రాఫేల్ యుద్ధ విమానాల ధరల వివరాలు కోరిన సుప్రీం కోర్టు

మెల్లి మెల్లిగా సుప్రీంకోర్టు రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల రహస్యం వైపు జరుగుతున్నట్లనిపిస్తుంది. ఫ్రెంచ్ కంపెనీ దాసోనుంచి ప్రధాని మోదీ ప్రభుత్వం యుద్ద విమానాలను కొనుగోలు చేసేందుకు ఒక ఒప్పందం కుదుర్చకుంది. అయితే, అంతకు ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని పక్కన బెట్టి అనిల్ అంబానీ కంపెనీని రంగంలోకి దించి మోదీ మరొక కొంత ఒప్పందం చేసుకున్నారు. ఇది నియమాలను అతిక్రమించి చేశారని, రెండో ఒప్పందం వల్ల ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు రావలసిన యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్టు అనిల్ అంబానీకి చేజిక్కించుకున్నాడని, ఇందులో మోదీ ప్రమోయం ఉందని ఆరోపణ . అందువల్ల అవినీతి నిరోధక చట్టం  ప్రకారం ప్రధాని మీద దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు సిబిఐకి వినతిపత్రం సమర్పించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పిటిషన్లో కూడా పేర్కొన్నారు.

ఈ మొత్తం డీల్ లో అవినీతి ఉందని, నియమావళి ఉల్లంఘించారని, దీనిమీద విచారణ జరపాలని సుప్రీకోర్టులో చాలా మంది పిటిషన్లు వేశారు. ఇందులో మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ల పటిషన్లు కూడా ఉన్నాయి. ఈ పిటిషన్లను విచారిస్తూ, యుద్ధవిమానాల ధరల మీద, రెండో వప్పందానికి సంబంధించిన విధాన నిర్ణయం మీద వివరాలు అందించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని అదేశించింది.

అయితే, ధరలు క్లాపిఫైడ్ ఇన్ఫర్మేషన్ అని, వెల్లడించడానికి వీల్లేదని కేంద్రం వాదించింది. అయితే, ఈ విషయాలు వెల్లడించేందుకు వీలుకాని రహస్యం అనే విషయాన్ని రాతపూర్వకంగా అఫిడవిట్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీనికి పదిరోజలు గడువు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదిరోజులలోను అఫిడవిట్ ఫైల్ చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచలనిచ్చారు.

దీని మీద వ్యాఖ్యానిస్తూ ఈ రోజు సుప్రీం కోర్టు తీసుకున్న చర్య చాలా దృఢమయినదని పిటిషనర్ అరుణ్ శౌరి వ్యాఖ్యానించారు. ‘యుద్ధ విమానాల ధర రహస్యం కాదు. టెక్నికల్ వ్యవహారాలేమయినా ఉంటే అవి మాత్రమే రహస్యం. రహస్యం అనే పరిధిలోకి ధరలు రావు. ప్రభుత్వం చేసే ఈ వాదనను మేం సవాల్ చేస్తాం,’అరుణ్ శౌరి అన్నారు. దాసో నుంచి 36 యుద్ధ విమానాలను రు. 59000 కోట్లతో కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ, ప్రెంచ్ అధ్యక్షుడు ఫ్రాంస్వు హొలండ్ మధ్య 2016లో జరిగిన ఒక సమావేశంలోనిర్ణయించారు. దీని మీద విచారణకు ఆదేశించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

ఇంతకు ముందు సుప్రీం కోర్టు 2016 ఒప్పందానికి సంబంధించిన విధాన నిర్ణయం ఎలా జరిగిందో కోర్టుకు ఒక సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. అపుడు కోర్టు ధరల జోలికి వెళ్లలేదు. ఇపుడు కోర్టు ధరలను కూడా పరిశీలించాలనుకుంటున్నది.