Skylab Review : ‘స్కై లాబ్’ రివ్యూ – ఎగరని వొరిగిన రాకెట్!

రేటింగ్ : 2/5

రచన – దర్శకత్వం : విశ్వక్ ఖందేరావు

తారాగణం : నిత్యా మీనన్, సత్య దేవ్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం : ప్రశాంత్ విహారి,

ఛాయాగ్రహణం : జవ్వాది ఆదిత్య

బ్యానర్ : బైట్‌ ప్యూచర్స్, నిత్యామీనన్‌ కంపెనీ

నిర్మాతలు : నిత్యా మీనన్, పృథ్వీ పిన్నమరాజు

విడుదల : డిసెంబర్ 4, 2021

1979 లో సంచలనం సృష్టించిన స్కైలాబ్ దుర్ఘటనని పురస్కరించుకుని ‘స్కైలాబ్’ అనే ప్రయోగాత్మక తెలంగాణా నేటివిటీ సినిమా తీశాడు కొత్త దర్శకుడు విశ్వక్ ఖందేరావు. దీన్లో నటిస్తూ సహ నిర్మాతగా వ్యవహరించింది పాపులర్ హీరోయిన్ నిత్యా మీనన్. పాపులర్ నటుడు సత్యదేవ్ ఒక పాత్ర వేశాడు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మూస కథలకి భిన్నంగా వైవిధ్య కాన్సెప్ట్స్ తో ముందుకు వస్తున్న ఇలాటి తెలుగు సినిమాలకి ఆదరణ పెరగాలి. నిత్యా మీనన్ స్వయంగా పూనుకుని సహ నిర్మాతగా ముందుకు వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ ఆమెని అంతగా ఆకర్షించి వుండాలి. సినిమాలో ఆమె నటించడం మంచి బాక్సాఫీసు ఆకర్షణ కూడా అయింది. పాపులర్ హీరో హీరోయిన్లు ఇలాటి కాన్సెప్ట్స్ లో నటిస్తూ వుంటే ప్రేక్షకుల్లోకి ఎక్కువ వెళ్తాయి. మరి ఈ నిత్యా మీనన్ ఔటింగ్ ఎంతవరకూ దీన్ని సాధించింది? హైలీ ఎడ్యుకేటెడ్ అయిన తను హైక్వాలిటీ ఎంటర్ టైనర్ అందించిందా?

కథ

1979 లో తెలంగాణాలోని బండ లింగం పల్లి గ్రామం. అక్కడ గౌరి (నిత్యా మీనన్) దొరబిడ్డ. ఈమెకి పత్రికా రిపోర్టర్ అవ్వాలని బలమైన కోరిక. హైదరాబాద్ లో ‘ప్రతిబింబం’ అనే పత్రికలో ఈమె రాతలు చూసి ఎడిటర్ ఇంటికి పంపించేస్తే వచ్చి ఇంట్లో వుంటోంది. ఎలాగైనా వూళ్ళో వార్తలు రాసి పేరు తెచ్చుకుంటానని తండ్రికి సవాలు చేస్తుంది. తల్లి సహకరిస్తూంటుంది.

ఆనంద్ (సత్యదేవ్) కూడా హైదారాబాద్ లో డాక్టరుగా సస్పెండ్ అయి వచ్చి వూళ్ళో తాత సదాశివం (తనికెళ్ళ భరణి) దగ్గర వుంటూ, క్లిక్ పెట్టుకోవడానికి డబ్బులకోసం వేధిస్తూంటాడు. ఇంకో రామారావు (రాహుల్ రామకృష్ణ) అనే సుబేదారుల కొడుకు అప్పులు చేస్తూ తిరుగుతూంటాడు.

ఇలా ఈ ముగ్గురూ మూడు లక్ష్యాలతో వుంటే, స్కైలాబ్ పడబోతోందని రేడియో వార్త వస్తుంది. దీంతో వూళ్ళో కంగారు పడతారు ప్రజలు. గౌరికి వార్తలు రాయడానికి ఇది మంచి టాపిక్ అయితే, రామమారావు దగ్గర అప్పు చేసి క్లినిక్ పెట్టబోయిన ఆనంద్ కి బ్రేకు పడుతుంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ముంచుకు వస్తున్న ప్రమాదంతో ఎవరి జీవితాలేమయ్యా యన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

1979 లో 850 టన్నుల అమెరికా అంతరిక్ష ప్రయోగ శాల స్కైలాబ్ ఆకాశంలో పతనమై భూమ్మీద పడ్డానికి సిద్ధమైంది. అది తెలంగాణా మీదే పడుతుందని పుకార్లు వ్యాపించాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా మీద. దీంతో చావు తప్పదని ప్రజలు మేకలూ కోళ్ళూ తెగ కోసుకు తినేసి తృప్తిగా చనిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తీరా జులై 19 న స్కైలాబ్ శకలాలు వెళ్ళి హిందూ మహా సముద్రం లోనూ, పశ్చిమ ఆస్ట్రేలియా లోనూ పడ్డాయి.

