కేశినేని నాని ఈజ్ బ్యాక్: బెజవాడ టీడీపీలో అంతా ఓకేనా.?

Kesineni Nani Is Back, But Still Same Confusion

Kesineni Nani Is Back, But Still Same Confusion

టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచింది ముగ్గురే ముగ్గురు ఎంపీలు. అందులో విజయవాడ ఎంపీ కేశినేనాని, తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తరచూ తలనొప్పిగా మారుతుంటారు. అదే సమయంలో, ఆయన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పొమ్మనలేక పొగ పెడుతుంటారు.

నిజానికి, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ పీఠం టీడీపీ కైవశం అవ్వాల్సి వుంది. కానీ, టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు, అధికార వైసీపీకి బాగా కలిసొచ్చాయి.

కేశినేని నాని కుమార్తె శ్వేత విజయవాడ మేయర్ పీఠంపై బోల్డన్ని ఆశలు పెట్టుకున్నా, టీడీపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా దెబ్బతిన్నారు. కేశినేని నానికీ, టీడీపీకి చెందిన సీనియర్ నేతలు బుద్దా వెంకన్న, బొండా ఉమామహేశ్వరరావుకీ మధ్య జరిగిన రచ్చ నేపథ్యంలో బెజవాడ టీడీపీ అప్పట్లో రోడ్డున పడిపోయిన విషయం విదితమే. ఆ కేశినేని నాని ఇప్పుడు తీరిగ్గా, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘కేసీయార్, వైఎస్ జగన్.. ఇద్దరూ తోడు దొంగలే..’ అంటూ కేశినేని నాని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల సమస్యలదాకా ఎందుకు.? అసలు టీడీపీలోనే మీరు వున్నారా.? లేదా.? అని సాక్షాత్తూ టీడీపీ శ్రేణులే కేశినేని నాని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బెజవాడలో గ్రూపు తగాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేశినేని నాని విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చూసీ చూడనట్టు వ్యవహరించడం తప్ప, చేయగలిగిందేమీ లేదు.

ఎందుకంటే, ఆయన టీడీపీలో వున్నట్టు కనిపించకపోయినా.. వున్నట్టే భావించాలి.. లేదంటే, ఇప్పటికే బెజవాడలో దాదాపుగా గల్లంతయిపోయిన టీడీపీ, మరింత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. కమ్మ సామాజిక వర్గం బలంగా వున్న బెజవాడ ప్రాంతంలో, అమరావతి ఉద్యమం గట్టిగా సాగుతున్న ఈ ప్రాంతంలో టీడీపీ, తన ఉనికిని చాటుకోలేకపోతోందంటే అంతకన్నా దారుణం ఇంకేముంటుంది.?