రణ భంగమైన రచన – ‘రణరంగం’ స్క్రీన్ ప్లే విశ్లేషణ

రణభంగమైన రచన – ‘రణరంగం’ స్క్రీన్ ప్లే విశ్లేషణ 

‘రణరంగం’ కథ పలచగా వున్నట్టు తెలుసనీ, స్క్రీన్ ప్లే ఆకర్షించడం వల్ల నటించాననీ డిఫరెంట్ స్టార్ శర్వానంద్ ఉద్ఘాటన. కథే లేనప్పుడు పలుచగా వుండేదేమిటి? ‘బ్రోచేవారెవరురా’ లో కథ వుండీ పలుచగా కథనం చేసినందువల్ల ప్రేక్షకులకి నచ్చిందేమో. కాస్సేపు గతం, కాసేపు వర్తమానం వాయిదాలుగా చూపించుకుంటూ పోయినంత మాత్రాన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే అవుతుందా? ‘కంచె’ లో కాసేపు గతం, కాసేపు వర్తమానం రిపీటవుతూ పోయినా, వాటిలో కథంటూ వుంది కాబట్టి ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే అయివుండొచ్చు. ప్రయోగాలు చేసేప్పుడు సొంత నాలెడ్జికి ఫలించిన ప్రయోగాల అవగాహన జతపడక పోతే బాక్సాఫీసు దగ్గర ఏమంత బావుండదేమో.

సిడ్ ఫీల్డ్ అంటాడు – చెప్పడానికి విషయం లేనప్పుడు ఫ్లాష్ బ్యాకులు వేస్తారని. ‘రణరంగం’ దర్శకుడు సుధీర్ వర్మ ప్రామిజింగ్ క్రియేటివ్ పరికల్పన తొలి ప్రయత్నం ‘స్వామిరారా’ హిట్ తోనే ఆగిపోయింది. ‘స్వామిరారా’ లో క్వెంటిన్ టరాంటినో శైలిని తెలుగూకరించి విజయం సాధించాడు. ఈ పట్టుబడ్డ టరాంటినో శైలిని తర్వాత ‘దోచేయ్’, ‘కేశవ’ లతో విడనాడి చుక్కానిలేని నావ అయ్యాడు. శైలిని ఏర్పర్చుకోకపోతే చెప్పే విషయం అదుపులో వుండదు. ‘దోచేయ్’ ఏదో మూస మేకింగ్, ‘కేశవ’ ఇంకేదో లూజ్ మేకింగ్. రెండూ ఉల్టాపల్టా. ఇప్పుడు ‘రణరంగం’ స్టయిలిష్ మేకింగ్ తో పల్టీ. రేపు ఇంకేదో కల్తీ. టరాంటినో మేకింగ్ ఇక చేతికందేలా లేదు. దర్శకుడికి తనదంటూ శైలి లేకపోతే విశ్వసనీయత కష్టం. తెగిన గాలి పటానికి కంటెంట్ కష్టమే.

కంటెంట్ లేనప్పుడే అటు మార్చి ఇటు మార్చి ఫ్లాష్ బ్యాకులతో కవర్ చేద్దామనుకుంటారని లెక్కలేనన్ని స్క్రిప్టులు చదివిన సిడ్ ఫీల్డ్ ఉద్ఘోష. ‘రణరంగం’లో పది నిమిషాలు వర్తమానం, పది నిమిషాలు గతం… మళ్ళీ పది నిముషాలు వర్తమానం, పది నిమిషాలు గతం… ఇలా పునరావృతమయ్యే సమాంతర వృత్తాంతం (పారలల్ నేరేషన్) తో కథేదో చెప్పాలనుకున్నారు. అదేం కథో తెలీదు. కానీ ఈ అన్ని పదినిమిషాల గతాల్నీ ఒకచోట చేర్చి, ఫ్యాక్షన్ సినిమాల్లో చూపించే విధంగా ఒకే ఫ్లాష్ బ్యాకుగా చూస్తే, ఇందులో విషయమేమీ లేదనీ, దీనికీ వర్తమాన ‘కథ’ కీ సంబంధమే లేదనీ తేలిపోతుంది. ఫ్యాక్షన్ సినిమాల్లోనే కాదు, ఫ్లాష్ బ్యాక్ వున్న ఏ సినిమాలోనైనా అది వర్తమానంతో, అంటే ప్రధాన కథతో కనెక్ట్ అయి వుంటుంది.

