నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ రాజకీయం.!

స్పేస్ లేని చోట.. ఆ స్పేస్ కల్పించుకోవాలి.! అన్‌స్టాపబుల్ టాక్ షో విషయంలో నందమూరి బాలకృష్ణ అలాగే ‘స్పేస్’ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో జరిగిన టాక్ షో సందర్భంగా బాలకృష్ణ ‘అతి’ స్పష్టంగానే బయటపడిపోయింది. అవసరం లేనప్పుడు కూడా, చిరంజీవి ప్రస్తావనను రాజకీయ అంశాల్లో తీసుకురావడంలో బాలయ్య ఉద్దేశ్యమేంటి.?

వీలు చిక్కినప్పుడల్లా ‘స్వర్గీయ ఎన్టీయార్’ని గుర్తు చేస్తూ, ఆయనకు గొప్పలు ఆపాదిస్తూ.. బాలయ్య చేసిన హంగామా, కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌కి చికాకు కలిగించింది. ఆయా సమయాల్లో పవన్ కళ్యాణ్, చాలా చాలా హుందాగా వ్యవహరించారు.

పవన్ కళ్యాణ్ సంకల్పం గొప్పదని చెబుతూ, ‘అన్నయ్య కూడా పార్టీ పెట్టారు కదా.. కానీ, సినిమా గ్లామర్ రాజకీయాల్లో ఎన్టీయార్, ఎంజీఆర్‌లకే చెల్లింది..’ అంటూ బాలయ్య దెప్పి పొడిచారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బందికి గురైన మాట వాస్తవం.

ఎన్టీయార్ రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు కులాల కుంపట్లు ఈ స్థాయిలో లేవు. కానీ, చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. కులాల కుంపట్లను టీడీపీనే రాజేసింది. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా వైసీపీ కంటే ఎక్కువగా కులాల కుంపట్లను రాజేస్తున్నది టీడీపీనే.

2019 ఎన్నికల్లో జనసేన ఓడిపోవడానికి కారణమే టీడీపీ. తప్పులన్నీ టీడీపీ వైపు పెట్టుకుని.. చిరంజీవిని టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ మాట్లాడలేకుండా చేయడం.. అసలు బాలయ్య ఉద్దేశ్యమేంటి.? టాక్ షో అంటే స్క్రిప్టెడ్ వ్యవహారమే అయినా, బాలకృష్ణ స్పేస్ తీసుకున్నారు. తనదైన రాజకీయాన్ని అమలు చేశారు. జనసేనానితో టీడీపీకి అవసరం వుంది. ఆ రాజకీయ అవసరానికి తగ్గట్టుగా బాలయ్య వ్యవహించారన్నమాట.