Pastor Praveen Pagadala: హత్య కాదు… ప్రమాదమే! పాస్టర్ ప్రవీణ్ కేసులో ఐజీ క్లారిటీ

ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పై నెలకొన్న అనుమానాలకు అధికారికంగా ముగింపు దొరికింది. శనివారం మీడియా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదమేనని స్పష్టంగా తెలిపారు. హత్య అనేవి కేవలం ఊహాగానాలేనని, దీనికి సంబంధించి సరైన ఆధారాలు లేవని తేల్చేశారు. ప్రవీణ్ మద్యం సేవించి వేగంగా బైక్ నడిపిన కారణంగా వరుసగా మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారని వివరించారు.

హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రయాణించిన సమయంలో ప్రవీణ్ మార్గమధ్యంలో రెండు వైన్ షాపుల్లో ఆగినట్లు డిజిటల్ లావాదేవీల ఆధారంగా గుర్తించామని ఐజీ వెల్లడించారు. ఆ ప్రదేశాల్లో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించామని, అందులో ఆయన మద్యం సేవించిన విషయం స్పష్టంగా ఉన్నదని చెప్పారు. ప్రయాణంలో మొత్తం ఆరుగురు వ్యక్తులతో ఆయన మాట్లాడిన దృశ్యాలు కూడా ఉన్నాయని తెలిపారు.

పోస్ట్ మార్టం నివేదికలో కూడా రోడ్డు ప్రమాదమే మరణానికి కారణమని స్పష్టంగా పేర్కొన్నట్టు ఐజీ అశోక్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 113 మందిని విచారించామని, వారిలో ఎవరూ కూడా హత్య అనుమానాన్ని వ్యక్తం చేయలేదని చెప్పారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులు సైతం హత్య అనేది ఆరోపించలేదని తెలిపారు. కేసును వివాదాస్పదంగా మలచే ప్రయత్నాలు చేస్తున్న వారిపై నోటీసులు జారీ చేసినట్టు ఐజీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా అపప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదమేనని ప్రభుత్వం తేల్చేసింది.