మిడిల్ – 1 కథనం :
రాహుల్, రాకీ, రాంబోలు మిత్రని కిడ్నాప్ చేసి ఆమె తండ్రి ఆర్కేని బెదిరిస్తారు. ఎనిమిది లక్షలు డిమాండ్ చేస్తారు. పోలీసులకి చెప్తే మిత్రని చంపేస్తామంటారు. ఆర్కే ఎనిమిది లక్షలు అందించి మిత్రని విడిపించుకుంటాడు. మిత్రుడైన పోలీసు అధికారి (సత్యకృష్ణ) కి చెప్తాడు. పోలీసు అధికారి కామెడీగా ఎంక్వైరీ చేస్తాడు.
ఇప్పుడు డబ్బుతో హైదరాబాద్ వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంది మిత్ర. ఆమెని బస్సెక్కించేస్తాడు రాహుల్. వాళ్ళ వాటా మూడు లక్షలు తీసుకొమ్మంటే హైదరాబాద్ వచ్చి తీసుకుంటామంటాడు. అనుమానం రాకుండా ఒకరోజు ఆగి వస్తామంటాడు. ఆర్కే ఇంటికి వెళ్లి చూస్తే మిత్ర వుండదు. మళ్ళీ పోలీసు అధికారికి కంప్లెయింట్ చేస్తాడు. మిత్ర ట్యూషన్ మాస్టార్ని ముగ్గురు కొడుతూండగా చూశానని ఒకడు అంటాడు. ఆ ముగ్గురి గురించి కామెడీగా ప్రశ్నించి కొట్టి పారేస్తాడు పోలీసు అధికారి.
మిత్ర హైదరాబాద్ చేరుకుంటుంది. రాహుల్ కూడా రాకీ, రాంబోలతో చేరుకుంటాడు. మిత్రకి కాల్ చేస్తాడు. కలుద్దామనుకుంటారు. ఇంతలో మిత్ర కిడ్నాప్ అవుతుంది. ఎనిమిది లక్షలున్న బ్యాగుతో సహా బందీ అవుతుంది. ప్రొఫెషనల్ కిడ్నాపర్ ఆమె ఇచ్చిన నంబర్ తీసుకుని రాత్రికల్లా పది లక్షలు ఇవ్వాలని రాహుల్ ని బెదిరిస్తాడు. ఇవ్వకపోతే మిత్రని అమ్మేస్తానంటాడు. రాహుల్ షాక్ తింటాడు…
ఇంతవరకు కథ చెప్పి, సెల్ రింగ్ అవుతూంటే ఆగుతాడు విశాల్. కాల్ కట్ చేసి హీరోయిన్ షాలినికి సారీ చెప్తాడు. మళ్ళీ సెల్ రింగవుతుంది. మళ్ళీ సారీ చెప్తాడు. ఫర్వాలేదు రిసీవ్ చేసుకోమంటుంది. ఆ కాల్ అతడి తల్లి చేస్తుంది. ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందని, ఆపరేషన్ కి ఎనిమిది లక్షలు కావాలనీ. ఇది తెలుసుకుని షాలిని డబ్బు ఏర్పాటు చేస్తానంటుంది. ఇద్దరూ బయల్దేరతారు.
