మీటింగ్ పెట్టి బుజ్జగిస్తారా.. క్లాస్ పీకుతారా ?

వైసీపీలో అసమ్మతి వాయిస్ పెరుగుతోంది.  సరిగ్గా ఏడాది పాలన ముగిసిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు సీఎం తీరు మీద గొంతు పెంచి మాట్లాడారు.  కొందరు ఇసుక కుంభకోణం గురించి మాట్లాడితే ఇంకొందరు నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నామని, జగన్ చుట్టూ ఒక కొటరీ ఏర్పడిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు.  మొదట్లో ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకున్న అధిష్టానం ఇప్పుడు మాత్రం అప్రమత్తమైంది.  ప్రతిపక్ష పార్టీ, మీడియా పెద్ద ఎత్తున వ్యవహారాన్ని హైలెట్ చేయడంతో దిద్దుబాటు చర్యలు ఆరంభించింది. 
 
అసలు వైసీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అనేలా ఉండేది మొదట్లో వ్యవహారం.  ఎవరెన్ని మాట్లాడినా తుది నిర్ణయం అధినేతదేనని, ఆ నిర్ణయం ఎలా ఉన్నా మిగతావారు దాన్ని శిరసా వహించి తీరాలనేది అక్కడి ప్రాథమిక నియమం.  ఇన్నాళ్ళు ఆ నియమాన్ని పాటించే సీఎం నుండి కనీస ఆదరణ లేకపోయినా ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు.  కానీ నియోజకవర్గంలో ఒత్తిడి పెరగడం, మంత్రి వర్గంలో మార్పులకు సమయం ఆసన్నమవడంతో ఒకరి తరవాత ఒకరు బ్లాస్ట్ అయ్యారు. 
 
దీంతో ఇక లాభం లేదనుకున్న అధిష్టానం ఈ వ్యవహారంపై ఒక లుక్ వేయాల్సిందేనని డిసైడ్ అయిందట.  ఎవరైతే అసంతృప్తితో నోరెత్తారో వారందరితో ఒక మీటింగ్ పెట్టాలని సీఎం భావిస్తున్నట్టు టాక్.  ఈ మీటింగ్లో అగ్రశ్రేణి నాయకులంతా ఉండనున్నారట.  మరి ఈ మీటింగ్ ఎదురుతిరిగిన వారి బాధలను వినడానికో లేకపోతే స్వపక్షంలో విపక్షంలా మారి ప్రజల్లో పార్టీ బలహీనతపడిందనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని, ఇది తగదని క్లాస్ పీకడానికో తెలియాల్సి ఉంది.