135 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరుస వైఫల్యాలతో సతమవుతూనే ఉంది. సోనియా గాంధీ పార్టీని నడపడంలో గతంలో మాదిరి ఆసక్తిని కనబర్చలేకపోవడం, రాహుల్ గాంధీ నిలకడ మీద ప్రజలకు నమ్మకం లేకపోవడం, పార్టీ నిండా వృద్ధ నేతలు నిండిపోయి ఇప్పటికీ మూడు నాలుగు దశాబ్దాల కిందటి భావజాలంతో ఉండటమే ఆ పార్టీ వైఫల్యాలకి ప్రధాన కారణమనేది విశ్లేషకులు అంచనా. ఒకప్పుడు బీహార్ రాష్ట్రంలో తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించిన హస్తం ఇప్పుడు మాత్రం పూర్తిగా తిరోగమన స్థితిలో ఉంది. గత ఎన్నికల్లో కేవలం 19 సీట్లకే పరిమితమవడం చూస్తే ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఎంత అనాసక్తి ఉందో అర్థమవుతోంది.
ఎంత కాదనుకున్నా బీజేపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. ఎన్డీయే కూటమిని ఢీకొట్టగల శక్తిసామర్థ్యాలు యూపీఏకి మాత్రమే ఉన్నాయి. గొప్ప సిద్ధాంతాలతో, ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవసరం కూడ. కానీ ఆ పార్టీలో ఉన్న నేతలే జనానికి తాము అవసరమనేలా ప్రవర్తించడంలేదు. ఎంతసేపూ బీజేపీ మీద నిందలు వేయడం తప్ప తమ వలన ప్రజలకు ఇరిగే ప్రయోజనం ఏంటో ఒక్కరూ చెప్పరు. అసలు నాయకత్వ బాధ్యతలను తీసుకునే ధైర్యం ఎవరూ చెయ్యట్లేదు. ఇందిరా, సోనియా తరహాలో నిజాయితీ కలిగిన రాజకీయం చేసే తత్త్వం ప్రస్తుత నాయకుల్లో కొరవడింది.
ఇక వారసులు రాహుల్, ప్రియాంక గాంధీలు అయితే ప్రజాక్షేత్రంలో పూర్తిగా తేలిపోయారు. అసలు రాహుల్ సభలు పెడితే జనం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదంటే వారి పట్ల ఓటర్ల విముఖత ఎంతలా ఉందో చూసుకోవచ్ఛు. నిజానికి బీహార్లో కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్ధులే లేరు. కటాకంచిగా చూసుకుంటే 20 నుండి 25 స్థానాల్లో మాత్రమే వారికి చెప్పుకోదగిన అభ్యర్థులు ఉన్నారు. అయినా పట్టుబట్టి 70 స్థానాల్లో బరిలోకి దిగారు. జేడీయూ నేత తేజస్విని పీడించి మరీ అన్ని స్థానాలు తీసుకుని కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలవగలిగారు.
అదే ఆ 70 స్థానాల్లో 30 స్థానాల్లో ఆర్జేడీనే పోటీకి దిగి ఉంటే ఇంకో 15 నుండి 20 స్థానాలు ఎక్కువగా గెలిచేవారు. ఒకటరిగా చూసుకుంటే జేడీయూ 75 స్థానాలతో అతి పెద్ద పార్టీగా ఆవరించింది. బీజేపీ ఒంటరిగా 74 స్థానాల్లో గెలిచింది. అంటే ఎటు తిప్పీ ఆర్జేడీదే పైచేయి. జేడీయూ అయితే 43 స్థానాలకు పరిమితమైంది. కానీ కూటమిలో బీజేపీ, జేడీయూ పైచేయి సాధించగా వామపక్షాలు బాగా పుంజుకుని 16 స్థానాలు సొంతం చేసుకుని తేజస్వి సారథ్యంలోని మహాకూటమికి బలాన్ని చేకూర్చాయి. అంటే వామపక్షాల స్థాయిలో కూడ కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. ఒకరకంగా మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీ కూడ ఒక ప్రధాన కారణం. ఇలా కాంగ్రెస్ పతనావస్థకు చేరుకోవడానికి ఆ పార్టీలోని నిబద్దత, నిజాయితీ, ధైర్య సాహసాలు లేని నాయకులే కారణం.