విశ్వక్ సేన్ వైవిధ్యం వున్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అలాంటి వైవిధ్యమున్న సినిమా ‘గామి’ అని విశ్వక్, చిత్ర నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రచారాలు కూడా విరివిగా చేశారు, ప్రచార చిత్రాలు చాలా ఆసక్తికరంగా కూడా వున్నాయి. ఈ సినిమా పూర్తి చేయడానికి సుమారు ఐదేళ్లు పట్టింది. ఈ సినిమాతో విద్యాధర కాగిత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసమని ఎక్కడో హిమాలయాల్లో మంచు బాగా కురిసే ప్రాంతాల్లో షూటింగ్ చేయడం, కొన్నిసార్లు ప్రత్యేకమైన ఋతువులకోసం ఎదురుచూడటం వంటివి చేయడంతో సినిమా పూర్తి చేయడానికి చాలా కాలం పట్టిందని చెబుతున్నారు.
ఇందులో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో కనపడనున్నారని ప్రచారాల్లో చెప్పారు. చాందిని చౌదరి కథానాయికగా నటించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని థియేటర్లలోకి వచ్చింది. శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోర, అతనికి మానవ స్పర్శ, అంటే ఇంకొక మానవుడిని ఎవర్ని ముట్టుకున్నా అతనికి అదొక రకమైన వ్యాధి వచ్చి చనిపోతాడు. శంకర్‌కి ఉన్న ఈ వ్యాధికి మందు హిమాలయాల్లోని త్రివేణి సంగమం దగ్గర ఉండే ఒక మొక్కలో ఆ ఔషధం ఉంటుందని, ఆ ఔషధం తీసుకుంటే శంకర్ వ్యాధి నయమవుతుందని స్వావిూజీ చెప్తాడు. ఈ మొక్క కూడా 35 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని.. ఆ సమయంలోనే ఆ మొక్కని తీసుకురావాలని చెప్తాడు.
జాహ్నవి (చాందిని చౌదరి) ఒక డాక్టర్, రీసర్చ్ కోసం అదే ఔషధం కోసం ప్రయత్నం చేస్తుంది. శంకర్‌ని ఆ హిమాలయాలకి తీసుకువెళతానంటుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలో ఒక గ్రామంలో దుర్గ అనే దేవదాసి తన కుమార్తె ఉమతో ఉంటుంది. ఆమెకు దేవదాసి నుండి తప్పించేస్తారు, కుమార్తెని దేవదాసిగా చేయాలని చూస్తారు. ఇంకోవైపు ఒక లేబరేటరీలో మనుషుల విూద వివిధ రకాలైన భయంకరమైన పరీక్షలు చేస్తూ ఉంటారు, అక్కడి నుండి ఒక అబ్బాయి తప్పించుకొని బయటపడతాడు. ఈ మూడు కథలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి. శంకర్‌కు ఆ ఔషధం తీసుకురావడంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరికి సాధించాడా? జాహ్నవి ఏమైంది? దేవదాసి కుమార్తె తప్పించుకొని ఎక్కడికి వెళ్లింది? బయటపడిన కుర్రాడు ఏమయ్యాడు? ఇవన్నీ ‘గామి’ సినిమాలో తెరకెక్కించారు.
తెలుగు సినిమాలో ఒక వైవిధ్యమైన కథ చెప్పాలని, సినిమా అంటే వ్యాపార విలువలే కాకుండా ఒక మంచి కథ కూడా చెప్పాలని ఈ చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నం చేసారు. ఇక తెరవిూద ఒక్కో సన్నివేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అందమైన ఆ మంచు ప్రదేశాలు, ఆ కొండలు, ఆ పర్వతాలు, ఔషధం కోసం శంకర్ పడే పాట్లు, సాహసాలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దర్శకుడు చాలా తెలివిగా కథనాన్ని అల్లుకున్నాడు. శంకర్‌కి ఎందుకు మానవ స్పర్శ తగలకూడదు.. తగిలితే ఏమవుతుంది అనే విషయాన్ని దర్శకుడు చివరివరకు ఆసక్తిగా కొనసాగించాడు. మరోవైపు గ్రామాల్లో జరిగే దేవదాసి సంప్రదాయం ఎంత కఠినంగా ఉంటుందో చూపించాడు.
అలాగే మనుషుల విూద ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు వాళ్ళ మధ్యలో కొంతమంది మనుషులు ఏ విధంగా నరకయాతన పడుతున్నారనేది చాలా బాగా చూపించాడు. ఈ సినిమాలో మాటలు తక్కువగానే ఉన్నప్పటికీ.. అవే చాలా ఆలోచింపజేసేలా ఉంటాయి.ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా ఉందంటే అందుకు చాయాగ్రహణం చాలా ముఖ్యం చాలా బాగా చూపించారు. దానికి తోడు నేపథ్య సంగీతం బాగా తోడై సినిమా ఇంకో లెవెల్‌కి వెళ్లడానికి ఉపయోగ పడిరది. వీటన్నింటిని జనరంజకంగా మలిచినందుకు దర్శకుడిని అభినందించాలి.
ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్సేన్ శంకర్‌గా మంచి నటనను ప్రదర్శించాడీ సినిమాలో. శంకర్ పాత్రలో మమేకం అయిపోయాడు. సినిమాలో మనకి నటులు గుర్తుకురారు పాత్రలే గుర్తుంటాయి. హీరోయిన్ చాందిని చౌదరి చాలా చక్కగా నటించింది. తెలుగమ్మాయిలు మంచి పాత్రలు వస్తే ప్రతిభ చూపిస్తారని చాందిని.. జాహ్నవి పాత్రలో నిరూపించింది. అభినయ దుర్గగా, ఉమగా వేసిన అమ్మాయి చాలా బాగా చేశారు. శంకర్ అనే ఒక అఘోర తనెవరో.. ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవాలని చేసే ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనల ఆధారంగా మలచిన చిత్రం. ఆ లాబరేటరీ పరీక్షలవి ప్రేక్షకులకి అర్థం కాకపోవచ్చు. వాటిని పక్కన పెడితే.. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.