జై ఎన్టీఆర్: ఈ పొలిటికల్ సౌండ్ ఏంటబ్బా.?

Jai NTR, Sounding Massive In TDP Circles

Jai NTR, Sounding Massive In TDP Circles

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తనను తాను జూనియర్ ఎన్టీఆర్ అనే చెప్పుకుంటుంటాడు. అయితే, ఈ మధ్య సీన్ మారింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కోసం యంగ్ టైగర్, తన పేరుని ‘మీ రామారావు’ అని పేర్కొనడంతో అంతా ఆశ్చర్యపోయారు. నిజానికి, తెరపై కూడా ‘నందమూరి తారకరామారావు’ అనే యంగ్ టైగర్ పేరుని కొన్ని సినిమాల్లో పేర్కొనడం చూస్తున్నాం. కాగా, ఈ మధ్య ‘జై ఎన్టీఆర్’ అంటూ సోషల్ మీడియా వేదికగా యంగ్ టైగర్ అభిమానులు పేర్కొంటుండడం టీడీపీ వర్గాల్లో కొంత ఆందోళన, కొంత సంతోషానికి కారణమవుతోంది. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ పేరు ప్రముఖంగా వినిపించడంలో వింతేముంది.? అందుకే, తన కుమారుడు లోకేష్ మంత్రి అయ్యేలా చంద్రబాబు తన హయాంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

పార్టీకి చంద్రబాబు తర్వాత పెద్ద దిక్కు.. అంటే లోకేష్ మాత్రమే. నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యేనే అయినా.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనరు. ఇక, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో ‘జై ఎన్టీఆర్.. నువ్వే టీడీపీకి దిక్కు..’ అంటూ చాలామంది అభిమానులు, కొందరు టీడీపీ మద్దతుదారులు నినదిస్తుండడం గమనార్హం. ‘నువ్వు పార్టీ వ్యవహారాలు చూసుకో.. పార్టీ అధికారంలోకి వచ్చాక లోకేష్ పాలనా వ్యవహారాలు చూసుకుంటారు..’ అని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అంటే, ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడవుతాడన్నమాట.. లోకేష్, టీడీపీ హయాంలో నడిచే ప్రభుత్వానికి అధినేత అవుతారన్నమాట. ఇది సాధ్యమయ్యే పనేనా.? తాత ఎన్టీఆర్ బాటలో, యంగ్ టైగర్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక, సినీ అభిమానులతోపాటు.. టీడీపీలో వున్న చాలామంది అభిమానుల్లో వుంది. ఇదిలా వుంటే, టీడీపీ వ్యతిరేకులు కొందరు కావాలనే కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారనీ, లోకేష్ – ఎన్టీఆర్ మధ్య విభేదాలకు కారణమవుతున్నారనే వాదనలూ లేకపోలేదు.