ఈ ఉదంతాన్ని ‘స్కైలాబ్’ కథగా తీసుకున్నారు. 2011 లో ఫ్రెంచి కామెడీగా ‘లీ స్కైలాబ్’ అనే మూవీ వచ్చింది. గ్రాండ్ మా పుట్టిన రోజు జరుపుకోవడానికి విలేజీలో ఓ బంగాళా కొచ్చిన బంధు మిత్ర పరివారం, ఫ్రాన్స్ మీద స్కై లాబ్ పడుతోందన్న వార్తకి ఎలా స్పందించారన్న కథ. ఇందులో కుటుంబ బంధాలు, టీనేజీ ప్రేమలు వగైరా చర్చించారు.

తెలుగు ‘స్కైలాబ్’ మంచి సోషల్ కామెడీ అయ్యే అవకాశమున్న కథ. అయితే ఈ కథ ఏ జానర్ కిందికి వస్తుందో గుర్తించి ఆ జానర్ మర్యాదలతో కథ చేయకపోవడం వల్ల విఫలమైంది. డిజాస్టర్ జానర్ కథని డిజాస్టర్ జానర్ మూవీ ఎలిమెంట్స్ తో తీయాలి. తెలంగాణా సినిమాలతో సమస్యేమిటంటే, ప్రతీ సినిమాలోనూ తెలంగాణా జీవితం చూపించడానికే పాత్రలుంటాయి. పాత్రలతో తెలంగాణా జీవితమెక్కువ, పాత్రలతో కథ తక్కువ. ఆ కథ కూడా నాన్ కమర్షియల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది.

వాస్తవంగా స్కైలాబ్ ప్రమాద వార్త పరిణామాల్లోనే కామెడీ వుంది. చాలా కామెడీగా తాము చచ్చిపోతామనే డిసైడ్ అయ్యారు అప్పటి ప్రజలు. చివరి కోర్కెలు తీర్చుకోవడం ప్రారంభించారు. డిజాస్టర్ జానర్ కథలు రెండు రకాలు. ఒకటి సీరియస్ యాక్షన్, రెండోది కామెడీ. ఇది డిజాస్టర్ కామెడీ కిందికి వస్తుంది. ఈ కథ అనుకున్నప్పుడు జానర్ గురించి ఆలోచించి రీసెర్చి చేసుకున్నట్టు లేదు. డిజాస్టర్ కామెడీలుగా గత పదేళ్ళ లోనే వచ్చిన ‘దిసీజ్ ది ఎండ్’, ‘ది వరల్డ్స్ ఎండ్’, ‘కూటీస్’ మొదలైనవి వున్నాయి. ఇవి చూసి వుంటే స్కైలాబ్ ఎలా తీయాలో తెలిసి వుండేది. ఒక చారిత్రక ఘటనతో అపూర్వ ఐడియా అన్నప్పుడు వచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోకూడదు. దాన్ని చెడగొట్టి, బాగా తీయగల్గే వాళ్ళకి అవకాశం లేకుండా చేయకూడదు.

నటనలు -సాంకేతికాలు

నిత్యా మీనన్ నాటి తెలంగాణా పీరియెడ్ పాత్రలో డమ్మీ జర్నలిస్టుగా బాగా కుదిరింది. అమాయకత్వంతో కూడిన సున్నిత హాస్యం చేసింది. క్లయిమాక్స్ లో కదిలించే సన్నివేశంతో రాణించింది. భాష, నటన, హావభావాలు పలికించడంతో ఆమెకి తిరుగులేదు. తల్లిదండ్రులతో ఆమె మొండి తనంతో కూడిన హాస్య దృశ్యాలు నవ్విస్తాయి. తను కని పించినప్పుడల్లా దృష్టి నాకర్షిస్తుంది. అలరిస్తుంది, ఆనందింప జేస్తుంది. ఇదంతా కథలోంచి పాత్రని తీసి వేరుగా చూసినప్పుడు. కథలో పెట్టి పాత్రని చూస్తే, పాత్రకీ కథకీ ఉపయోగపడిందేమీ లేదు.

