అమెరికాలో వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అమెరికాలో తాత్కాలికంగా ఆశ్రయం కోసం వచ్చిన సుమారు 6 వేల మంది వలసదారులను అధికారులు ప్రభుత్వ రికార్డుల్లో మృతులుగా నమోదు చేశారు. వీరంతా నిజంగా బతికే ఉన్నా… వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్లు రద్దయిన తర్వాత అధికారికంగా “చనిపోయినవారిగా” పరిగణించబడుతున్నారు.
అమెరికాలో జీవించాలంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ అత్యవసరం. ఈ నెంబర్ లేనివారికి ఉద్యోగం చేయలేరు, ప్రభుత్వ సాయం పొందలేరు, కారు కొనలేరు, అకౌంట్ తెరవలేరు. అంతటితో ఆగకుండా తమ తాత్కాలిక ఆశ్రయం గడువు ముగిసిన తర్వాతనూ వెనక్కి వెళ్లని వలసదారులను ఇలా “పేపర్ డెత్”గా మార్చడమే సరైన పరిష్కారమని ట్రంప్ ప్రభుత్వం భావించింది. అంటే, వారు అక్కడ ఉండలేనంత ఇబ్బంది పెట్టి… స్వయంగా అమెరికా వదిలేయాలనే ముళ్ల మార్గం చూపినట్టైంది.
బైడెన్ పాలనలో ప్రవేశించిన 90 వేల మంది వలసదారుల్లో కొందరి గడువు పూర్తయ్యినా తిరిగి వెళ్లలేదన్నదే అధికార వాదన. వీరిని ట్రాక్ చేసి పంపించడం కష్టం కావడంతో ఈ కొత్త వ్యూహానికి తెరలేపినట్టు సమాచారం. వలసదారులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే వారి వివరాలను “మరణించినవారిగా” మార్చేసారు. దీంతో వేలాది కుటుంబాలు అమెరికాలో ఉండే ఆధారాలను కోల్పోయారు.
ఈ చర్యపై వలస హక్కుల సంస్థలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు, వలసదారుల భవిష్యత్తును గాలికి వదిలే నిర్ణయమని వ్యాఖ్యానిస్తున్నారు. ఎటు చూసినా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మరోసారి వలసదారులపై గల వైరుద్యాన్ని బయటపెట్టింది. అమెరికాలో ఉండే అనేకమంది భారతీయులు కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