ఇంకోవైపు కిడ్నాపర్ డిమాండ్ చేసిన పది లక్షలు సంపాదించడం కోసం తిరుగుతూంటారు రాహుల్, అతడి ఫ్రెండ్స్. ఏటీఎం మీద కూడా కన్నేస్తారు. డబ్బు కోసం బయల్దేరిన మేనేజర్ కి కాల్ చేసి డబ్బు ఏర్పాటు చేయమంటుంది. హాస్పిటల్ కి దారిలో మేనేజర్ వచ్చి డబ్బు అందిస్తాడు. ఆ డబ్బుతో వెళ్తూండగా కారు ఒక్కసారి యాక్సిడెంట్ కి గురవుతుంది. కారుమీద పడి ఆ డబ్బు దోచుకుని పారిపోతారు రాహుల్ అండ్ ఫ్రెండ్స్ (ఇంటర్వెల్)
విశ్లేషణ :
మిడిల్ అంటే హీరో సంకల్పించుకున్న గోల్ కోసం సంఘర్షణ. గోల్ సాధనలో ఈ సంఘర్షణతో హీరో పాత్ర ఉక్కిరిబిక్కిరవుతుంది. తను ఒక యాక్షన్ తీసుకుంటే, దానికి రియాక్షన్ గా ఇంకోటి జరుగుతుంది. ఆ రియాక్షన్ కి ఇంకో యాక్షన్ తీసుకుంటే, దానికి మళ్ళీ రియాక్షన్ గా ఇంకోటి జరుగుతుంది. ఈ వలయం అంతకంతకూ తీవ్ర స్థాయికి చేరుకుంటూ, ఇందులోంచి బయటపడే మార్గం ఒక చోట కన్పిస్తుంది : అదే ప్లాట్ పాయింట్ టూ అనే కీలక ఘట్టం. ఇది సెకండాఫ్ క్లయిమాక్స్ దగ్గర వస్తుంది. అక్కడ్నించీ ముగింపుకి దౌడు తీస్తుంది కథనం.
ఈ మిడిల్, ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ కీ, ఇంటర్వెల్ కీ మధ్య మిడిల్ వన్ గానూ, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్ టూ వరకూ మిడిల్ టూ గానూ రెండు భాగాలుగా వుంటుంది. ఈ రెండు భాగాల మిడిల్ విభాగంలో వుండేదే కథ. మిడిల్ కి ప్లాట్ పాయింట్ వన్ కవతల, బిగినింగ్ లో వుండేది కథ కాదు. కేవలం మిడిల్లో వుండే కథకి అది ఉపోద్ఘాతం. అలాగే మిడిల్ కి ఇవతల, ప్లాట్ పాయింట్ టూ తర్వాత మొదలయ్యే ఎండ్ విభాగంలో వుండేది కూడా కథ కాదు. కేవలం మిడిల్ విభాగంలో వున్న కథకి ముగింపు. ఈ మొత్తం మిడిల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర హీరో కేర్పడిన గోల్ ఎలిమెంట్స్ నాల్గూ అమలవుతాయి. పై మిడిల్ వన్ కథనం చూద్దాం.
గత వ్యాసం ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మిత్రని కిడ్నాప్ చేశాక, ఇప్పుడు మిడిల్ వన్ లో పడింది కథనం. అంటే కథ ప్రారంభమయ్యింది. ఇక్కడ మిత్రని హైదరాబాద్ కి చేరవేసే గోల్ కోసం రాహుల్ ఆమె తండ్రిని బెదిరించి ఎనిమిది లక్షలు లాగి మిత్ర కిచ్చేశాడు. ఇది గోల్ కోసం హీరో తీసుకున్న యాక్షన్. వెంటనే దీనికి రియాక్షన్ మొదలై పోయింది –మిత్ర ఫాదర్ ఆర్కే పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో. రాహుల్ ని అనుమానించేందుకు ఒక సాక్షి దొరకడంతో. ఆర్కే ఈ కిడ్నాప్ కేసులో దోషుల్ని పట్టుకోవడానికి పట్టుదల తోనే వున్నాడు. కానీ పోలీసు అధికారియే వెర్రి థియరీలు చెప్తూ కేసుని నీరు గారుస్తున్నాడు.
