మనదేశంలో ఆర్థికసంస్కరణల దశ మొదలై మూడు దశాబ్దాలయింది. బంగారాన్ని తాకట్టు పెడితే కానీ రోజు గడవని స్థితిలో ఉన్న దేశాన్ని నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తన దూరదృష్టి, మేధస్సును రంగరించి ఆర్ధికరంగంలో నిష్ణాతులైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్దికమంత్రిగా చేసుకుని ప్రారంభించిన సంస్కరణల ఫలితంగా దేశ ఆర్ధిక వ్యవస్థ సరిక్రొత్త పుంతలు తొక్కింది. లైసెన్స్ రాజ్ ను నియంత్రించి ప్రయివేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరవడంతో విదేశీ పెట్టుబడులు వరదలై పొంగాయి. ఆర్ధికస్వరూపమే మారిపోయింది. ప్రయివేట్ రంగంలో ఉద్యోగాల కల్పన పెరిగింది. అప్పుడే అంకురించిన ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఆ తరువాత ప్రధానమంత్రిగా (మధ్యలో ఇద్దరు పనికిమాలినవారు వచ్చారు…వారిని నేను లెక్కలోకి తీసుకోవడం లేదు) బాధ్యతలు స్వీకరించిన అటల్ బిహారి వాజపేయి ఆర్థికసంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఫలితంగా పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేశారు. ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సైతం కనీసం అరవై ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రయివేట్ వారికి అప్పగించి చేతులు దులుపుకున్నారు.
వాజపేయి తరువాత మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణలు జరిగినా వాళ్ళు కొంత మానవత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు జరుగుతున్నంత తీవ్రంగా మాత్రం లేదు. మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ఒక పధకం ప్రకారం బలహీనపరచడం మొదలైంది. ఒక్క సంస్థను స్థాపించకపోయినా, తాతలు సంపాదించిన ఆస్తులను మనవాళ్ళు తగలేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో ముందుచూపుతో నెలకొల్పిన ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం నిర్వహించలేక, కార్పొరేట్ శక్తులకు తెగనమ్మేస్తున్నది. ఆయా సంస్థలతో ఉద్యోగులకు, ఆ ప్రాంతీయులకు సహజంగా ఏర్పడే అనుబంధాన్ని, ఆత్మీయతను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీరాన ఉన్న ఏకైక పెద్ద ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. ఈ కర్మాగారంలో సుమారు ఇరవైవేలమంది ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం కూలిపోయేంతవరకు లాభాలబాటలోనే నడిచిన ఈ సంస్థ విచిత్రంగా మోడీ రాగానే నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇక ఈ సంస్థ తమకు గుదిబండగా మారిందని చెప్పి ప్రయివేట్ యాజమాన్యాలకు అమ్మేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. దాంతో ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ స్టీల్ భవితవ్యం అంధకారం కావడంతో ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రగిలాయి. కార్మికులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ వైసిపి ప్రభుత్వం, పార్టీ ఉద్యమానికి మద్దతును ప్రకటించాయి. బందులో పాల్గొన్నాయి. పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి పాతిక కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించడమే కాక ఈ సంస్థను ప్రయివేటీకరించడానికి మేము వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కేందం నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ ప్రధానమంత్రికి లేఖను వ్రాశారు.
అయితే కేంద్రం ప్రజల సెంటిమెంటును, ఉద్యమాన్ని, నిరసనలను, చివరకు ముఖ్యమంత్రి లేఖను కూడా పట్టించుకోకపోవడం అతి దారుణం. ప్రధాని అనుమతి ఇస్తే అఖిలపక్షాన్ని, కార్మికనేతలను కూడా ఢిల్లీకి తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి మరొక లేఖ వ్రాశారు. అయితే ఆధిక్యతబలంతో విర్రవీగుతున్న మోడీ సర్కార్ ఇలాంటి అభ్యంతరాలను లెక్కచేసే పరిస్థితిలో లేదనేది వాస్తవం.
విశాఖ ఉక్కుతో రాష్ట్రప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకపోయినా దాన్నేదో జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అమ్మేయిస్తున్నాడని తెలుగుదేశం వారి తోకపార్టీలు, వారి భజంత్రీలు రామోజీరావు, రాధాకృష్ణ బురదచల్లడం ప్రారంభించారు. ఇలాంటివారు పత్రికలకు యజమానులుగా ఉండటం ఈ రాష్ట్రప్రజలు దౌర్భాగ్యమ్. వారి లక్ష్యం జగన్ మీద దుష్ప్రచారం చేసి చంద్రబాబుకు కొంచెం లబ్ధిని కలిగించడమే. మన రాష్ట్రంలో చెప్పుకోవడానికి కొందరు వ్యర్థులైన మేధావులు ఉన్నారు. వాస్తవాలు వారికి బాగా తెలుసు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డిమీద అకారణ ద్వేషాన్ని పెంచుకుని నోళ్లకు తాళాలు వేసుకుని చోద్యం చూస్తున్నారు. అంతకన్నా విషాదకరం మరొకటి లేదేమో?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ
విశ్లేషకులు