భారత ప్రజాస్వామ్యం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని పాఠ్యం పుస్తకాల్లో ప్రజాస్వామ్య పాఠంలో కనిపించే మొదటి వాక్యం. అయితే, కనిపించని రెండో వాక్యం… అతిపెద్ద గోల్ మాల్ ప్రజాస్వామ్యం కూడా ఇదే. దీని మీద ప్రఖ్యాత జర్నలిస్టు ప్రభు చావ్లా ఒక విశ్లేషణ చేస్తూ ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందన్నారు. విశ్లేషణ పార్టీల నాయకుల ధోరణి, వాళ్లు ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తున్న తీరుకు సంబంధించింది. ఈ విధానం ప్రజాస్వామ్యాన్ని ప్రమాదం పడేసిందని అన్నారు. ఆయన మాట్లాడిన హిందీ వీడియో కింద ఉంది.
ప్రభుచావ్లా లెవనెత్తిన ప్రశ్న, ప్రజలకంటే, మేధావులకంటే కూడా పార్టీలకు జెండాలు మోస్తున్న వారికి, పోస్టర్లు అతికిస్తున్నవారికి, ఎండనక, వాననకగ నాయకుల ర్యాలీల్లో పడి తిరుగుతున్న వారికి, నాయకుడికోసం కిరొసిన్ పోసుకుని నిప్పటించుకున్నవారికి సంబంధించినది.
భోపాల్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మీద బిజెపి స్వాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను పోటీ బెట్టడాన్ని ప్రభుచావ్లా ప్రశ్నించారు.
అదేవిధంగా ఉత్తర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి యోగి అధిత్యనాధ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ లో బోజ్ పురి సినిమాయాక్టర్ ను బిజెపి నిలబెట్టింది. దీనిని ఆయన ప్రశ్నించారు. ఒంగోల్, ఖమ్మం, కర్నూల్ లను వీటికి కొనసాగింపుగా మనం చూడవచ్చు.
పార్టీకి 11 కోట్ల మంది సభ్యులున్నారని బిజెపి చెప్పుకుంటుంది. బిజెపికి నాయకుడు అసాధారణ నేత నరేంద్ర మోదీ. ఎన్నికల్లో మోదీ బొమ్మతోనే గెలుస్తున్నామని అంతా చెబుతున్నారు.నమ్ముతున్నారు. అలాంటపుడు బాంబుల కేసులో ముద్దాయి అయిన సాధ్విని ఎలా పార్టీ లో చేర్చుకుని ఏమాశించి టికెట్ ఇస్తారు. తీవ్రవాదుల చేతిలో హతమయిన ముంబాయి పోలీసు అధికారి హేమంత్ కర్కరే కి వైపు మహా వీర చక్ర తో గౌరవించారు. అలాంటి వ్యక్తి ‘నా శాపం’ వల్లేచచ్చాడని పబ్లిక్ గా చెప్పిన సాధ్విని ఎలా పోటీ పెడతారు?
మోదీ బొమ్మతోనే ఎన్నికల్లో గెలిచేటప్పుడు, పార్టీకి జెండాలు మోసి, పోస్టర్ లు అతికించి, ర్యాలీలలో సభలలో జిందాబాద్ అని అరిచిన కార్యకర్తకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు?
ఇదే గోరఖ్ పూర్ లో జరిగింది. అక్కడ బిజెపి నిలబెట్టిన అభ్యర్థి భోజ్ పురి సినిమా యాక్టర్ రవి కిషన్. మొన్న మొన్నటి దాకా కాంగ్రెస్ లో ఉన్నాడు.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. అతగాడు బిజెపి లోకి ఫిరాయించగానే లోక్ సభ టికెట్ ఇచ్చారు. ఎక్కడ? గోరఖ్ పూర లో. అది ముఖ్యమంత్రి యోగికి పెట్టని కోట. అయిదుసార్లు ఆయనను గెలిపించిన నియోజకవర్గం. అలాంటి చోట ఒక విధేయుడయిన కార్యకర్తకు టికెట్ ఇచ్చి గెలిపించి పార్టీ విధేయతను ఆకాశానికెత్తి వుండవచ్చగా.
ప్రభు చావ్లా మరొక విషయం ప్రస్తావించారు. యాక్టర్ శత్రుఘ్న సిన్హాను బిజెపి వదులుకోవడం. ఆయన పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకి. విపిసింగ్ తో కలసి రాజీవ్ గాంధీని వోడించేందుకు కృషిచేసిన వాడు. 30 సం.లుగా బిజెపిలో ఉన్నవాడు. ఆయనను వదలుకోవడం. బయటి నుంచి నాయకులను ఇంపోర్టు చేసుకోవడం.
