Aravind Kejriwal: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎం యంత్రాలపై ఇండియా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు మరోసారి విమర్శలు ఎత్తాయి. మహా వికాస్ అఘాడి కూటమికి ఎదురైన అనూహ్య ఓటమి నేపథ్యంలో, ఈవీఎం ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సమీక్ష కోసం ఎన్సీపీ నేత శరద్ పవార్, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల ఫలితాల్లో తమ అనూహ్య పరాభవానికి ఈవీఎం యంత్రాలే కారణమని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హడప్సర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎన్సీపీ నేత ప్రశాంత్ జగ్తాప్ ఈ ఆరోపణలను ఉధృతం చేశారు. భవిష్యత్తు ఎన్నికల్లో ఇలాంటి అనుమానాలకు తావు లేకుండా ముందస్తు ప్రణాళికలు అవసరమని కూటమి వర్గాలు చెబుతున్నాయి.
ఈవీఎం యంత్రాలపై పిటిషన్లు దాఖలు చేస్తామని ప్రకటించినా, సుప్రీంకోర్టు గతంలో వీటి విశ్వసనీయతను గట్టిగా సమర్థించింది. ఓడిపోయినప్పుడు సందేహాలు, గెలిచినప్పుడు ప్రశాంతత అనేది తగదని విపక్షాలకు న్యాయమూర్తులు ఘాటుగా సూచించారు. మరి ఈసారి పిటిషన్లపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో ఈ వివాదం కూటమి భాగస్వామ్యాల మధ్య విభిన్న అభిప్రాయాలకు దారితీస్తున్నప్పటికీ, దీని ప్రభావం వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.