సమంత తినేసింది – ‘ఓహ్ బేబీ’ ట్రైలర్ టాక్!

టాలీవుడ్ గ్లామర్ గర్ల్ సమంత కామెడీ డ్రామా, ‘ఓహ్ బేబీ’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 2014 లో విడుదలైన కొరియన్ హిట్ మూవీ ‘మిస్ గ్రానీ’ కి రీమేకుగా చెబుతున్న దీని ట్రైలర్ విడుదలైంది. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకి ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడీ ట్రైలర్ నెట్ లో వైరల్ అవుతోంది. సోలో హీరోయిన్ గా సమంత కన్పిస్తున్న ఈ ట్రైలర్ లో, ఆమె క్యారెక్టర్ కొత్తగా కన్పిస్తోంది. 24 ఏళ్ల సమంత 70 ఏళ్ల బామ్మలాగా ప్రవర్తించడం. ఆమె కెదురైన వాళ్ళు ఆశ్చర్యపోవడం, కొందరు ఆమె చేతిలో దెబ్బలు తినడం.

కమెడియన్ ధన్ రాజ్ ఆమెని టీజ్ చేస్తే, ‘నేనేంటి, నా వయస్సేంట్రా?’ అని 70 ఏళ్ల బామ్మలా ఫీలై పోతూ నాల్గు పీకడం. ఇంకో రోమియో ప్రపోజ్ చేయబోతూంటే, ‘నానమ్మన్రా నీకూ, చెప్తే చంపేస్తా’ అని కసిగా మనసులో అనుకోవడం. ట్రైలర్ ప్రారంభంలో సీనియర్ నటి లక్ష్మి కన్పిస్తుంది. ఆమె కథ ఈ ట్రైలర్ లో రివీలవుతుంది. 70 ఏళ్ల తను 24 ఏళ్ల సమంతగా మారిపోయే విచిత్రం. ఒక ఫోటో స్టూడియోలో ఫోటో దిగితే ఈ విచిత్రం జరుగుతుంది. దీంతో ఈ ట్రైలర్ మొదటి సగభాగం 24 ఏళ్ల సమంత, 70 ఏళ్ల బామ్మలా ప్రవర్తించడం మొదలెడుతుంది – కేర్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ. ఈ కలర్ఫుల్ ఫన్నీ దృశ్యాల తర్వాత, ట్రైలర్ రెండో సగంలో నార్మల్ గా ప్రవర్తిస్తుంది. ఎలాటి వాణ్ణి పెళ్లి చేసుకుంటుందో చెప్తుంది. చివర్లో లక్ష్మితో ఎమోషనల్ గా ఫ్లాష్ బ్యాక్ తాలూకు దృశ్యాలు వస్తాయి. ఈ ఆర్మీ జవానుగా అడివి శేష్ కన్పిస్తాడు.

కథ కొంత అందించీ అందించకుండా వూరిస్తూ వుంది ట్రైలర్. చూసి పూర్తి కథ తెలుసు కోవాలన్న ఆసక్తి రేపుతోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా దృశ్యాల చిత్రీకరణ వుంది రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణంలో. మిక్కీ జే మేయర్ పెప్పీ మ్యూజిక్ అందించాడు. ఇంకా నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావురమేష్ లు ఆయా పాత్రల్లో కన్పిస్తున్నారు.

కొరియన్ ఒరిజినల్ 14 భాషల్లో రీమేక్ అయింది. మరి తెలుగు రీమేక్ వాటితో పోటీ పడాలి. దీన్ని తెలుగు నేటివిటీకి అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరయ్యేలా నిర్మించాల్సి వుంటుంది. ఇది జరిగిందో లేదో విడుదలయ్యాక తెలుస్తుంది. దీన్ని తెలుగులో రీమేక్ చేయడంతో బాటు తమిళంలో డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. జులై 5 న విడుదల.
Oh Baby Theatrical Trailer | Samantha Akkineni, Naga Shaurya | Nandini Reddy | Suresh Productions