‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా జాన్వీ!

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తన తాజా సినిమా ’మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. తనకు చరిత్ర అంటే ఎంతో ఆసక్తి అని చెప్పిన జాన్వీ.. బీఆర్‌ అంబేడ్కర్‌, మహాత్మాగాంధీల గురించి మాట్లాడారు. ”ఈ ఇద్దరి గురించి వినడం, మాట్లాడటం నాకెంతో ఇష్టం. వీళ్లు మన సమాజానికి ఎంతో సాయం చేశారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారు.

అందుకే ఈ ఇద్దరికీ సంబంధించిన ఏ అంశమైనా నాకు ఆసక్తిగానే ఉంటుంది. కులాలపై అంబేడ్కర్‌ దృక్కోణం ముందునుంచీ చాలా కఠినంగానే ఉండేది. కాలక్రమేణా గాంధీ దాన్ని మారుస్తూ వచ్చారు. మన సమాజంలో కుల సమస్య అనేది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కులంపై మూడో వ్యక్తి అభిప్రాయం.. ఆ జీవితాన్ని అనుభవిస్తున్న వారి అభిప్రాయానికి మధ్య చాలా తేడా ఉంటుంది” అని చెప్పారు. ఇదే ఇంటర్వ్యూలో తన ఫొటోల గురించి జాన్వీ మాట్లాడుతూ.. ‘సెలబ్రిటీల తాజా ఫొటోల కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.

అందుకే తారలు కనిపించగానే ఫొటోగ్రాఫర్లు కెమెరాలతో క్లిక్‌మని పిస్తుంటారు. నేను ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం 25సార్లు విమానంలో ప్రయాణించా.. విమానాశ్రయానికి వెళ్లేసరికే ఫొటోగ్రాఫర్లు సిద్ధంగా ఉంటారు. ఇక సినీతారల కోసం ఫొటోగ్రాఫర్లు ఎదురుచూసే మరో ప్రదేశం జిమ్‌. జిమ్‌ బయట సెలబ్రిటీలను చాలామంది ఫొటోలు తీస్తుంటారు. నన్ను అలా తీయొద్దని చాలాసార్లు అభ్యర్థించాను. ఎందుకంటే జిమ్‌ చేసే సమయంలో బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటాను. ఆ దుస్తుల్లో తీసిన ఫొటోలు వైరలైతే నాకు అలాంటి డ్రెస్‌లే ఇష్టమని అందరూ భావిస్తారు. అందుకే జిమ్‌ బయట ఫొటోలు దిగడం నాకు నచ్చదు” అని చెప్పారు. దటీజ్.. జాన్వీ కపూర్‌!!