కథ అన్నాక ఒక కథానాయకుడో, కథా నాయకురాలో వుంటారు కథని నడిపించడానికి. ఈ కథకి సత్యదేవ్ కథానాయకుడు కాదని సినిమా చూస్తూంటే గానీ బయటపడదు. మరి నిత్యామీనన్ కథా నాయకురాలా అంటే అదీ కాదు. కానీ మార్కెట్ యాస్పెక్ట్ తో చూస్తే తనే కథా నాయకురాలవాలి. అంటే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అవ్వాలి. అప్పుడు ఆమె పాత్రకి అర్ధం వుండేది.

సత్యదేవ్ సహాయ పాత్రలాగా వుంటాడు. ఇలా కూడా చేయడానికేమీ లేదు. ఈ కామెడీలో పాత్రకి వుండాల్సిన హుషారు లేదు. డిటో రాహుల్ రామకృష్ణ. ఇక ఇతర తెలంగాణా పాత్రల్లో నిత్యా మీనన్ తల్లి పాత్ర నటి, రాహుల్ రామకృష్ణ నానమ్మ పాత్ర నటి బావున్నారు.

పాటలకి పెద్దగా ప్రాధాన్యం లేదుగానీ నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకి బావుంది. లొకేషన్స్ తో, కాస్ట్యూమ్స్ తో, సెట్ ప్రాపర్టీస్ తో కళాదర్శకత్వం మాత్రం పకడ్బందీగా వుంది పీరియెడ్ వాతావరణాన్ని సృష్టిస్తూ. కెమెరా వర్క్ సైతం ఉన్నతంగా వుంది. ఇంత మంచి సాంకేతిక సహకారం పొందిన కొత్త దర్శకుడు సినిమాని నిలబెట్టడంలో మాత్రం తగిన కృషి చేయలేకపోయాడు.

చివరికేమిటి

ఉరకలేసే క్రేజీ కామెడీతో, జానర్ డిమాండ్ చేస్తున్న అద్భుత రసపు కథా కథనాలతో, స్కైలాబ్ ఉపద్రవాన్ని ఎదుర్కొనే అడ్వెంచరస్ క్యారక్టర్ గా నిత్యామీనన్ మ్యాజిక్ చేయాల్సింది- ఈ లక్షణాలేవీ లేని డమ్మీ పాత్రగా మిగిలిపోయింది. తన పాపులారిటీతో ఫిమేల్ ఆడియెన్స్ ని కూడా థియేటర్లకి రప్పించే పనికే దూరంగా వుండిపోయింది. ఫస్టాఫ్ అంతా నిత్య, సత్యదేవ్, రామకృష్ణల విడివిడి ఉపకథలు చూపిస్తూ, స్కైలాబ్ కూలుతోందన్న పాయింటు వచ్చేసరికి ఇంటర్వెల్ వచ్చింది.

ఫస్టాఫ్ లో చూపించిన కామెడీ సున్నిత హాస్యం చేయడంతో, అది నవలా సాహిత్యంలా అనిపిస్తూ సామాన్య ప్రేక్షకులకి దూరంగా వుండిపోయింది. తెరమీద చూ పించడానికి పనికిరాని నవలా కథనం వల్ల ఫస్టాఫే సహన పరీక్షగా మారింది.

స్కైలాబ్ పాయింటు కొచ్చాక, ఆ ప్రమాద వార్తకి గట్టి రియాక్షన్స్ చూపించాల్సింది పోయి, హడావిడి మొదలెట్టాల్సింది పోయి- నీరసంగా సాగే సీన్స్ తో మరీ దెబ్బతినిపోయింది సెకండాఫ్. పంచ్ లేదు, పరుగులు లేవు, ఎత్తుగడల్లేవు, బతకడానికి పాట్లు లేవు. ఉపద్రవంలో లీడ్ చేసే మెయిన్ క్యారక్టర్ లేదు. మినిమం కథా లక్షణాలే లేని సినిమా తీసి ఏం ప్రయోజనం. అరుదైన కాన్సెప్టుతో అరుదైన డిజాస్టర్ కామెడీని అందించే బంగరు అవకాశాన్ని కొత్త దర్శకుడు ఇలా కోల్పోవడం విచారకరం.

—సికిందర్

.