9 కోట్ల సంవత్సరాల క్రితం నాటి తోక.. ఏ జీవిధంటే..

Dinosaurs: పశ్చిమ మయన్మార్ అంబర్ గుట్టల్లో శతాబ్దాలుగా దాగి ఉన్న ఓ అపూర్వ జీవన చరిత్ర వెలుగులోకి వచ్చింది. దాదాపు 9 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఓ చిన్న డైనోసార్ తోక, తన సహజ రూపంతోనే జిగురులో భద్రంగా దొరకడం శాస్త్రవేత్తలలో సెన్సేషన్‌గా మారింది. ఈ అవశేషాన్ని చైనా శాస్త్రవేత్త లిడా జింగ్ గుర్తించగా, ఇది ఇప్పటివరకు కనుగొన్న మొదటి త్రిమితీయ డైనోసార్ ఈకలతో కూడిన నమూనాగా రికార్డు సాధించింది.

ఈ శిలాజం విశ్లేషణలో తోక వెన్నెముకలు విడివిడిగా ఉండటం, ప్రాచీన పక్షికి చెందదని నిర్ధారించడంలో కీలకంగా మారింది. ఆకట్టుకునే అంశం ఏంటంటే.. తోక చుట్టూ ఇరువైపులా ఏర్పడిన సున్నితమైన, పొడవైన ఈకలు. ఇవి ఆధునిక పక్షుల ఈకల్లా కాఠిన్యంతో ఉండకపోయినా, వాటి నిర్మాణం డైనోసార్లలో ఈకల పుట్టుకపై కొత్త తలంపులకు దారి తీస్తోంది.

జిగురులో చిక్కుకున్న ఈ నమూనాలో ఎముకలు, కణజాలంతోపాటు రక్తంలోని ఇనుము ఆనవాళ్లు కనిపించాయి. దీంతో, జిగురులో చిక్కుకున్నప్పటికీ, జీవం అప్పటికి ఇంకా శరీరంలో ఉండి ఉండే అవకాశాన్ని నిపుణులు ఖరారు చేస్తున్నారు. ఈ కనుగొల్పు డైనోసార్ జీవశాస్త్రం పరిశోధనకు కొత్త పునాది వేసింది.

కచిన్ ప్రాంతం నుంచి లభించిన ఈ అంబర్ శిలాజం, ఇప్పటి వరకు చదునుగా దొరికిన ఫాసిల్ నమూనాలకంటే త్రిమితీయ వివరాలతో ఎంతో విలువైనదిగా మారింది. జీవ పరిణామ క్రమంపై శాస్త్రీయ ప్రపంచం ఇంకా అన్వేషణలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు దీని ద్వారా సమాధానాలు దొరికే అవకాశం ఉందని నిపుణులు ఆశిస్తున్నారు.