ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న కానీ అది పార్టీకి చెడు చేయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం కానీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంటున్నాయి, తాజాగా ఆర్టీసీ బస్సుల విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కరోనాకి ముందు APSRTC బస్సులు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2 లక్షల 60 వేల కిలోమీటర్లు పైగా తిరిగేవి, కానీ నేడు ఆంధ్ర ప్రదేశ్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం లక్ష 60 వేల కిలోమీటర్లే తిప్పగలిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఎక్కువగా ఉండేది ఆంధ్ర జనాలే, వాళ్ళని తీసుకెళ్లి, తీసుకోని రావటంతోనే RTC కి ఎక్కువగా లాభాలు వస్తాయి, పైగా హైదరాబాద్ నుండి విజయవాడ, గుంటూరు వెళ్లే రూట్ ఎక్కువ లాభాలు తెచ్చిపెడుతుంది, ఇక నుండి ఈ రూట్ మీద తెలంగాణ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బస్సులు నడపాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదికి సరాసరి మూడు వందల కోట్లు APSRTC నష్టపోతోంది. రెండు మూడు నెలలు చర్చలు జరిపి ఇలాంటి దారుణమైన ఒప్పందం ఎలా చేసుకుంటారని జగన్ సర్కార్ మీద పార్టీలకు అతీతంగా విమర్శలు వస్తున్నాయి.
గతంలో కాళేశ్వరం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. కాళేశ్వరం నిర్మిస్తే గోదావరి జలాల విషయంలో ఇబ్బందులు తప్పవని తెలిసిన, అనుమతులకు మించి కాళేశ్వరం నిర్మిస్తున్నారని తెలిసిన కానీ జగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి ప్రారంభించి వచ్చాడు. ప్రతిపక్షములో వున్నప్పుడు కాళేశ్వరం అక్రమమని గొంతెత్తిన జగన్, సీఎం అయినా తర్వాత స్వయంగా ప్రారభించటంపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చాయి, ఇరుగుపొరుగు రాష్ట్రాలు అంటే ఇచ్చిపుచ్చుకోవాలి కానీ మీకు మాదిరి గొడవలు పెట్టుకొని అభివృద్ధిని అడ్డుకోవాలంటూ వైసీపీ నేతలు అప్పట్లో ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు, కానీ తీరా జరిగింది ఏమిటి..? పోతిరెడ్డి పాడు ఎత్తు పెంచే విషయంలో, రాయలసీమకు జలాలు తరలించే విషయంలో కేసీఆర్ సానుకూలంగా స్పందించకపోగా, మెలిక పెట్టి అడ్డుకున్నాడు.. చివరికి ఆంధ్ర తన మిగులు జలాలు తరలించుకోవటానికి కూడా చేతకాలేని స్థితిలో ఆగిపోయింది.
అదే విధంగా హైదరాబాద్ లో ఉమ్మడి రాజధాని క్రింద ఏపీ ప్రభుత్వానికి కొన్ని ఆస్తులు ఉన్నాయి , వాటిలో చాలా వరకు కేసీఆర్ సర్కార్ కు ధారాదత్తం చేశారు తప్పితే, వాటికీ లెక్క కట్టి దాని తాలూకా నిధులను తెలంగాణ సర్కార్ నుండి ఇప్పటి వరకు ఏపీ ఖజానాకు తీసుకోలేకపోయారు. ఆంధ్ర ఏమైనా ధనిక రాష్ట్రమా అది కాదు..పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఆర్థిక వనరులను చేజేతులా కాలదన్నుకోవటం ఏమిటి..? ఇక విభజన చట్టంలో చెప్పినట్లు ప్రత్యేక హోదా అనే విషయాన్నీ ఎప్పుడో పక్కన పెట్టేశారు.
అదే సమయంలో జనాలు కూడా దానిని మర్చిపోయేలా చేయటానికి పోలవరాన్ని తెరమీదకు తీసుకోని వచ్చి హైలైట్ చేశారు , తీరా ఇప్పుడు చూస్తే పోలవరం విషయంలో కేంద్రం కొత్త మెలిక పెట్టి చోద్యం చూస్తూ కూర్చుంది. ఇదేమిటని అడిగే నాయకుడు ఈనాడు లేడు , ఆనాడు ఏలిన పాలకులు నోరెత్తటం లేదు. ఇవన్నీ గమనిస్తే ప్రతి నిర్ణయంలో ఆంధ్రకు అన్యాయమే జరుగుతుందని ఏ ఒక్కటైనా పోరాడి సాధించింది లేదని, ప్రతి చోట మొండిచెయ్యి ఎదురవుతూనే ఉండనే భావన ఇప్పుడు ఆంధ్ర ప్రజల్లో సృష్టంగా కనిపిస్తుంది. భావన మరింత పెరిగితే వచ్చే ఎన్నికల నాటికీ అది సునామిగా మారి వైసీపీ కొంప ముంచే అవకాశం లేకపోలేదు.