Janasena : జనసేనాని పవన్ కళ్యాణ్ జెండా పీకేస్తారా.?

Janasena : ‘జెండా పీకేయడం’ గురించి గతంలో ఓ మీడియా సంస్థ తెరపైకి తెచ్చిన కథనం, అప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ఆ పత్రికలో వచ్చిన కథనమే నిజమైంది. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ జెండాని తానే స్వయంగా పీకేయాల్సి వచ్చింది చిరంజీవికి.

అది గతం. మరిప్పుడు, అదే రిపీట్ అవుతుందా పవన్ కళ్యాణ్ విషయంలో.? అంటే, ఓ జోతిష్యుడు అదే మాట చెబుతున్నాడు. మొన్నామధ్య సమంత వైవాహిక జీవితం గురించి సదరు జోతిష్యుడు చెప్పిందే నిజమైంది. నాగచైతన్యతో, సమంత విడిపోయింది. ఆ జోతిష్యుడే, 2024 ఎన్నికల్లో అసలు జనసేన పార్టీ వుండబోదని తేల్చేశాడు.

ఇంకేముంది, సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. సదరు జోతిష్యుడిపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్ చేసేస్తున్నారు. సరే, పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి వెర్రి వేషాలు (జోతిష్యం) పేరుతో వేయడం కొత్త విషయమేమీ కాదు.

కానీ, జనసేన పార్టీ వాస్తవ పరిస్థితేంటి.? 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందా.? అంటే, ఈ విషయమై జనసేన శ్రేణుల్లోనే స్పష్టత లేదు. ప్రస్తుతం తన సినిమాల పనుల్లో పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారు.

జనసేన తరఫున ఆ పార్టీ సీనియర్ నేత నాదండ్ల మనోహర్ ఏదో హడావిడి రాజకీయ తెరపై చేస్తున్నా, మీడియాలో ఆ హడావిడికి పబ్లిసిటీ దక్కడంలేదు. జనసేన కార్యకర్తలు మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. వాళ్ళకీ పబ్లిసిటీ దొరకడంలేదాయె. పవన్ పూర్తిగా పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టి, జనంలో వుంటే తప్ప, జనసేన పార్టీ బలపడే అవకాశమే లేదు. కనీసం, బీజేపీ స్థాయిలో కూడా జనసేన ఇటీవలి కాలంలో రాజకీయ తెరపై హడావిడి చేయలేకపోతోంది.