ఎంజిఆర్ మొదట ఆప్తమిత్రుడే, తర్వాతే రాజకీయ ప్రత్యర్థి

దేశరాజకీయాలలో కరుణానిధి, ఎంజి రామచంద్రన్ ల మధ్య వైరం చాలా  తీవ్రమయింది. వైరానికి వాళ్లిద్దరు ప్రతిరూపాలు. కరుణానిధి డిఎంకె, ఎంజిఆర్ ఎఐడిఎంకె ల మధ్య పచ్చగడ్డి వేయపోయినామ భగ్గున మండే రాజకీయాలు వాళ్లవి.  వాళ్ల మధ్య మాటలు  లేవు, పలకరింపులు లేవు. ఒకే ఐడియాలజీ,  ఒకే సామాజిక లక్ష్యం సామాజిక న్యాయం, ద్రవిడ రాజకీయాలు. ఒకే రాజకీయ నేపథ్యం ఉన్న వారి మధ్య ఇలా ఇంత బద్ధ వైరం రావడం భారత దేశంలో ఎక్కడా జరగలేదు. ఇలాంటి  వైరిపక్షాలు భారతదేశంలో మరెక్కడా లేవు. అయితే, ఇక్కడ ఈ శత్రుత్వానికి ముందు  ప్రగాఢమయిన అనుబంధం కూడా ఉండింది. వారిరువురు ఆగర్భ శత్రవులు కాదు.  జీవితంలో విజయవంతమయ్యేందుకు ఎంతగానో పరస్పరం సహకరించుకున్న చరిత్ర వారిది. ఎంజి రామచంద్రన్ తొలినాళ్ల హిట్ చిత్రాలకు స్క్రిప్టు రాసింది కరుణానిధే.

అలాగే, కరుణానిధి మొదట ముఖ్యమంత్రి అయింది  ఎంజి రామచంద్రన్ సహకారంతోనే. అది ఎలాగంటే…1967లో అణ్ణాదురై క్యాబినెట్ లో కరుణానిధి  పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రి అయ్యారు. 1969లో క్యాన్సర్ వ్యాధితో  అకాల మరణం చెందారు. అపుడు అణ్ణా వారుసుడెవరు అనే ప్రశ్న వచ్చింది. నిజానికి అపుడు క్యాబినెట్ లో సెకండ్ ఇన్ కమ ాండ్  కరుణానిధి కాదు, వి ఆర్  నెడుంజెళియన్, నెడుంజెళియన్ కూడా పెద్ద మేధావియే. 1969న ఫిబ్రవరి మూడో తేదీన  ఆయన్ని తాత్కాలిక  ముఖ్యమంత్రిగా కూడా ఎన్నుకున్నారు.  డిఎంకె పార్టీలో కూడా వర్గాలున్నాయి.  అపుడు నెడుంజెలియన్ ని కాదని కరుణానిధి ముఖ్యమంత్రి కావాలి. అయ్యారు. ఎలా?

నెడుంజెళియన్, కరుణానిధి, ఎంజిఆర్

ఎంజి రామచంద్రన్ చక్రం తిప్పారు. అన్ని గ్రూపులను దారికి తెచ్చి కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యేందుకు బాట వేశారు.  చాలా కాలం కరుణానిధి క్యాబినెట్ లో పనిచేసి , నెడంజెళియన్ సొంతపార్టీ పెట్టుకున్నారు. అది విజయవంతం కాలేదు. తర్వాత ఎఐడిఎంకె లో చేరారు. ఎంజిఆర్, జయలలిత  క్యాబినెట్ లలో కీలక పదవులు నిర్వహించారు. ఇది వేరే కథ.