Chiranjeevi : నేను పెద్దన్నని కాదు, పెద్దరికం నాకొద్దు: చిరంజీవి

Chiranjeevi : ‘నేను పెద్దన్నని కాను, నాకు పెద్దరికం వద్దు.. నేను పంచాయితీలు చేయను. కష్టంతో ఎవరైనా వస్తే మాత్రం ఆదుకుంటాను. పరిశ్రమ బిడ్డగా వుంటాను తప్ప, పెద్దరికం తీసుకునే ఆలోచనలే నాకు లేవు..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తేల్చేశారు.

తెలుగు సినీ పరిశ్రమ అనాధగా మారిపోయింది. సినిమా టిక్కెట్ల వ్యవహారం కావొచ్చు, మరో వ్యవహారం కావొచ్చు.. పరిశ్రమ పరువుని బజార్న పడేస్తున్నా, గట్టిగా ఎవరూ గొంతు విప్పలేని పరిస్థితి. పోనీ, ఎవరన్నా ప్రశ్నిద్దామనుకున్నా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కేస్తున్నారు ఎవరి బానిసత్వానికో తలొగ్గిపోయిన కొందరు ప్రముఖులు.

‘మా’ ఎన్నికలకు ముందు పరిస్థితులు వేరు. ఆ తర్వాత పరిస్థితులు వేరు. చిరంజీవిని అనవసరంగా వివాదాల్లోకి లాగి కొందరు వెకిలితనం ప్రదర్శించారు. ఆ వెకిలితనమే ఇప్పుడు సినీ పరిశ్రమకు శాపంగా మారింది. ‘మేం ఉద్ధరించేస్తాం.. మేం పెద్దోళ్ళం, గొప్పోళ్ళం..’ అని చెప్పుకున్నోళ్ళు ఆ తర్వాత ఎప్పుడూ ఎక్కడా పరిశ్రమ కోసం గొంతు విప్పలేకపోయారు.

తాజా పరిణామాల నేపథ్యంలో, ‘మీరే బాధ్యత తీసుకోవాలి.. మీరే పెద్దగా వుండాలి..’ అని చిరంజీవిని సినీ పరిశ్రమ తరఫున కొందరు కోరితే, ‘నాకు ఆ ఉద్దేశ్యం లేదు. నాకు ఆ పదవి వద్దు..’ అని చిరంజీవి తేల్చి చెప్పేశారు. కానీ, సాయం చేయడంలో మాత్రం తాను ముందుంటానని చిరంజీవి చెప్పడం గమనార్హం.

సంక్రాంతి సినిమాల రగడ కావొచ్చు, సినిమా టిక్కెట్ల గొడవ కావొచ్చు.. ఏకపక్ష నిర్ణయాలు, అర్థం పర్థం లేని రాజకీయాలు.. సినీ పరిశ్రమను నాశనం చేస్తున్నాయన్నది నిర్వివాదాంశం.