రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ మధ్యన మంచి స్నేహ బంధం ఉన్నట్టే ఉంటాయి. ఇరువురు ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ భాయి.. భాయి అంటుంటారు. కానీ రాజకీయంగా మాత్రం తెరాస నేతలు తమ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసేవారు. కేసీఆర్ కూడ అంతే.. వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేసేవారు. కానీ వైఎస్ జగన్ అలా కాదు. దోస్తీ అంటే దోస్తీనే. ఎక్కడా తేడా ఉండదు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని యేడాదిన్నర గడిచింది. ఇప్పటివరకూ కేసీఆర్ మీద విమర్శ చేయలేదు. ఆయన వైపు వేలు చూపి తాను మంచివాడినని అనిపించుకునే ప్రయత్నం చేయలేదు.
కానీ తెరాస నేతలు ఆ పని చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష రావు. జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం విధానాల విషయాలు వస్తే జగన్ పేరును చక్కగా వాడేస్తున్నారు. బీజేపీ అంటే తెరాసకు అస్సలు గిట్టదు. అందుకే పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపలేదు. మొన్నామధ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో ఓటు వేయకుండా మేము ఏ జాతీయ పార్టీకి మిత్రపక్షం కాదని దూరంగా ఉన్నారు. తాజాగా ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లును తేనెపూసిన కత్తితో పోల్చి ఆ బిల్లును తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. ఈ బిల్లునే కాదు… కొత్త విద్యుత్ చట్టాన్ని, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే నిబంధనను ఖండిస్తోంది.
కేంద్రం చెప్పిందని కాబట్టి చేయాల్సిందేనని, రైతులకు నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని, మోటార్లకు మీటర్లు పెడతామని జగన్ అంటుంటే కేసీఆర్ మాత్రం మీటర్లు గీటర్లు ఏం ఉండవ్ అంటున్నారు. ఈ విషయంలో తమను తాము హైలెట్ చేసుకోవడానికి జగన్ పేరును వాడుకుంటున్నారు. తాజాగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణకు కేంద్రం రూ.2,500 కోట్ల నిధులు ఇచ్చి బోరుబావుల వద్ద మీటర్లు పెట్టమంటే మేము పెట్టము అన్నాం. కానీ ఏపీకి రూ.4 వేల కోట్లు ఇస్తాము అంటే జగన్ ఒప్పుకొని రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారని అన్నారు. ఈ వాఖ్యల్లో ఏపీ ప్రభుత్వం డబ్బుకు ఆశపడినట్టు మేము పడలేదని హరీష్ రావు అన్నట్టే ఉంది.