ఇలా రిలీఫ్ దొరికిన రాహుల్ ఇంకో యాక్షన్ తీసుకుని, మిత్రని హైదరాబాద్ పంపేశాడు డబ్బుతో. ఇప్పుడే తాము కూడా వస్తే అనుమానిస్తారని, తర్వాత వస్తామని ఆమెని పంపేశాడు. కిడ్నాపైన రెండో రోజే కూతురు మాయమైందంటే, కిడ్నాప్ వ్యవహారం ఆమే నడిపించి వుంటుందని అనుమానం రావాలి ఆమె తండ్రి ఆర్కే కి. ఈ యాంగిల్లో రాహుల్ ఆలోచించలేదు. ఆలోచన తక్కువ యూత్ ఎలాటి పనులు చేస్తూంటారనేదే ఈ కథ. చేస్తున్నవి పెద్ద నేరాలని కూడా తెలుసుకోవడం లేదు. అయితే దీనికి మూల్యం చెల్లించుకునే నైతిక ఆవరణ కూడా ఈ కథకి లేదు. ఇది పాత్ర చిత్రణల పరంగా కొట్టొచ్చినట్టుండే లోపం. హాలీవుడ్ ‘బేబీ డ్రైవర్’ లో టీనేజీ హీరో, ఆ వయసులో తెలియక నేరాలు చేసినా, తర్వాత అతడి అడుగులు శిక్ష అనుభవించే సంఘటనల దిశగానే తెలియకుండానే పడతాయి. దీంతో ఆ కథ నైతికావరణ (మోరల్ ప్రెమీజ్) పరిపూర్ణంగా కన్పిస్తుంది. ఇది ఆస్కార్ అవార్డు పొందిన మూవీ అనేది వేరే సంగతి, ఇందులో నేరాలకి తగిన చట్టం అమలవడమనే జస్టిఫికేషన్ వుంటుంది. ‘బ్రోచేవారెవరురా’ లో ఈ జస్టిఫికేషన్ లేకుండానే హీరోయిన్ సహా హీరోనీ, అతడి ఫ్రెండ్స్ నీ తగిన గుణపాఠం లేకుండానే హేపీ ఎండింగ్ ఇచ్చారు. దీంతో ఇలాటి యూత్ కి రాంగ్ మెసేజి వెళ్లేట్టు చేశారు.
ఇందులో చట్ట పాలన చూపించకుండా కర్మ సిద్ధాంతాన్ని అమలు చేశారు. అయితే చివరికి కర్మ సిద్ధాంతం ప్రకారమయినా వాళ్ళకి గుణపాఠం లేదు. టౌన్లో ఆడిన ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామాకి రియాక్షన్ గా, హైదరాబాద్ లో రియల్ కిడ్నాప్ జరగడం కర్మ ఫలమే అనుకుంటే, ఇంకా రాంగ్ నిర్ణయం తీసుకుని రాహుల్, విశాల్- షాలినిలకి ప్రమాదం జరిపించి వాళ్ళ దగ్గర డబ్బు కొట్టేశాడు. ఆమె ప్రాణాపాయ స్థితిలో కెళ్ళిపోయింది. ఇది హత్యాయత్నం అంతటి తీవ్ర నేరమే.
ఐతే స్టోరీ డైనమిక్స్ కోసం హీరో ఇలాటి చర్యలకి పాల్పడం పాత్ర చిత్రణకి మంచిదే. పోనూ పోనూ అధఃపాతాళంలోకి జారుకోవడం… అయితే ఈ చర్యలకి చివర్లో అనుభవించాలి, ఇదే జరగలేదు. లైటర్ వీన్ క్రైం కామెడీ కైనా ఇది సూటవదు.
కథనంలో ఇంకా చాలా వాటిని దాటవేశారు. మిత్రకి ఎనిమిది లక్షలున్న బ్యాగు నిచ్చి హైదరాబాద్ పంపడం కన్విన్సింగ్ గా వుండదు. అందులో మూడు లక్షలు తమ వాటా కూడా రాహుల్ తీసేసుకుండా, హైదరాబాద్ వచ్చి తీసుకుంటాననడం పాత్ర చిత్రణని బలిపెడుతూ కథా సౌలభ్యం చూసుకోవడమే. ఇక అంత డబ్బుతో ఆమె హైదరాబాద్ వెళ్లి రియల్ కిడ్నాపై నప్పుడు ఆ డబ్బు ఇచ్చేసి బయట పడొచ్చు. ఆమె బ్యాగుని చెక్ చేసిన కిడ్నాపర్ అనుచరుడు అందులో ఏమీ లేదంటాడు. కానీ అడుగునే డబ్బులున్నాయి. కథా సౌలభ్యం కోసం ఇవన్నీ దాటవేయడం క్రైం కథకి తగదు. క్రైం కథ లాజికల్ గా వుండాలి.