అన్ని పార్టీలో హిమాలయాలంత నాయకులున్నారు. అలాంటపుడ కార్యకర్తలకు టికెట్లిచ్చి గెలిపించుకోవచ్చు. అలాకాకుండా ఫిరాయింపుదార్లకు, నేరస్థులకు, అనుమానాస్పద చరిత్ర ఉన్నవాళ్లకు, నైతిక విలువలు పట్టించుకోని వారికి, డబ్బున్నవాళ్లకు టికెట్లిచ్చి గెలిపించడమేమిటి? ప్రజాస్వామ్యానికి ముప్పు అని ఆయన అన్నారు.
ఇందులో నిజముందనిపిస్తుంది. ఇది అన్ని పార్టీలకు, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. మొత్తం భారత దేశంలో నాయకుడెంత గొప్పవాడయినా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు.
తెలంగాణలో ఖమ్మం టిఆర్ ఎస్ లోక్ సభ టికెట్ ను నామా నాగేశ్వరరావు తన్నుకుపోయారు. ఆయన అంతకు ముందు గంట కిందటి దాకా టిడిపిలో ఉన్నారు. కర్నూలులో కాంగ్రెస్ నాయకుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ లోక్ సభ టికెట్ అది ప్రజాస్వామ్య ఘన విజయం గా చెప్పుకున్నారు. అంతకు ముందు ఒక రోజు కిందటి దాకా ఆయన వేరే పార్టీలో ఉన్నారు. ఇలాగే, అంతకు ముందు రోజు దాకా టిడిపిలో ఉన్న (ఇంకా టిడిపి ఎమ్మెల్సీయే) మాగుంట శ్రీనివాస రెడ్డి కి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు లోక్ సభ సీటు ఇచ్చి గర్వపడింది. ఇక గెలిచాం అన్నట్లు ప్రచారం చేసుకుంది.
నిజానికి ఈ పార్టీలన్నింటికి ఈ నియోజకవర్గాలలో ప్రాణాలిచ్చే కార్యకర్తలు నాయకులు ఉన్నారు. వాళ్లంతా పార్టీ నుంచి ఎమీ ఆశించకుండా సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వాళ్లకేదయిన దక్కిందంటే ఒక్క సభ్యత్వ రసీదుమాత్రమే. టిఆర్ ఎస్ నాయకుడు కెసియార్ గాని, టిడిపి నేత చంద్రబాబు, అలాగే వైసిపి నేత జగన్ గాని కచ్చితంగా నమ్మే మాట ఒకటుంది, ఎవరు గెలిచినా తన బొమ్మతోనే అనేది ఆ మాట. అలాంటపుడు పార్టీకి నిజాయితీగా పని చేస్తున్నఒక కార్యకర్తను ఎంపిక చేసి ఎన్నికల్లో నిలబెట్టి పార్టీ వ్యవస్థను ప్రజాస్వామికం చేయవచ్చగా?
దీనికి బదులు ఒక గంట క్రితం దాక ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి పార్టీలోకి రావడం అనేది గర్వకారణంగా చెప్పుకుంటారు.ఆయన పార్టీలో చేరడాన్ని పండగలా జరుపుకుంటున్నారు.విధేయులయిన కార్యకర్తలను,స్థానిక నాయకులను కాదని గోడదూకొచ్చిన వాడికి టికెట్ ఇవ్వడాన్ని మహాఘన కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటున్నారు. దీనినొక పవిత్ర కార్యంగా జరపుతున్నారు. పార్టీనివీడేందుకు ముహూర్తం, కొత్త పార్టీలో చేరేందుకు ముహూర్తం, ఆపయిన పెద్ద వేదిక, వేదిక మీద ప్రముఖనాయకులు, పార్టీ మహా నేత వచ్చి పార్టీలో చేరుతున్న వారికి పార్టీ రంగు శాలువ అందించి సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించడమే కాదు, పోటీచేసేందుకు టికెట్ ఇవ్వడం. దీనితో పుణ్యకార్యం ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధిమీద, పేదరికం మీద, అవినీతి,ప్రజస్వామ్యం మీద ఉపన్యాసాలు.చప్పట్లు.
ఎంత పెద్ద నాయకుడయినా సరే అనుసరించేవన్నీ సిద్దాంతాలు కాదు అప్రజాస్వామిక విధానాలే నని ప్రభుచావ్లా అంటున్నారు. అందుకే ప్రజాస్వామ్యం ఇండియాలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మీరేమంటారు?