగు తమ్ముళ్లు అయ్యా.. మీ సత్తా ఏదైనా ఉంటే దాన్ని ఆంధ్రా గల్లీల్లో ప్రదర్శించండి అంటూ నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ జిల్లాల స్థాయిలోనే కాదు గల్లీ లెవల్లో కూడ బలహీనపడింది. లోకల్ పార్టీ ఆఫీసులు కార్యకలాపాలు లేక వెలవెలబోయాయి. కొన్ని చోట్ల పార్టీ ఆఫీసులకు తాళాలు వేలాడుతున్నాయి. చిన్నా చితకా పదవులు అందుకునేవారు కూడ కరువయ్యారు. ఈ సంగతులేమీ బాబుగారికి పట్టట్లేదు. ఇంకా ఇంట్లో కూర్చొని బూమ్ యాప్ మీదే పార్టీని లాగుతున్నారు. ఇదే శ్రేణుల ఆగ్రహానికి కారణం. నాయకుడు క్షేత స్థాయిలోకి ఎప్పుడు దిగివస్తారో తెలీక అయోమయంలో ఉన్నారు. ఎంతసేపు ఢిల్లీ లీడర్లు తనను పట్టించుకోవట్లేదని కోపంతో చిందులు తొక్కకపోతే ఆ పౌరుషం జిల్లాల గల్లీల్లో చూపించి పాలకవర్గాన్ని ఢీకొట్టి పార్టీని బ్రతికించడండి అంటున్నారు.
