రేటింగ్: 2/5
రచన- దర్శకత్వం : శ్రీ సరిపల్లి
తారాగణం : కార్తికేయ, తాన్యా రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, తనికెళ్ళ భరణి, సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు
సంగీతం : ప్రశాంత్ విహారి,
ఛాయాగ్రహణం : పిసీ మౌళి
నిర్మాత : రామారెడ్ది
విడుదల : నవంబర్ 12, 2021
‘ఆరెక్స్ – 100’ హిట్ హీరో కార్తికేయ గుమ్మకొండ తర్వాత నటించిన ‘చావు కబురు చల్లగా’ సహా ఐదూ హిట్ కాలేదు. ఇప్పుడు తాజాగా ‘రాజా విక్రమార్క’ యాక్షన్ కామెడీ అంటూ అదృష్టాన్ని పరీక్షించుకోబోతూ, శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడితో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వారం వారం కొత్త దర్శకులు వస్తూనే వున్నారు. ఒక సినిమాతో మళ్ళీ కన్పించకుండా వెళ్ళి పోతున్నారు. అంటే ఫ్లాపులు తీయడంలో పోటీపడుతున్నారు. ప్రస్తుత కొత్త దర్శకుడు, కార్తికేయ కూడా కలిసి ఫ్లాపు తీయడానికి పోటీ పడ్డారా? ఇది తెలుసుకుందాం…
కథ
విక్రమ్ (కార్తికేయ) ఎన్ఐఏ ఏజెంట్. బాస్ మహేంద్ర (తనికెళ్ళ భరణి) కింద హైదరాబాద్ లో వుంటాడు. మారణాయుధాలు సరఫరా చేస్తున్న ఒక నైజేరియన్ ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తాడు. అప్పుడు పొరపాటున తన చేతిలో వున్న తుపాకీ పేలి నైజేరియన్ చచ్చిపోతాడు. చచ్చిపోతూ మాజీ నక్సలైట్ నాయకుడు గురునారాయణ (పశుపతి) గురించి చెప్పి చచ్చిపోతాడు. గురు నారాయణ వల్ల హోమ్ మంత్రి చక్రధర్ (సాయి కుమార్) కి ప్రాణాపాయముందని తెలుసుకున్న బాస్ మహేంద్ర, విక్రంకి హోమ్ మంత్రి చక్రధర్ సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తాడు. చక్రధర్ కి కాంతి (తాన్యా రవిచంద్రన్) అనే అందమైన కూతురుంటుంది. ఈమెతో ప్రేమలో పడతాడు విక్రమ్. ఒకవైపు హోమ్ మంత్రిని రక్షించే బాధ్యత తీసుకున్న విక్రమ్, అతడి కూతురితో ప్రేమలో పడ్డంతో బాధ్యతని నెరవేర్చగలిగాడా లేదా అనేది మిగతా వెండితెర మీది కథ.
ఎలావుంది కథ
యాక్షన్ కామెడీ జానర్లో పాత రొటీన్ ఫార్ములా కథ. ఇందులో యాక్షన్, కామెడీ, ఫార్ములా కథ ఏవీ సరిగా లేని కథ. కొత్త దర్శకులు కథల దగ్గరే సినిమాల్ని బోల్తా కొట్టిస్తున్నారు వరుసగా. ఇదీ అంతే. అర్ధం పర్ధం లేని కథ. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఏజెంట్ హీరో పాత్రతో ఇష్టారాజ్యంగా వుంది కథ. ఎన్ఐఏ అనేది టెర్రరిజం, నక్సలిజం, అక్రమ మానవ రవాణా, నకిలీ నోట్లు, నిషేధిత మారణాయుధాల సరఫరా, సైబర్ టెర్రరిజం వంటి కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ. కేవలం ఇన్వెస్టిగేట్ చేసి కోర్టులో కేసులు నడిపే సంస్థ మాత్రమే. ఒకరికి సెక్యూరిటీ కల్పించడం సంస్థ పని కాదు. అలాటిది రాష్ట్ర హోమ్ మంత్రి సెక్యూరిటీగా హీరో ఎలా వచ్చాడు? దర్శకుడు తనకి తానే ఫీలై ఇతడ్ని సెక్యూరిటీగా నియమించేస్తే చెల్లిపోతుందా? ఎన్ఐఏ ఏజెంట్లు సెక్యూరిటీ గార్డులా? ఇదెంత హాస్యంగా వుందో సినిమా కూడా అంత హాస్యాస్పదంగా వుంది.
పేరుకి హోమ్ మంత్రిని రక్షించే డ్యూటీ, కథంతా హీరోయిన్ తో ప్రేమ కామెడీలే. హోమ్ మంత్రిని రక్షించే సీరియస్ డ్యూటీ కూడా కామెడీలే. ప్రేమ ట్రాకే మొత్తం ప్రధాన కథకి అడ్డుపడుతూ నవ్వులాటగా మార్చేసింది. ప్రేక్షకులు ఇంత తెలివి తక్కువగా సినిమాలు చూస్తారనుకున్నట్టుంది. హీరో కార్తికేయ తన ఆరో ఫ్లాప్ కోసం దిగ్విజయంగా ఈ కథ ఒప్పుకున్నట్టుంది. ఇక ఏడో ఫ్లాప్ కోసం ఇంకెలాటి కథ సైన్ చేశాడో, చేస్తాడో చూడాలి. అతను కథల మీద అవగాహన లేక చేతులారా కెరీర్ పాడు చేసుకుంటున్నాడు.
