నటీనటులు : అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు.
దర్శకత్వం : ఏఆర్ మోహన్
నిర్మాత : రాజేష్ దండా
సంగీత దర్శకుడు : శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నేడు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం రండి.
కథ :
తెలుగు టీచర్ శ్రీనివాస్ (నరేష్ )కి తెలుగు అంటే ప్రాణం. అలాగే ఎవరైనా ఆపదలో ఉంటే ప్రాణాలు అర్పించి అయినా ఈయనగారు సంఘసేవ చేస్తుంటారు. (ఓ సందర్భంలో ఈ ముచ్చట ఈయనే స్వయంగా చెప్పుకున్నాడు). ఇలాంటి వ్యక్తి ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఓ మారుమూల గిరిజన ప్రాంతం అయిన మారేడుపల్లి కి వెళ్తాడు. అప్పటికే ప్రభుత్వం పై కోపంతో రగిలిపోతున్న అక్కడ ప్రజలు శ్రీనివాస్ కి సహకరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మి (ఆనంది) శ్రీనివాస్ కి సాయం చేస్తోంది. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ పై మారేడుపల్లి ప్రజలకు నమ్మకం కుదురుతుంది. దీనికితోడు అక్కడ వారి సమస్యల్ని చూసి చలించిపోయిన శ్రీనివాస్ వారి తరఫున పోరాడాలని నిర్ణయించుకుంటాడు. మారేడుమిల్లి ప్రజానీకానికి కావాల్సిన కనీస సౌకర్యాల కోసం శ్రీనివాస్ ఏం చేశాడు?,
మారేడుమిల్లి ప్రజానీకం హక్కులను ఎలా సాధించాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
స్వచ్ఛమైన మనస్తత్వాలకు – స్వార్థపూరిత ప్రభుత్వాలకు మధ్య గత 30 ఏళ్లుగా మారేడుమిల్లి ప్రజానీకం కన్నీళ్ళ కడలిలో నలిగిపోతుందనే కోణంలో మొదలైన ఈ చిత్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఎక్కడా బరువైన సంఘర్షణ మాత్రం కనిపించకపోవడం విచిత్రం. కథ కొత్తగా ఉండాలి అంటే.. నేపథ్యం కొత్తగా ఉండాలి అని తెలిసిన దర్శకుడికి. పాత్రలు వాటి ఆలోచనలు కూడా కొత్తగా ఉండాలని తెలియకపోవడం.. ఈ మారేడుమిల్లి ప్రజానీకం చేసుకున్న దురదృష్టం.
అసలు ఈ ట్రెండీ లోకంలో వెనుకబడిన ప్రాంతాన్ని తీసుకోవడమే రిస్క్.. దానికి తోడు ఆ పాత కాలపు కథనాలను, భావోద్వేగాలను ఇరికిస్తే సినిమాకి ఎలాంటి ఉపయోగం ఉండదు. తమ అమాయకత్వంతో 30 ఏళ్లుగా అన్యాయాలకి గురవుతున్నాం అని తెలుసుకున్న ప్రజలకు పోరాటాన్ని పరిచయం చేయడానికి తెలుగు మాస్టర్ గా నరేష్ వస్తాడు. పుస్తకాల్లో నాలుగు సూక్తులు చదివాడు అని చెప్పడానికి ఏమో.. మాట్లాడితే కోటేషన్స్ చెప్పేస్తున్నాడు.
ఇక నటన గురించి ఏం చెప్పాలి ?, మహర్షి సినిమాలో నరేష్, ఇక్కడ నరేష్ ఒక్కటే. అదే సింపతి ఎక్స్ ప్రెషన్స్. దర్శకుడు ఏఆర్ మోహన్ ను మెచ్చుకొని తీరాలి. సీరియల్ తీయాల్సిన స్క్రిప్ట్ తో సినిమా తీస్తాను అని నిర్మాతను ఒప్పించినందుకు. హీరోయిన్ ఆనంది తన పాత్రకు తగ్గట్టు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా బాగుంది. కాకపోతే.. అమెగారు గిరిజన యువతి నా ?, లేక గోదావరి జిల్లాలోని బ్యూటిఫుల్ పల్లెటూరు పడుచో అర్థం కాదు. పక్కన అమ్మాయిల క్యారెక్టర్స్ అన్నీ ఓకే టైప్ డ్రెస్ వేసుకుంటే.. మేడమ్ ఆనంది గారు మాత్రం మరో రకంగా కనిపిస్తోంది. మేడమ్ హీరోయిన్ కదా.. అందుకే స్పెషల్ అని మనం సరిపెట్టుకోవాలి. ఇలాంటి లొసుగులు చాలా ఉన్నాయి.
ఇక ఈ సినిమా కోర్ ఎమోషన్ కి మనం ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతాము అని చివరి డైలాగ్ వరకు ఆశగా ఎదురుచూస్తే.. చివరకు నిరాశే మిగులుతుంది. కాబట్టి.. గిరిజన మనుషులను అక్కడి పరిస్థితులను స్క్రీన్ మీద కనీస స్థాయిలో కూడా ప్రెజెంట్ చేయలేక పోయారు. ఇక సాంకేతిక వర్గం పని తీరు కూడా ఏవరేజ్ గానే ఉంది.
ప్లస్ పాయింట్స్ :
నేపథ్యం,
మెయిన్ పాయింట్,
నటీనటులు నటన,
మైనస్ పాయింట్స్ :
బోరింగ్ ప్లే,
కథాకథనాలు ఆసక్తికరంగా సాగకపోవడం,
స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ బాగాలేకపోవడం,
పాత కాలపు ఆలోచనలతో సాగిన టేకింగ్,
సిల్లీ డ్రామా,
తీర్పు :
సోషల్ ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఒకటి రెండు అంశాలు పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సిల్లీ అండ్ బోరింగ్ డ్రామాకి పరాకాష్టగా ఉండే ఈ సినిమా.. నేటి డిజిటల్ జనరేషన్ కి మరియు ఓటీటీ ప్రేక్షక లోకానికి ఏ మాత్రం నచ్చదు.
రేటింగ్ : 2/ 5
బోటమ్ లైన్ : మారేడుమిల్లి లో మ్యాటర్ లేదు !