నిజానికి ఫ్లాష్ బ్యాకు కథ అన్పించుకోదు. ప్రధాన కథే కథ. ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రధాన కథకి సంబంధించిన పూర్వకథ. ఈ పూర్వకథ లేదా ఫ్లాష్ బ్యాక్, ప్రధాన కథకి అవసరమైన సమాచారాన్నందించే వనరు – సోర్స్ – మాత్రమేనని ఫ్లాష్ బ్యాకు నిర్వచనం. ఇంతకిమించి దానికే ప్రాధాన్యం లేదు. ప్రధాన కథ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ లేదు. ప్రధాన కథ ట్రిగ్గర్ చేస్తేనే ఫ్లాష్ బ్యాక్ పుడుతుంది. ఉదాహరణకి వారణాసిలో టాక్సీ నడుపుకుంటూ జీవనం గడుపుకుంటున్న హీరోతో కొంత కథ నడిచాక, ఓ కొత్తవ్యక్తి అతణ్ణి గుర్తుపట్టి, ఆశ్చర్యంతో, ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అన్నాడునుకుందాం. అప్పుడా బాబు ఇక్కడెందుకున్నాడో తగు సమాచారం మనకందించేందుకు ఎక్కడో వూళ్ళో హీరోని ఇంకోలా చూపిస్తూ ఫ్లాష్ బ్యాక్, అంటే పూర్వ కథ దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో మొదలవుతుంది. ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అన్న ట్రిగ్గర్ (ప్రేరక) డైలాగు లేకపోతే ఈ ఫ్లాష్ బ్యాక్ పుట్టదు.

‘రణరంగం’ లో ఈ ట్రిగ్గర్ డైలాగు ఎలావుందంటే, హీరోని హీనంగా తయారుచేసేలా వుంది. ఈ ట్రిగ్గర్ డైలాగు ప్రత్యర్ధి ఉపయోగిస్తాడు. హీరో తన ప్రతిపాదన ఒప్పుకోకపోతే, పాత జీవితంలో ఎక్కడున్నాడో అక్కడుంటాడని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ప్రత్యర్ధి. దీంతో ఇప్పుడు అత్యంత రిచ్ డాన్ గా స్పెయిన్ లో వుంటున్న హీరో, వెంటనే తన పాయింటాఫ్ వ్యూలో వూళ్ళో తన పాత రౌడీ జీవితాన్ని ఫ్లాష్ బ్యాక్ రూపంలో తల్చుకోవడం మొదలెడతాడు. ఇదెలా వుందంటే, ప్రత్యర్థి ఇచ్చిన వార్నింగ్ దెబ్బకి, నిజంగానే తాను అలా అయిపోతాడా అని పాత జీవితాన్ని తల్చుకున్నట్టు వుంది. అంటే ప్రత్యర్ధి డైలాగు కాక, ఆ డైలాగువల్ల పుట్టిన భయం, ఆందోళనేదో ఫ్లాష్ బ్యాక్ ని ట్రిగ్గర్ చేసినట్టు వుంది – అతడి దైన్యాన్నివెల్లడిస్తూ. హీరో పాయింటాఫ్ వ్యూ కాక, దర్శకుడి పాయింటాఫ్ వ్యూలో చూపిస్తే అసందర్భం అవుతుంది. ఎందుకంటే, అప్పుడు చూపించాల్సింది ఆ ప్రత్యర్థి డైలాగుకి హీరో రియాక్షనే తప్ప, హీరో ఫ్లాష్ బ్యాక్ కాదు.

హీరో పాత్రని డ్యామేజీ చేసే, విక్టిమ్ గా మార్చేసే ట్రిగ్గర్ డైలాగు ఇది. హీరోని అంత పవర్ఫుల్ డాన్ గా చూపిస్తున్నప్పుడు, ఎవడో వచ్చి ప్రతిపాదన ఒప్పుకోక పోతే ప్రత్యర్థిలా మారిపోతూ, బెదిరించే ధైర్యం చేశాడంటే, వాడి దృష్టిలో హీరో ఏమీ కానట్టే. కథకుడు తను సృష్టించిన హీరో పాత్రని తనే పలచన చేసుకుంటే ప్రేక్షకులెలా గౌరవిస్తారు.

అలా అంత పెద్ద డాన్ ని ఎవరూ బెదిరించరు. వినకపోతే కూల్ గా వెళ్ళిపోయి చేసేది చేస్తారు. ఒకవేళ అలా బెదిరిస్తే, హీరో పాత్రచిత్రణ కాపాడాలంటే, ‘ఏంట్రా నువ్వు నా పాత జీవితంలోకి నన్ను నెట్టేసేది?’ అని లేచి రెండు వాయిస్తాడు. అంతేగానీ విక్టిమ్ లా మారిపోయి, నిజంగా అలా అయిపోతానేమో నన్నట్టు, పాత రౌడీ జీవితాన్ని పదేపదే (సినిమా చివరి వరకూ) తల్చుకుంటూ కూర్చోడు.

