తగ్గేదే లె: ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి బరిలోనే

నాగార్జున ఖాతాలో వన్ ఆఫ్ ది సూపర్ హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’ కి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం ‘బంగార్రాజు’. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున సొంత బ్యానర్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. నాగ చైతన్య ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నారు.

కాగా, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసి, అనూహ్యమైన విజయం సాధించాడు నాగ్. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది కూడా ఈ సినిమా. అందుకే ఈ సినిమా ఫ్లేవర్‌ని ఏమాత్రం చెడగొట్టకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ కథ కోసం చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నారు. ఎట్టకేలకు అనుకున్న విధంగా కథ రావడంతో, ఇమ్మీడియట్‌గా పట్టాలెక్కించేశారు.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇకపోతే, సంక్రాంతి సెంటిమెంట్ ఓ పక్క, ‘లవ్ స్టోరీ’ హిట్‌తో జోరు మీదున్న నాగ చైతన్య లక్ ఇంకో పక్క.. ఇలా ఈ సినిమాని వీలైనంత తొందరలో అదీ, సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు నాగ్ అండ్ టీమ్ ఉత్సాహం చూపిస్తున్నారట. ఇప్పటికే భారీ సినిమాలు సంక్రాంతి రేస్‌లో పోటీ పడుతుండగా, అస్సలేమాత్రం తగ్గేదే లే.. అన్నట్లుగా జనవరి 15న ‘బంగార్రాజు’ను ధియేటర్‌లోకి తీసుకొచ్చేందుకు నాగార్జున వ్యూహ రచన చేస్తున్నారట.

ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’‌లో నాగ్, రమ్యకృష్ణ జోడీకి మంచి రెస్పాన్స్ రావడంతో, అదే జోడీని ఈ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నారు. చైతూకి జోడీగా ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి నటిస్తోంది.