ఇటు పోలీసు, అటు మావోయిస్టు.. ఎవరైతేనేం.. అందరూ మనుషులే. ఇద్దరూ ఆయుధాలు పట్టారు. ఒకరు చట్టబద్ధంగా, ఇంకొకరు చట్ట విరుద్ధంగా. ఇద్దరూ భారతీయులే. ఒకరు పేదలకు అండగా నిలిస్తే, ఇంకొకరు శాంతి భద్రతల్ని కాపాడేందుకు తమ జీవితాల్ని బలిపెడుతున్నారు. మావోయిస్టులు, పోలీసుల్ని చంపుతున్నారు.. పోలీసులు, మావోయిస్టుల్ని చంపుతున్నారు. ఏళ్ళ తరబడి నడుస్తున్న కథ ఇది. అసలు నక్సలిజం ఎలా ప్రజల్లోకి వెళ్ళింది.? అన్నది వేరే చర్చ. కానీ, ప్రాణాలు పోతున్నాయ్.. ప్రకృతి అందాలకు నెలవైన అడవి నెత్తురోడుతోంది. ఛత్తీస్‌ఘడ్‌లో ఇటీవల జరిగిన దాడిలో 20 మందికి పైగా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కొందరి ఆచూకీ తెలియడంలేదు. ఈ దాడిలో మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారన్నది పోలీసు వర్గాలు వెల్లడిస్తున్న అంశం. కిరాతకం.. అత్యంత కిరాతకం.. నిజానికి, ఇంతకన్నా పెద్ద పేర్లు వాడాలిక్కడ.
మావోయిస్టులు దొంగ దెబ్బ తీశారన్నది పోలీసుల వెర్షన్. ఇలాంటి దొంగ దెబ్బలకు పేటెంట్ హక్కు పోలీసులదేనని మావోయిస్టులు చెబుతుంటారు. ఇద్దరూ ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నప్పుడు, ఒకరి మీద ఇంకొకరు ఘర్షణకు దిగడమెందుకు.? ఒకర్ని ఇంకొకరు చంపుకోవడమెందుకు.? ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. మావోయిస్టుల్ని అంతమొందించడానికి ప్రభుత్వాలు చాలా ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక దళాల్నీ నియమిస్తున్నాయి. మరోపక్క, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తోన్న దళాల్ని నిర్వీర్యం చేయడం కోసం మావోయిస్టులూ ప్రత్యేక వ్యూహాలు రచిస్తుండడం గమనార్హం. కానీ, ఈ మారణహోమానికి ముగింపు ఎక్కడ.? మావోయిస్టులంటే మన దేశ పౌరులే. జవాన్లను కోల్పోయిన కుటుంబాలు కంటతడి పెడుతున్నాయి.. తండ్రిని కోల్పోయిన చిన్నారి.. భర్తను కోల్పోయిన బార్య.. కుమారుడ్ని కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇలా మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను తలచుకుంటే కళ్ళు చెమర్చుతాయి. ఎన్‌కౌంటర్ల సందర్భంగా మావోయిస్టులు చనిపోయినప్పుడూ.. వారి మరణాలకు సంబంధించి మీడియాలో వార్తలు దర్శనమిస్తే.. అప్పుడూ వారి కుటుంబాలు గుర్తుకొస్తాయి చాలామందికి. ఇదింతే.. ఇది ఇలాగే జరుగుతుందంతే.