కాబట్టి ఈ సీను మొత్తమే తప్పు. దీంతో హీరో తల్చుకుని తల్చుకుని తల్చుకునేలా పాత జీవితపు మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు సినిమా చివరంటా వేయడం ఘోరమైన స్క్రీన్ ప్లే. తన పాత్రని ఇంత దిగజారుస్తున్నా కూడా ఈ తప్పుడు ఫ్లాష్ బ్యాకుల స్క్రీన్ ప్లే శర్వానంద్ ని బాగా ఆకర్షించింది.

క్లుప్తంగా ఫ్లాష్ బ్యాక్ :
1990 లలో వైజాగ్ లో దేవా (శర్వానంద్) నేస్తాలతో కలిసి సినిమా టికెట్ల బ్లాక్ దందా చేస్తూంటాడు. ఒక కాలేజీ కెళ్ళే మధ్యతరగతి అమ్మాయి (కళ్యాణీ ప్రియదర్శన్) ని ప్రేమిస్తాడు. కొంతకాలం గడిచాక అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం మద్య నిషేధం విధించడంతో ఒరిస్సానుంచి మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముతూంటాడు. ఇదే దందాలో వున్న ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ) తో గొడవలొస్తాయి. పరస్పరం దాడులు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి మధ్య నిషేధం ఎత్తేసి వేలం పాటలు పెట్టడంతో దేవాయే పైచేయి సాధిస్తాడు. కళ్యాణిని పెళ్లి చేసుకుని బిడ్డని కంటాడు. పగబట్టిన సింహాచలం కళ్యాణిని చంపించేస్తాడు. దేవా సింహాచలాన్నీ అతడి వర్గాన్ని చంపేస్తాడు.ఈ ఫ్లాష్ బ్యాక్ లో హీరో కార్యకలాపాలు ప్రేక్షకులకెలా అన్పించాయో గానీ, ఈ వ్యాసకర్తకి అఫెన్సివ్ గా వున్నాయి సెన్సిటివ్ విషయాన్ని సెన్సిటివ్ గా చూడ్డం వల్ల. ఔను, మద్యనిషేధం సెన్సిటివ్ విషయం. ఇక్కడ మద్య నిషేధంతో కథకి మోరల్ ప్రెమీజ్ (నైతిక ఆవరణ) అంటూ ఒకటి ఏర్పడింది. దీంతో హీరోకి సర్కిల్ ఆఫ్ బీయింగ్ (అస్తిత్వ వలయం) ఏర్పడాలి. మొదటిది పట్టించుకోకపోవడం వల్ల రెండోది లేదు. ఫలితంగా నైతిక విలువలు, బాధ్యత, నిబద్ధత, ఒక అర్ధవంతమైన నేపథ్యమూ లేని హీరోగా ఫ్లాష్ బ్యాక్ ఏర్పడింది.

ఇందులో చూపించిన మద్యనిషేధపు నేపథ్యం కల్పన కాదు. కల్పన అయివుంటే దాంతో హీరో ఏమైనా చేసుకోవచ్చు. ఇలాగే మద్యం స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదించుకోవచ్చు. అయినా హీరో కాబట్టి మోరల్ ప్రెమీజ్ ని తప్పించుకోలేడు. చివరికి ఆ అవినీతికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ డాక్ యార్డ్ లో కూలీగా మొదలై అతి పెద్ద స్మగ్లర్ గా ఎదుగుతాడు. అతణ్ణి శిక్షించే శక్తిగా తమ్ముడి పాత్రలో శశికపూర్ పోలీసు అధికారిగా వెంటాడతాడు. ఈ కథ కల్పనే అయినా మోరల్ ప్రెమీజ్ కి న్యాయం జరిగింది.

కానీ శర్వా పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మద్యనిషేధం అంశం కల్పితం కాదు, మనందరికీ తెలిసిన చారిత్రక ఘట్టం. ఎన్టీఆర్ సౌజన్యం. అప్పట్లో సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం1992 లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యనిషేధం విధించడానికి దారితీసింది. అంటే మోరల్ ప్రెమీజ్ మరింత బలంగా వుంది. దీన్ని పట్టించుకోకుండా, సమాజ శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హేళన చేస్తున్నట్టు శర్వా పాత్ర చిత్రణ వుంటే ఎట్లా? అంతవరకూ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే వృత్తిలో వున్న వాడు, మద్యనిషేధం విధించగానే ఒరిస్సానుంచి మద్యం స్మగ్లింగ్ చేసి అమ్ముకోవడం మొదలెడతాడు. అంటే మగాళ్ళతో తాగించి ఆడవాళ్ళ బతుకులతో చెలగాట మాడినట్టు అర్ధం. మద్యనిషేధాన్ని తూట్లు పొడిచాడని అర్ధం. ఇప్పుడెలా వుంది పాత్ర? హీరో పాత్రేనా? పోనీ ఈ మోరల్ ప్రెమీజ్ నైనా పట్టించుకున్నారా, ఇందుకు మూల్యం చెల్లించుకున్నాడా అంటే, అదీ లేదు.

