
తెలుగుదేశం పార్టీలో రానున్న రోజుల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయా.? యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారా.? ముఖ్యమంత్రి పదవి మాత్రం నారా లోకేష్ దక్కించుకుంటారా.? ఈ ప్రశ్నల చుట్టూ టీడీపీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఓ టీడీపీ సీనియర్ నేత ఈ ప్రతిపాదన తెరపైకి తెచ్చారట. ప్రస్తుతం అందుకు తగ్గ రీతిలో చర్చలు జరుగుతున్నయాట. ఎవరి మధ్య.? అంటే, బహుశా జూనియర్ నందమూరి తారకరామారావు.. అదేనండీ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో టీడీపీ నేతలు చర్చిస్తున్నారని అనుకోవాలేమో. కానీ, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే బుల్లితెర షో ప్రారంభోత్సవంలో ‘రామారావు’గా తనను తాను ప్రమోట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజకీయాల గురించి మాత్రం ‘ఇది తగిన సమయం కాదు’ అని తేల్చేశారు. ‘రాజకీయాల గురించి మరో సందర్భంలో తీరిగ్గా మాట్లాడుకుందాం’ అని యంగ్ టైగర్, మీడియా ప్రతినిథులతో అన్నారంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.
టీడీపీ పగ్గాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి వస్తే, ఆ తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించే అధికారం కూడా ఆయనకే వుంటుంది. అలాంటప్పుడు, నారా లోకేష్ అసలు ప్రస్తావనలోకైనా ఎందుకొస్తారు.? ఛాన్సే లేదు. కానీ, అంత తేలిగ్గా పార్టీపై పట్టు కోల్పోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధపడరు. మొదటి నుంచీ టీడీపీకి నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెడుతూనే వచ్చారు. బాలయ్య టీడీపీ నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నా, పార్టీ రాజకీయాల్లో బాలయ్య పాత్ర చాలా చాలా తక్కువ. అసలు రాజకీయ తెరపై బాలయ్య, తన ఉనికిని చాటుకున్నదే లేదు.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం తప్ప. హిందూపురం.. స్వర్గీయ నందమూరి తారకరామారావుకి కంచుకోట. దానికి తోడు, వైఎస్ జగన్ అభిమానుల్లోనూ కొంత మేర బాలయ్య పట్ల సాఫ్ట్ కార్నర్ వుంది. ఎలా చూసినా, టీడీపీకి యంగ్ టైగర్ ఎన్టీఆరే దిక్కు. కానీ, ఆయన్ని చంద్రబాబు.. దగ్గరకు రానిచ్చే పరిస్థితే వుండదు. సో, పైన పేర్కొన్న ఈక్వేషన్ వర్కవుట్ అవడం దాదాపు అసాధ్యం.