కథా సౌలభ్యం చూసుకునే పనిలో లాజిక్ ని దాటవేయడం దర్శకుడు విశాల్ – హీరోయిన్ షాలినల మధ్య బిగినింగ్ విభాగంలో చూశాం. సగం కథతో అతను కథ విన్పించడానికి వెళ్లడమేమిటి? ఇలాగే వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మిడిల్ వన్ లో కూడా కథా సౌలభ్యం కోసం సభా మర్యాదని బలిపెట్టారు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. కథా సౌలభ్యం చూసుకుంటూ కథనంలో మంచి డైనమిక్స్ ని మిస్ చేసుకున్న ఈ ఘట్టం గురించి చెప్పుకుందాం : ఎనిమిది లక్షలున్న బ్యాగుతో మిత్ర హైదరాబాద్ వెళ్లి కిడ్నాప్ అయినప్పుడు, ఆ డబ్బు విషయం దాటవేసి కథ నడిపినప్పుడు, చివరికి ఆ డబ్బేమైందో కూడా తేల్చలేనప్పుడు, ఒక్కటే చేసి వుండాల్సింది – ఆ డబ్బున్న బ్యాగు ఆమె పోగొట్టుకోవాలి, పోగొట్టుకున్నాక రియల్ కిడ్నాప్ అవ్వాలి. ఇది పదహారణాల కర్మ ఫలం.
ఇక దర్శకుడు విశాల్ షాలినికి రియల్ కిడ్నాప్ వరకూ కథ చెప్తున్నప్పుడు, అతడి సెల్ మోగుతుంది. కట్ చేస్తాడు మళ్ళీ మోగుతుంది. మళ్ళీ కట్ చేస్తాడు. కథ చెప్పడానికి వెళ్ళిన కొత్త దర్శకుడు సెల్ స్విచాఫ్ చేయకుండా, లేదా సైలెంట్ లో పెట్టకుండా టేబుల్ మీద పడేసి ఇంత కేర్లెస్ గా వుంటాడా? అది మర్యాదేనా? అతను దర్శకుడేమో గానీ ముందు కల్చర్ నేర్చుకోవాలి. సినిమా కల్చర్ ఇలా వుండదు. ఆ హీరోయిన్ కూడా ఇరిటేట్ అవకుండా ప్రోత్సహిస్తుంది. పైగా ఆ సమయంలో అతడికి తండ్రికి యాక్సిడెంట్ అయితే వెంటనే ఎనిమిది లక్షలు ఇచ్చేయడానికి బయల్దేరుతుంది… ఈ రెండు పాత్రలూ ఏమిటోగా వున్నాయి.
<
p style=”text-align: justify”>
ఇప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్ జరిపించి రాహుల్ డబ్బు కొట్టేయడం ఇంటర్వెల్ కి ట్విస్టు విప్పడం. అదేమిటంటే, ఇంతవరకూ ఫస్టాఫ్ లో విశాల్ చెప్తున్న కథ రాహుల్ – మిత్ర – అండ్ ఫ్రెండ్స్ రూపంలో కల్పిత కథగా వస్తోందన్న అభిప్రాయం ఇక్కడ తప్పవడం. అతను చెప్తూన కథే బయట కాకతాళీయంగా రాహుల్ – మిత్ర – అండ్ ఫ్రెండ్స్ తో నిజంగా జరుగుతున్నదని రివీలవడం. ఇందువల్లే ఇది విశాల్ కి తెలియకుండా అతడి ప్రోఫెటిక్ (భవిష్యవాణి) నేరేషన్ అయింది. చివరికి తనూహిస్తున్న పాత్రలే నిజంగా వుండి, అతడిమీద ఎటాక్ చేసి డబ్బెత్తు కెళ్ళి పోయాయి. గమ్మతయిన కథ ఇది.
(మిడిల్ టూ రేపు)
―సికిందర్