అతను స్పెయిన్ లో రిచ్ డాన్ గా తిష్ట వేయడానికి ఈ మూలలున్నాయి. దీని మోరల్ ప్రెమీజ్ ని పట్టించుకో లేదు సరే, సర్కిల్ ఆఫ్ బీయింగ్ కూడా ఆలోచించలేదు. సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఎందుకు? పైగా సినిమా సాంతం మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులెందుకు? అసలుండాల్సిన మోరల్ ప్రెమీజ్, సర్కిల్ ఆఫ్ బీయింగ్ లేకపోయాక ఈ పది నిమిషాలకో ఫ్లాష్ బ్యాకుల మోత ఎందుకు?

ఫ్లాష్ బ్యాక్ లో విలన్ చివరికి హీరో భార్యని చంపాడు కదా, ఈ విషాద నేపథ్యమే సర్కిల్ ఆఫ్ బీయింగ్ అనుకోవాలనా? విలన్ హీరో భార్య (హీరోయిన్ని) ని చంపడం హీరో తప్పే అన్పించేలా చిత్రణ వుంది. ఈ లవ్ ట్రాక్ ఆషామాషీగా వుంది. ఒక పరువుగల మధ్యతరగతి కుటుంబానికి చెందిన టీనేజీలో వున్న కాలేజీ అమ్మాయి, చదువులేని బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకునే హీరోతో ప్రేమలో పడుతుంది. మద్యనిషేధంతో అతను మద్యం స్మగ్లింగ్ చేస్తూ లాకప్ లో పడ్డా కూడా కామెడీగా తీసుకుంటుంది. ఇతన్ని పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధపడితే, తండ్రి మందలించినట్టు మందలించి నీ నిర్ణయం నువ్వు తీసుకోమంటాడు. ఒక క్రిమినల్ అల్లుడు కావడాన్ని తేలిగ్గా తీసుకుంటాడు. ఇంతవరకు హీరోయిన్ నిర్వాకం.

ఇక హీరో నిర్వాకం చూస్తే, ఒక వైపు సింహాచలం అనే పోటీ మద్యం స్మగ్లర్ తో వైరముంటే, శత్రువులుగా పరస్పరం దాడులు చేసుకుంటూ వుంటే, ఈ వాతావరణంలోకి -ప్రమాదంలోకి హీరోయిన్ ని లాగి పెళ్లి చేసుకుంటాడు. ఆమెకి భద్రత కూడా కల్పించకుండా విలన్ చంపడానికా అన్నట్టు వీలుగా ఒంటరిగా ఆమెని కారులో పంపుతాడు. ఆ విలన్ కారుని పేల్చేసి కూర్చుంటాడు. ఇందులో విలన్ తప్పేముంది, హీరో మీద సానుభూతి కలగడానికి? ఈ హీరో స్వయంకృతాపరాధ విషాద గీతికతో సర్కిల్ ఆఫ్ బీయింగ్ ఎలా ఏర్పడుతుంది? మద్యనిషేధానికి వ్యతిరేకంగా పనిచేసిన తప్పిదముండగా, దాని ఫలితంగా భార్య చనిపోవడమెలా సానుభూతి కారకమవుతుంది? చేసుకున్నవారికి చేసుకున్నంత.

సర్కిల్ ఆఫ్ బీయింగ్, మోరల్ ప్రెమీజ్ వగైరా హీరో బాధ్యత ఫీలయితే ఏర్పడతాయి. తను మద్యం స్మగ్లింగ్ చేయకుండా, ప్రజానీకం వైపు, మద్యనిషేధం వైపు వుండి సింహాచలం స్మగ్లింగ్ ని అడ్డుకుంటూ వుంటే, ఆ పోరాటంలో భార్యని కోల్పోతే, అవి బలమైన సర్కిల్ ఆఫ్ బీయింగ్, మోరల్ ప్రెమీజ్ అవుతాయి. మద్యనిషేధం కోసం త్యాగాలు చేసిన నేపథ్యంతో, ఎమోషన్స్ తో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తే, అప్పుడు ప్రధాన కథ కొచ్చేసరికి అతణ్ణి సానుభూతితోనే కాదు, ఎన్నదగిన పాత్రగా కూడా చూస్తాం. మద్యనిషేధపు కథ మద్యం తాగి రాసినట్టు రాస్తారా?

―సికిందర్
(ప్రధాన కథ రేపు)