నటనలు- సాంకేతికాలు
ఎన్ఐఏ ఏజెంట్ గా షేప్, స్టయిల్, పాయిజ్ వగైరా బాగా వర్కౌట్ చేశాడు కార్తికేయ. తన వర్కౌట్ కి తగ్గ కథ దర్శకుడివ్వ లేకపోతే ఏం లాభం. కామెడీలు చేసుకుంటూ వుండిపోవడమే. విక్రమార్క రోమాంటిక్ కామెడీలనుకోవచ్చు టైటిల్. ఈ రోమాంటిక్ సీన్లూ ఒక్కటీ ఎంటర్ టైన్ చేయలేని నిస్సహాయతని దర్శకుడి నుంచి అరువు దెచ్చుకున్నట్టుంది. ఇక యాక్షన్ సీన్స్ కి తగ్గ ఫిజిక్ అంతా వుంది కార్తీకేయకి. యాక్షన్ సీన్స్ కి తగ్గ సిట్యుయేషన్స్ నివ్వాలనే దర్శకుడికి తట్టలేదు. కార్తికేయ ఏం చేసి కనీసం మాస్ ప్రేక్షకుల్ని మెప్పించాలన్నా, వీల్లేకుండా విడివిడి ఖండాలుగా చేసి అన్నీ అందించాడు దర్శకుడు.
దర్శకుడు చేసిన మెచ్చదగ్గ పని ఒక్కటే. తనికెళ్ళ భరణి చేత పంచ్ డైలాగులు పేల్చడం. సినిమాలో ఇదొక్కటే కాస్త ఎంటర్టయిన్మెంట్. ఇక హీరోయిన్ సహా ఎవరి గురించీ చెప్పుకోవడానికి లేదు. సుధాకర్ కోమాకుల వయసుకి మించిన ఏసీపీ పాత్రలో అతి అన్పి స్తాడు. శత్రువులు టార్గెట్ చేసిన, హీరో సెక్యూరిటీగా వున్న, సాయి కుమార్ కీలక హోమ్ మంత్రి పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోవాదం ఒక విచిత్రం.
సాంకేతిక శాఖలు దర్శకత్వంకంటే అద్భుతంగా వుండడం ఒక విశేషం. యాక్షన్ సీన్స్, కెమెరా వర్క్ లాగా దర్శకుడి దర్శకత్వ సత్తా కూడా వుండుంటే సాంకేతిక విలువలు సార్ధకమయ్యేవి. విచిత్ర్మేమిటంటే పాటలు కూడా కథానుసారం వుండవు. ఏదీ కథానుసారం వుండని అతుకుల బొంత అని కాస్త కఠినంగానే చెప్పక తప్పదు.
చివరికేమిటి
కథ లేకుండా నాల్గు రకాల యాక్షన్, కామెడీ, లవ్, సాంగ్స్ బిట్లు బిట్లుగా కలిపి తీసిన సినిమా ఇది. ఇది కూడా కొత్త ప్రయోగమేనేమో. ఫస్టాఫ్ పసలేని లవ్ ట్రాక్ తో, సాంగ్స్ తో విషయం లేకుండా సాగుతూ వుంటుంది. కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ అని రివీలైనప్పుడు మనకి థ్రిల్ ఏమీ వుండదు ఈ టర్నింగ్ కి. ఎన్ఐఏ ఏజెంట్ అని ముందే పబ్లిసిటీలో చాలా చెప్పేశారు గనుక. పబ్లిసిటీలో సస్పెన్స్ లేదు, సినిమాలోనూ సస్పెన్స్ లేదు. ఎలాగో ఫస్టాఫ్ అయిందన్పించాక సెకండాఫ్ ఏం చేయాలో అర్ధం గానట్టు సిల్లీ కథా కథనాలు, కామెడీలు. హీరోయిన్ కిడ్నాపులు.
కొత్త దర్శకుడికి యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ల మీద అవగాహన లేకుండానే ఈ సాహసానికి ఒడిగట్టి నట్టుంది. తనవల్ల కానిది వదిలేసి కామెడీలు తీసుకుంటే సరిపోతుంది. సగటు ప్రేక్షకులు కూడా ఎలాపడితే అలా సినిమాలు తీస్తే చూసే మూడ్ లో ఇప్పుడు లేరు. జీవన వ్యయం పెరిగిపోయి సినిమా టికెట్ కొనాలంటే ఆలోచిస్తున్నారు. ఎంతో బావుందని టాక్ వస్తే తప్ప వాళ్ళ టికెట్లు తెగే పరిస్థితి లేదు. కొత్త దర్శకులు మిడిమిడి జ్ఞానంతో సినిమాలు తీసే కాలం పోయింది. చిరంజీవి హిట్ సినిమా టైటిల్ పెట్టినంత మాత్రాన చాలదు.
—సికిందర్